Fox: నక్క తెలివి!
ABN, First Publish Date - 2023-03-21T23:02:45+05:30
ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉండేది. దాని తెలివి చూసి అందరూ అసూయపడేవాళ్లు. ‘నా కంటే క్రూరమృగాలున్నాయి. వాటికి జాలి లేదు. దయలేదు.
ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉండేది. దాని తెలివి చూసి అందరూ అసూయపడేవాళ్లు. ‘నా కంటే క్రూరమృగాలున్నాయి. వాటికి జాలి లేదు. దయలేదు. చిన్న జీవిని ఇలా అనటం ఎందుకు?’ అంటూ తన వాదన వినిపించేది. అయినా ఈ రోజుల్లో తెలివి లేకుంటే బతికేదెలా? అంటూ చెప్పుకొచ్చేది. అయితే దాన్ని నమ్మేవాళ్లు కారెవరూ. అయితే నమ్మశక్యం కాని విషయాలను కూడా నమ్మేట్లు చేయటం ఆ నక్క తెలివిని ఉపయోగించేది.
నక్క ఎక్కడ చూసినా ఇబ్బందులు పాలయ్యేది. అయితే తెలివితో తప్పించుకోనేది. దాని చాకచక్యం ముందు బలాదూరే ఎవరైనా. ఒకరోజు సింహానికి చిక్కింది. గొంతు కొరికి చంపే సమయంలో.. ‘ఈ అడవిలోకి ఉదయాన్నే ఓ బలిష్టమైన సింహం ప్రవేశించింది’ అంటూ అబద్ధం చెప్పింది. ‘నేనే రాజును ఈ అడవికి. అదెక్కడుందో చూస్తా’ అంటూ ఆ సింహం కొత్త సింహం కోసం పరిగెత్తింది. అలా నక్క తప్పించుకుంది. కొంత దూరం వెళ్లగానే పొరబాటున ఓ బావిలో పడింది నక్క. గట్టిగా అరచింది. తన మిత్రులెవరూ రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు.
అలా రాత్రంతా ఆ పాడుబడిన బావిలోనే బాధతో ఉండిపోయింది. ఇక తనను బతికించటానికి ఎవరూ రారామో అనుకుంది. ఆకాశం వైపు చూస్తూ దేవున్ని ప్రార్థించింది. అంతలోనే దేవుడే పంపించాడేమో అన్నట్లు ఓ బలిష్టమైన ఎత్తయిన మేక ఒంటరిగా అటు వైపు వచ్చింది. బావిలోకి తొంగి చూసింది. నక్క కనపడింది. ‘నక్క బావా నీళ్లున్నాయా?’ అని అడిగింది బావిలోకి చూస్తూ. ‘అవును. నీకెలా తెలుసు. అసలే ఎండాకాలం. బయట నీళ్లు ఎండిపోయాయి. ఈ బావి చాలా చిన్నదే. అయితే నీళ్లు ఊరుతున్నాయి. ఎంత రుచిగా ఉన్నవో’ అన్నది. నక్కమాటలు తీయగా అనిపించాయి. అసలే దప్పికతో ఉండే మేక బావిలోకి దూకింది. ఒక్క ఉదుటున నక్క మేక మీదకు ఎగిరి దాని తలమీద నుంచి శక్తినంతా కూడగట్టుకుని బావిపైకి ఎగిరింది. గట్టుపైన నుంచి తొంగి చూసింది నక్క. మేమే.. అంటూ మేక అరుస్తోంది. ఏమీ తెలీనట్లుగా నక్క అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. మార్గ మధ్యంలో చిరుతపులి కనపడితే.. దగ్గరలో ఉండే చిన్నబావిలో మేక ఉంది. అది రుచిగా ఉంటుందని చెబుతూ వెళ్లిపోయింది.
Updated Date - 2023-03-21T23:02:45+05:30 IST