Elephant- ants: ఏనుగు- చీమలు
ABN, First Publish Date - 2023-07-29T04:24:36+05:30
ఒక అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది. దాని శక్తి ఎక్కువ. యుక్తి తక్కువ. అయితే బలమైనది, కోపిష్టి. దీంతో అడవికి రాజు అయిన సింహం ఏమీ అనేది కాదు. అసలు ఆ ఏనుగుతో ఏమీ చర్చించేది కాదు సింహరాజు.
ఒక అడవిలో ఓ పెద్ద ఏనుగు ఉండేది. దాని శక్తి ఎక్కువ. యుక్తి తక్కువ. అయితే బలమైనది, కోపిష్టి. దీంతో అడవికి రాజు అయిన సింహం ఏమీ అనేది కాదు. అసలు ఆ ఏనుగుతో ఏమీ చర్చించేది కాదు సింహరాజు. మిగతా పులులు, చిరుతలు, హైనాలు.. ఇలా ఏనుగు అంటే భయపడి చచ్చేవి. దాని ఎదుర్కోవటం అసంభవం అనేవి. అయితే ఒక రోజు ఏనుగు దారిలో వెళ్తోంది. అదే దారిలో సింహరాజు వస్తోంది. సింహరాజు వెనకాల వందిమాగధులైన కోతి, ఎలుగు లాంటి కొన్ని జంతువులున్నాయి. సింహరాజును చూసి ఏనుగు ఈసడించుకుంది. దీంతో సింహరాజు వెనకాల ఉండే జంతువులు ‘రాజుకే ఇంతటి పరాభవమా?’ అన్నాయి. ‘ఈ అడవిని విడిచి వెళ్లు.. లేదా ప్రాణాలతో బతకవు’ అన్నది కోపంగా సింహరాజు. దీంతో ఇద్దరూ పోట్లాడారు. చివరికి సింహరాజు చచ్చిపోయింది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇక ఏనుగు మీద అలవిగాని భక్తి చూపాయి.
ఏనుగు రాజులా ఉన్నది. దీంతో ఏనుగు మాట ఇట్లే వినేవారు. ఒకరోజు అడవిలో వెళ్తూ వెళ్తూ ఓ చీమల పుట్టను ఏనుగు తన్నింది. పుట్ట పగిలిపోయింది. ఇంత అహంకారమా? అన్నాయి. క్షమాపణ చెప్పమని కోరాయి. ఏనుగు చెప్పలేదు కదా.. మీవి అల్ప బతుకులు అన్నది. దీంతో చీమలకుకోపం వచ్చింది. ఏనుగు మరుసటి రోజు నిద్రపోతున్నది. చీమలన్నీ వెళ్లి ఏనుగు మీద దాడిచేశాయి. కుట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే చర్మం మందంగా ఉంది. దీంతో రెండో ప్రణాళిక వేసాయి. కొన్ని చీమలు రెండు కళ్ల దగ్గరకు వెళ్లాయి. మరి కొన్ని చీమలు రెండు చెవుల్లో దూరాయి. లోపలికి వెళ్లి కుట్టి కుట్టి పెట్టాయి. అంతటి ఏనుగు దిక్కుతోచన బాధతో పొర్లాడింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. పిచ్చి పట్టిన దానిలా గెంతింది. చివరకు కళ్లు కనపడక కొండమీద నుంచి కిందపడిపోయింది. ప్రాణాలు పోయాయి. ‘చీమలతో గొడవ పెట్టుకున్నందుకు ఇలా బాగానే జరిగింది’ అన్నాయి మిగతా జంతువులు. చీమలు మాత్రం మా పుట్టను పడగొడితే ఊరికే ఉంటామా? అనుకుంటూ ఆహారం కోసం వాటిపనుల్లో అవి నిమగ్నమయ్యాయి.
Updated Date - 2023-07-29T04:24:36+05:30 IST