బలవంతుల కొట్లాట
ABN, First Publish Date - 2023-03-25T01:43:29+05:30
ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అడవికి రాజు. కోపిష్టి. ఎవరినీ లెక్క చేయదు. జాలి,దయ లక్షణాల్లేవు. అదే అడవిలో ఒక అడవి పంది ఉండేది.
ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అడవికి రాజు. కోపిష్టి. ఎవరినీ లెక్క చేయదు. జాలి,దయ లక్షణాల్లేవు. అదే అడవిలో ఒక అడవి పంది ఉండేది. దానికి రెండు కోరలుండేవి. బలిష్టంగా ఉండేది. దేన్నీ లెక్కచేయని తత్వం దానిది. తనను ఏమైనా అంటే కోపంతో ఎవరిమీదయినా విరుచుకుపడేది.
అసలే వేసవికాలం.. బాగా దాహం వేస్తోందని ఒక చెరువు దగ్గరకు సింహం వచ్చింది. గాండ్రిస్తూ నీళ్లలోకి దిగే సమయంలో అంతే వేగంగా అడవి పంది వచ్చింది. ఇద్దరూ ఎదురుపడ్డారు. ఇద్దరూ ముక్కోపులే. ‘నేను నీళ్లు తాగి వెళ్లిన తర్వాత నువ్వు తాగు’ అన్నది సింహం. ఆ అడవిపందికి చిర్రెత్తుకొచ్చింది. ‘ఇది నేనుండే ప్రాంతంలో ఉంది. నీకంటే క్షణం ముందు నేనొచ్చా. అటు పక్కనుంచి ఇటు పక్కకు వచ్చానంతే. అయినా నీవేం గొప్ప. నేను ముందు తాగుతా. నాకూ గౌరవం ఇవ్వు ముందు’ అన్నది. సింహానికి పట్టరాని కోపం వచ్చింది. ‘అంటే నువ్వు నాతో సమానమా? నీకంత విషయమా? నీ స్థాయేంటో తెలుసుకో ముందు’ అంటూ హేళనగా మాట్లాడింది. నేనెందుకు భయపడాలి నీకు అంటూ అడవిపంది చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగబోయింది. ఒక్క ఉదుటున సింహం అడవిపందిమీద దూకింది. అడవి పంది తప్పించుకుంది.
ఇద్దరూ చెరువు గట్టుమీదకు వచ్చారు. తలపడ్డారు. భీకరమైన యుద్ధం. రెండు జంతువులకూ రక్తం కారుతోంది. కొట్లాడిన తర్వాత ఇద్దరూ నీరసపడిపోయారు. కొద్దిసేపు ఆగిన మళ్లీ కొట్లాడి.. ఓపిక లేక ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. అంతలో ఓ జంతువు వచ్చి ‘ఎవరోకరు ఈరోజు చచ్చిపోవాల్సిందే’ అంటూ కూత వేశారు. ‘ఇద్దరూ చచ్చిపోతే ఎంతటి అదృష్టం’ అంటూ మరో పక్షి అన్నది. ఈ విషయం విన్న తర్వాత ఇద్దరూ అలానే ఎదురెదురుగా నిలుచుని ఉన్నారు. ‘నువ్వెళ్లి నీళ్లు తాగు. మనం ఇక కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు’ అన్నది సింహం. అంతలోనే అడవిపంది కూడా ఇలా అంది.. ‘అవును. నేను కూడా ఇదే చెబుదామనుకున్నా. నువ్వే చెప్పావు. మనం చచ్చిపోతే మరొకరికి ఆనందమా?’ అన్నది. ఇరువురూ ఒకరికళ్లలో మరొకరు చూసుకుని స్నేహితులయ్యారు. ఇద్దరూ చెరువులోకి దిగి రక్తమోడిన గాయాలతోనే నీళ్లు తాగారు. ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.
Updated Date - 2023-03-25T01:43:29+05:30 IST