మనలోని దైవాన్ని గుర్తిద్దాం
ABN, First Publish Date - 2023-03-17T05:45:10+05:30
ఒకసారి ఓ సద్గురువు ఆశ్రమానికి ఒక మహా పండితుడు వచ్చాడు. ‘‘టీ తాగుతారా?’’ అని అడిగాడు గురువు. ‘‘అలాగే’’ అన్నాడు పండితుడు.
ఒకసారి ఓ సద్గురువు ఆశ్రమానికి ఒక మహా పండితుడు వచ్చాడు. ‘‘టీ తాగుతారా?’’ అని అడిగాడు గురువు. ‘‘అలాగే’’ అన్నాడు పండితుడు. టీ తీసుకురమ్మని తన శిష్యుడొకరిని గురువు ఆదేశించాడు. శిష్యుడు టీ తెచ్చాక... దాన్ని గురువు ఒక కప్పులో పొయ్యడం ప్రారంభించాడు. కప్పు నిండిపోయింది. అయినా ఆయన పోస్తూనే ఉన్నాడు. కప్పులోంచి టీ బయటకు వచ్చేస్తోంది. అప్పుడు ఆ పండితుడు ‘‘మీరేం చేస్తున్నారు? కప్పు నిండిపోయింది. అందులో పోసేదంతా బయటకు వస్తోంది’’ అన్నాడు. ‘‘నీ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నీలో ముందుగానే అనవసరమైనవి ఎన్నో నింపుకొని ఉన్నావు. ముందు వాటన్నిటినీ తీసేసి, ఖాళీ అవడం ఎంతో అవసరం’’ అన్నాడు గురువు.
‘మానవుడు ఆత్మ జ్ఞానము లేక పుణ్య క్షేత్రాలలో దైవాన్ని వెతికేను, కస్తూరి మృగము తన నాభిలోని సువాసనను వనమెల్లా వెతికినట్టు’ అంటోంది ఒక కీర్తన. ఆలా మనిషి తనలో ఉన్న దైవాన్ని గుర్తించకుండా... బాహ్యంగా పరుగులు తీస్తున్నాడు. భ్రమలకు లోనై, నిజమైన దుఃఖం ఏమిటో, అసలైన సుఖం ఏదో తెలుసుకోలేకపోతున్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు మీరు కేవలం బాధపడగలరు. అది మీకు ఏ విధమైన సుఖాన్నీ కలిగించలేదు. మీ జీవితంలో దుఃఖాన్ని కలిగించేవి ఉన్నాయని మీకు అనిపిస్తే... సుఖాన్ని కలిగించేవి కూడా తప్పకుండా ఉంటాయి. మీరు ఎంతటి దుఃఖబాధల్లో ఉన్నప్పటికీ, అసలైన సుఖాన్ని అందించేది కూడా మీలోనే ఉంది. మనం ఆ దుఃఖాల నుంచి బయటపడేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. అయితే భగవంతుడు మనకోసం అన్నిటినీ మనం పుట్టకముందే ఏర్పాటుచేసి పెట్టాడు. అజ్ఞానం ఉందనుకుంటే జ్ఞానం ఉంది. చీకటి ఉందనుకుంటే వెలుగు ఉంది. మీలోనే ఉన్న ఆ దివ్యశక్తిని దర్శించడం, భ్రమలకు లోనుకాకుండా ఉండడం... జీవితంలో మీకు అవసరమైనది అదే.
Updated Date - 2023-03-17T05:45:10+05:30 IST