Donkey : పాపం గాడిద!
ABN, First Publish Date - 2023-03-17T23:10:59+05:30
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. బట్టలు ఉతికి జీవనం సాగించేవాడు. అతనికో కుక్క, గాడిద ఉండేవి.
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. బట్టలు ఉతికి జీవనం సాగించేవాడు. అతనికో కుక్క, గాడిద ఉండేవి. ఉదయం లేస్తూనే బట్టలను రేవుకు తీసుకెళ్లి, సాయంత్రం వచ్చేప్పుడు బట్టలను మళ్లీ ఇంటికి మోసుకొచ్చేది గాడిద. అయితే గాడిదను మాత్రం రామయ్య సరిగా చూసుకునేవాడు కాదు. కోపమొస్తే కట్టెతో కొట్టేవాడు. ఇదంతా గమనించేది గాడిద. లోలోపల బాధపడేది. ఏమిచేయాలో అర్థం అయ్యేది కాదు.
ఆ ఇంట్లో కుక్కది మరో తీరు. రోజంతా పడుకుని ఉండేది. రేవుకు వచ్చి అక్కడ కూడా నీడలో హాయిగా నిద్రపోయేది. అయితే తన యజమాని కుక్కమీదనే ప్రేమ చూపించేవారు. కుక్క కూడా యజమాని కుటుంబంతో విశ్వాసంగా ఉండేది. కుక్కకు మాత్రం మంచి ఆహారాన్ని ఇచ్చేవాడు రామయ్య. అది చూసి గాడిద బాధపడేది. ‘నేను కష్టం చేస్తున్నాను. అందుకే పరులంతా గాడిద కష్టం చేయకు’ అనేమాట వాడతారు అన్నది రామయ్యతో. అవునా? అన్నాడు యజమాని వెటకారంగా. కుక్కలానే నేను ప్రేమగా ఉంటాను. దానిలానే ప్రవర్తిస్తాను అన్నది. రామయ్య అవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. లోలోపల బాధతో, కుక్కమీద అసూయతో ఆరోజు ఉడికిపోయింది గాడిద.
ఒక రోజు రామయ్య సంతకు వెళ్లాడు. ఇంట్లోకి అడుగెడుతూనే కుక్కమాదిరే విశ్వాసం చూపించటానికి గట్టిగా తలుపు దగ్గరకు వచ్చి అరిచింది. అది భీకరమైన గాండ్రింపు. దీంతో పాటు తోక ఊపుకుంటూ యజమాని ముఖం దగ్గర మొహం పెట్టి గాడిద గాండ్రించింది. అది తను చూపుతున్న ప్రేమకు సంకేతం అని భావించింది. పైగా తన రెండు కాళ్లను రామయ్య మీదకు ఎత్తింది. కుక్కలా ప్రేమ చూపుతున్నాననే భావన గాడిదది. క్షణాల్లో రామయ్యకు కోపం చిర్రెత్తుకొచ్చింది. గాడిదకు పిచ్చిపట్టిందేమోనని.. కట్టెతో గట్టిగా బాదాడు. గాడిద బాధతో లోపలకు వెళ్లిపోయింది. ఆ ప్రవర్తన చూసి కుక్క కూడా దడుచుకుంది. మరుసటి రోజునుంచి గాడిద తన కష్టాలను పడింది. కానీ ఎవరితో ఏమీ అనలేదు. తన బతుకు తాను బతికింది.
Updated Date - 2023-03-17T23:11:03+05:30 IST