చీమ- మిడత
ABN, First Publish Date - 2023-02-11T00:00:45+05:30
ఒక అడవిలో ఓ జీవనది పారుతోంది. అక్కడ జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి. అసలే ఎండాకాలం. ఆహారం కోసం ఎవరి తిప్పలు వారివి.
ఒక అడవిలో ఓ జీవనది పారుతోంది. అక్కడ జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి. అసలే ఎండాకాలం. ఆహారం కోసం ఎవరి తిప్పలు వారివి. అయితే ఓ కష్టజీవి మాత్రం ప్రతిరోజూ పొలంలోకి వెళ్లి బియ్యం గింజలను తీసుకొస్తూంది. ఒక రోజు దారి మధ్యలో మిడత కనిపించింది. అది కూడా పాటలు పాడుతూ. ‘కష్టపడకు. నాతో వచ్చి పాడు. డ్యాన్స్ చేయి. మూర్ఖపు చీమా!’ అంటూ పాట పాడుతూనే అవహేళన చేసింది. చీమ పట్టించుకోలేదు. పైగా తన పనిని మానుకోలేదు. మళ్లీ పొలంలోకి వెళ్లి గింజలు తెస్తూనే ఉంది. అలసటే లేదా? అనేంతగా బియ్యాన్ని మోస్తూ ఉంది.
పది రోజుల తర్వాత కూడా చీమ కష్టపడుతోంది. మిడత మాత్రం దొరికింది తిని హాయిగా నిద్రపోతోంది. పగలు పాటలు పాడుతోంది. చీమ సలహాలనూ పట్టించుకోలేదు. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. బయటికి వెళ్దామంటే జోరువాన. తిండి దొరకలేదు. మిడతకు కష్టాలు మొదలయ్యాయి. పస్తులు ఉంటోంది. పాటలు పాడటం మానేసింది. దిగులుగా ఉంది. రోజంతా తిండి లేదు. నీరసం వచ్చింది. ఇంతలో చటుక్కున చీమ గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన తడవే చీమ ఇంటికి వెళ్లింది. చీమగారూ.. అంటూ మిడతా ఇంట్లోకి అడుగెట్టిందో లేదో హాయిగా పాటలు పాడుతోంది చీమ. మిడత తలదించుకుంది. సిగ్గుపడింది. ‘నేను పెద్ద తప్పు చేశా. పాటలు పాడుతూ ఇతరులను కించపరచకూడదని తెలిసింది. నీ అంత ముందు చూపు లేదు. ఆకలితో ఉన్నా. దయచేసి సాయం చేయి’ అన్నది. ‘అలా అనకు. తప్పు తెలుసుకున్నావు. నా ఇంట్లోనే కాదు నా మిత్రుల ఇంట్లో కూడా బోలెడంత ధాన్యం ఉంది. వాన తగ్గేంత వరకూ ఈ రాతికిందనే ఉండు’ అంటూ ఓ రాయిని చూపించింది. చీమకు ధన్యవాదాలు చెప్పింది. ఆ తర్వాత మిడత ఇలా పాటలు పాడటం, ఖాళీగా గడపటం మరెన్నడూ చేయలేదు. చీమ చెప్పిన పాఠం మిడత ఆనందానికి కారణమైంది. ముందుచూపుతోనే అది సాధ్యమైంది.
Updated Date - 2023-02-11T00:00:46+05:30 IST