ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamal Kumbhar : ఒంటరిగా ఎదిగి... ఎందరికో నీడై...

ABN, First Publish Date - 2023-01-02T00:04:15+05:30

ఆర్థిక స్వాతంత్య్రం కోరుకున్నందుకు నిందలు పడినా, వివాహబంధం విచ్ఛిన్నమైనా...పట్టుదలగా నిలబడి, జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు నలభై

Kamal Kumbhar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక స్వాతంత్య్రం కోరుకున్నందుకు నిందలు పడినా,

వివాహబంధం విచ్ఛిన్నమైనా...

పట్టుదలగా నిలబడి, జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు నలభై ఆరేళ్ళ కమల్‌ కుంభార్‌.

పలు పరిశ్రమల వ్యవస్థాపకురాలుగా రాణిస్తున్నారు. అయిదువేల మందికి పైగా శిక్షణనిచ్చి, ఉపాధి మార్గాలు చూపించారు.

ఇద్దరు రాష్ట్రపతుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న కమల్‌ ప్రయాణం గురించి... ఆమె మాటల్లోనే...

‘‘అత్తింట్లో ఉమ్మడి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. ఏ చిన్న అవసరం తీర్చుకోవడానికైనా పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేది. అందుకే వేణ్ణీళ్ళకు చన్నీళ్ళుగా.. నా వంతు ఏదైనా చెయ్యాలనుకున్నాను. కానీ అది నా జీవితాన్ని మలుపులు తిప్పుతుందని అనుకోలేదు. మాది మహారాష్ట్రలోని హింగ్లాజ్‌వాడీ గ్రామం. పదో తరగతి వరకూ చదివాను. ఆడపిల్లకు ఇక చదువక్కర్లేదంటూ... పదిహేడేళ్ళకే నాకు నా తల్లితండ్రులు పెళ్ళి చేశారు. ఉస్మానాబాద్‌ గ్రామీణ ప్రాంతంలో నా భర్త వ్యవసాయం చేసేవాడు. కానీ వచ్చిన ఆదాయం ఎటూ సరిపోయేది కాదు. దాంతో చిన్న చిన్న పనులకు వెళ్ళేదాన్ని. పుణే కేంద్రంగా... గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల స్వావలంబన కోసం పని చేస్తున్న ‘స్వయం శిక్షణ ప్రయోగ్‌’ (ఎస్‌ఎ్‌సపి) అనే ఎన్జీవో గురించి తెలిసింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న చేతి వృత్తుల శిక్షణలో చేరాను. కానీ అది మా అత్తింటివారికి ఇష్టం లేదు. పని పేరు చెప్పి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావంటూ నిందలు మోపి, నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటి పరిస్థితులు మారాలంటే... ఆడా మగా అందరూ పని చేయాలని చెప్పి చూశాను. వాళ్ళు వినిపించుకోలేదు. నా భర్త కూడా వాళ్ళకే వత్తాసు పలికాడు. చివరికి... నా వివాహ బంధాన్ని తెంచుకొని బయటపడాల్సి వచ్చింది.

రోజూ అయిదు గ్రామాలు నడిచి...

