Kirti Selvaraj: ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాఠం
ABN, First Publish Date - 2023-06-28T02:54:44+05:30
కీర్తి సెల్వరాజ్ సొంత ఊరు తమిళనాడులోని కళ్ళకురిచి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఇంజనీర్‌గా పని చేస్తున్న సమయంలో వివాహం జరిగింది. ‘‘అప్పటివరకూ సాగిపోతున్న నా జీవితం... నా భర్త తీరుతో నరకంగా మారింది. విడాకులతో మా వివాహ బంధం ముగిసిపోయింది.
‘‘మన చుట్టూ ఉన్న పర్యావరణం, జీవ జాతుల పరిరక్షణ బాధ్యత మనందరిదీ’’ అంటారు కీర్తి సెల్వరాజ్. చాలామందిలా ఆమె మాటలకే పరిమితం కాలేదు. వేల మంది విద్యార్థులను భాగస్వాములుగా చేసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. పక్షులు, చిత్తడిభూములు, అడవులను కాపాడు కోవడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కీర్తి సెల్వరాజ్ సొంత ఊరు తమిళనాడులోని కళ్ళకురిచి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఇంజనీర్‌గా పని చేస్తున్న సమయంలో వివాహం జరిగింది. ‘‘అప్పటివరకూ సాగిపోతున్న నా జీవితం... నా భర్త తీరుతో నరకంగా మారింది. విడాకులతో మా వివాహ బంధం ముగిసిపోయింది. అప్పటికే నాకొక కూతురు ఉంది. మా అమ్మాయిని తీసుకొని మా ఊరు వచ్చేశాను. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా చేరాను. నేను మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించిన రోజులవి’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు కీర్తి. నైరాశ్యం నుంచి బయటపడడానికి ఆమె ఫొటోగ్రఫీని ఎంచుకున్నారు. ఖాళీ సమయాల్లో తమ ఊరి సమీపంలోని నది, రిజర్వాయర్ ప్రాంతాల్లో పక్షులను, ప్రకృతి దృశ్యాలను కెమేరాలో బంధించేవారు. వాటిలో కొన్ని అరుదైన జాతుల పక్షులు కూడా ఉన్నాయి. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు... కొందరు మిత్రులు ఆ పక్షుల పేర్లను చెబుతూ ఉంటే... వాటి మీద మరింత పరిశోధన చెయ్యాలని ఆమె అనుకున్నారు. అలా తమ జిల్లాలో ఇప్పటివరకూ 155 పక్షి జాతులను రికార్డ్ చేశారు. వాటి వివరాలను ‘ఇ బర్డ్’ అనే అంతర్జాతీయ డేటా సర్వే ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేశారు.
ఎంత ముప్పో చెబుతున్నాను..
ఈ క్రమంలోనే... మన పర్యావరణానికీ, పక్షులకూ, జంతువులకూ ప్లాస్టిక్ వల్ల కలిగే హాని మనకు తెలిసిన దానికన్నా చాలా ఎక్కువ అని కీర్తి గ్రహించారు. ‘‘మనం అనాలోచితంగా పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, నేప్‌కిన్ల లాంటివి చెరువులు, నదులు తదితర నీటి వనరులను ఎంత కలుషితం చేస్తున్నాయో తలచుకుంటే భయం కలిగింది. అప్పటి నుంచి మా కాలేజీలో విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ గురించి చెప్పడం మొదలుపెట్టాను. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను చేపట్టి, వారిని కూడా భాగస్వాముల్ని చేశాను. నిజానికి పర్యావరణ పరిరక్షణ అందరూ నేర్చుకోవాల్సిన పాఠం. మా ప్రాంతంలోని పలు విద్యా సంస్థలకు చెందిన అయిదు వేల మందికి పైగా విద్యార్థులు నిబద్ధతతో కూడిన సైన్యంలా పని చేస్తున్నారు. వారి సహకారంతో వివిధ చోట్ల నీటి వనరులను, పరిసరాలను శుభ్రం చేశాం. ఇప్పటివరకూ పదిహేడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాం’’ అని చెప్పారు కీర్తి. ‘‘పక్షి జాతులు అంతరించిపోతూండడానికి మరో ప్రధాన కారణం... అవి నివాస ప్రదేశాల్ని కోల్పోవడం. అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఊళ్ళలో కూడా వాతావరణాన్ని సమతుల్యం చేసేటన్ని చెట్లను పెంచడం లేదు. ఇది ఎంత ముప్పో ప్రజలకు వివరిస్తున్నాను.
అదే విధంగా రోజువారీ జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, రీయూజ్ లేదా, రీసైకిల్ చెయ్యడం, చెట్లు పెంచడం వల్ల ప్రయోజనం గురించి చెబుతున్నాను. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను. నేను స్వయంగా ఇప్పటివరకూ వెయ్యికి పైగా మొక్కలు నాటాను’’ అని చెప్పారామె. మరోవైపు పక్షి జాతులను, వాటి సంఖ్యనూ నిర్ధారించడానికి అటవీ శాఖతో కలిసి ఆమె పని చేస్తున్నారు. తను తీసిన ఫొటోలతో జిల్లా పుస్తక ప్రదర్శనలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం అధ్యాపక వృత్తిని ఆమె వదిలేసినా... ఇప్పటికీ విద్యార్థులంతా ఆమె సారథ్యంలో పని చేస్తున్నారు. కీర్తి చేస్తున్న కృషికి గుర్తింపుగా కిందటి ఏడాది తమిళనాడు ప్రభుత్వం తరఫున కాలుష్య నియంత్రణ బోర్డు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది. ఇంకా అనేక సంస్థల నుంచి ఆమె సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. ‘‘మన పర్యావరణం ఎంతో గొప్పది మాత్రమే కాదు, చాలా సున్నితమైనది కూడా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దాన్ని ఇప్పుడు ఆదమరిస్తే... భవిష్యత్తులో తలెత్తే భయంకరమైన పరిణామాలకు మనం బలి కావాల్సి ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్న కీర్తి... పర్యావరణం, పక్షి జాతుల సంరక్షణకు వేదికగా ఒక ఎన్విరాన్‌మెంటల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన భవిష్యత్ ప్రణాళిక అని చెబుతున్నారు.
Updated Date - 2023-06-28T02:54:44+05:30 IST