ఆ కష్ట కాలంలో ఎస్‌ఎ్‌సపి నిర్వాహకులే నన్ను ఆదుకున్నారు. గాజుల తయారీ నేర్చుకొని... రూ.500 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టాను. రోజూ గాజుల మూటతో మా చుట్టుపక్కల అయిదు గ్రామాలు నడిచి తిరిగేదాన్ని. లాభం తక్కువ, శ్రమ ఎక్కువ. నేను బతకడానికి అదొక్కటే సరిపోదనిపించింది. రెండువేల రూపాయలు కూడబెట్టి... పౌలీ్ట్ర, హేచరీ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాను. ఉస్మానాబాద్‌ దుర్భిక్ష పీడిత ప్రాంతం. అంతకుముందు కొందరు ఇక్కడ పౌలీ్ట్ర వ్యాపారం పెట్టి నష్టపోయారు. అయితే నిపుణుల సలహాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో... కొన్నాళ్ళకే అది లాభాలబాట పట్టింది. ఆ తరువాత సమీప గ్రామాల్లో ఇంటింటికీ బల్బులు, చీరలు, స్టేషనరీ అమ్మాను. ఒక మెస్‌ కూడా ఏర్పాటు చేశాను. మొత్తం ఆరు పరిశ్రమలు స్థాపించాను. పౌలీ్ట్ర, హేచరీలతో పాటు బడి పిల్లల కోసం ఒక మెస్‌, సేంద్రియ వ్యవసాయం, కంపోస్ట్‌ వ్యాపారం వీటిలో ఉన్నాయి. అయితే నా ప్రయాణాన్ని ఎక్కడ, ఎందుకు ప్రారంభించానో మరచిపోలేదు. ఏ ఇంటికి వెళ్ళినా... అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడేదాన్ని. మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో చెప్పేదాన్ని. వారికి ఉన్న అవకాశాల గురించి, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల గురించి వివరించేదాన్ని. ఆసక్తి చూపినవారిని... దగ్గరలోని స్వయంసహాయక బృందాల దగ్గరకి పంపేదాన్ని. నా సొంత వ్యాపారాల్లోనే మహిళలకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం ఆరంభించాను. కొన్నిటిని ఇప్పుడు వారే నడిపిస్తున్నారు. మరికొందరు సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకొని రాణిస్తున్నారు.

క్రమంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ఆహ్వానం మేరకు మా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటికి మహారాష్ట్ర వ్యాప్తంగా అయిదు వేలమందికి పైగా నా దగ్గర శిక్షణ పొందారు. మా ఊరివారే డెబ్భై మంది వరకూ ఉంటారు. వీరిలో ఎనభై శాతం మంది మహిళలు కాగా, మిగిలినవారు పురుషులు. వీరి కనీస ఆదాయం రూ 15 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఉంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, పిల్లల చదువుకూ, కుటుంబ అవసరాలకూ అండగా నిలబడడం చూస్తుంటే... నాకు చాలా సంతోషంగా ఉంది. ‘‘మీ ప్రాంతంలో తోటి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేతనైనంత సాయం చెయ్యండి’’ అని నేను అందరికీ చెబుతూ ఉంటాను.

సమాజానికి నా వంతుగా..

ఒకప్పుడు పది రూపాయల కోసం ఎంతో కష్టపడిన నేను ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాను. సమాజానికి నా వంతుగా సాయం అందిస్తున్నాను. మా ప్రాంతంల్లో విద్యుత్‌ కోత ఎక్కువ. పిల్లల చదువులకు ఎంతో ఇబ్బంది అవుతోంది. అందుకే ‘ఉర్జా’ అనే సంస్థ సహకారంతో... దాదాపు పాతిక గ్రామాల్లో మూడువేల సోలార్‌ లైట్లు పంపిణీ చేశాను. ఇంకా పలు కార్యక్రమాలు చేపడుతున్నాను. నేను చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వేతర సంస్థల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాను. 2017లో... ‘యునైటెడ్‌ నేషన్స్‌’- ‘నీతి అయోగ్‌’ నుంచి ‘ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ అవార్డు లభించింది. అదే ఏడాది ‘కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ) ఫౌండేషన్‌’ నుంచి ‘ఉమన్‌ ఎగ్జాంప్లర్‌’ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి స్వీకరించాను. ఈ ఏడాది ‘నారీ శక్తి’ పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నాను. ఇలా ఇద్దరు రాష్ట్రపతుల ద్వారా పురస్కారాలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహిళలు సంపాదనపరులై, ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. అప్పుడే సమాజంలో హుందాగా జీవించగలుగుతారు. ఇంటా, బయటా గౌరవం పొందగలుగుతారు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడం కోసం... ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. రాబోయే మూడేళ్ళలో... ఆ కేంద్రం ద్వారా పదివేలమంది మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నది నా ప్రణాళిక.’’

Updated Date - 2023-01-02T00:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising