Story : హంస మంచితనం!
ABN, First Publish Date - 2023-10-21T23:36:03+05:30
ఒక అడవిలో ఓ కాకి ఉండేది. దానికి అందంలేదని బాధపడింది. నల్లగా ఉండటం తనకే నచ్చలేదు. ఈ రంగు దేవుడు నాకెందుకు ఇచ్చాడో.. అంటూ దేవున్ని నిందిస్తోంది. అసలు నల్లగా
ఒక అడవిలో ఓ కాకి ఉండేది. దానికి అందంలేదని బాధపడింది. నల్లగా ఉండటం తనకే నచ్చలేదు. ఈ రంగు దేవుడు నాకెందుకు ఇచ్చాడో.. అంటూ దేవున్ని నిందిస్తోంది. అసలు నల్లగా ఎందుకు పుట్టాను? అంటూ అందరి దగ్గరకు వెళ్లి అడిగినా సమాధానం లేదు. ఒక రోజు ఉదయాన్నే పైకి ఎగురుతూంటే చెరువులో తెల్లని హంస కనపడింది. క్షణాల్లో హంస ఉండే ప్రాంతం దగ్గరకు వచ్చింది. ‘ఇంత తెల్లగా ఎందుకు ఉన్నావు’ అంటూ అడిగింది కాకి. హంస నవ్వింది. మనం ఎవరం మన పుట్టుకను ఎదిరించలేం. అది జాతి పరంగా వచ్చిన నలుపు. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ‘మీ గొప్పతనం మీది’ అంటూ మాట్లాడితే.. కాకికి అభయం ఇచ్చినట్లు అనిపించింది. సంతోషపడింది.
ఆ రోజు రాత్రి హాయిగా గూటిలో నిద్రపోయింది కాకి. మరుసటి రోజు ఉదయాన్నే హంస దగ్గరకు వచ్చింది. అలా వస్తూ పోతూ హంస- కాకి మిత్రులయ్యారు. హంస అందంగా ఉందే కానీ.. పిచ్చిది అనుకుంది. ఇంత మంచితనం పనికి రాదు అనుకుంది. అయితే ఆ హంసకు మాత్రం మంచి తనం కాస్త ఎక్కువే. దేన్ని చూసినా చలించిపోయేది. కాకి మాత్రం పట్టించుకునేది కాదు. తెలివైనది. ‘ఈ తెలివి ఉండటం వల్లనే నువ్వు జాగ్రత్తగా బతుకుతావు’ అంటూ హంస అనేది. అలాంటి మాట విన్నప్పుడు కాకి సంతోషపడేది.
ఒక రోజు వేటగాడు అడవిలోకి వచ్చాడు. జ్వరం రావటం వల్ల అతను కృంగిపోయాడు. ఓ చెట్టు కింద పడుకున్నాడు. నిద్రపోయాడు. అతనికి చెమటలు పడ్డాయి. దారింటా వెళ్తున్న హంస- కాకి చూశాయి. హంస దగ్గరగా వెళ్లి చూసింది. అయ్యో.. ఇబ్బందుల్లో ఉన్నాడేమో మనిషి.. అనుకుంటూ హాయిగా తన రెక్కలతో విసనకర్రలా ఊపింది. హాయిగా నిద్రపోతున్నాడు ఆ వేటగాడు. హంస మాత్రం తన మంచి తనాన్ని గర్వంగా చాటుకుంటోంది.
ఆకలిగా ఉంది కాకికి. గట్టిగా కావ్ కావ్ అని అరిచింది. పైగా చెట్టుపై నుంచి వేటగాడి మీద రెట్ట వేసింది. నిద్రలో ఉండే వేటగాడికి వాసన వచ్చింది. వెంటనే నిద్రలేచాడు. కోపంతో చూశాడు. భయపడిన హంస ఒక్కసారిగా రెక్కలను ఊపలేదు. తన మీద రెట్టను వేసిన హంస ఇదేనని భ్రమపడి ఆ వేటగాడు హంసను ఒక్క ఉదుటున బాణంతో కొట్టేశాడు. అక్కడే హంస నెత్తురు కక్కుకుని చనిపోయింది. పైన ఉండే కాకి క్షణాల్లో జరిగిన ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ‘ఇంత మంచితనం పనికిరాదు. ఈ మనుషులతో జాగ్రత్తగా ఉండాలి’ అనుకుంటూ బాధపడింది కాకి. తనకు ఆ తెలివి ఉంది కాబట్టి ఎక్కడా దొరకలేదు. హంస మిత్రుడుని మాత్రం బతికించుకోలేకపోయాని కాకి బాధపడింది. దాని బాధను ఓదార్చేవారు లేరు ఇప్పుడు.
Updated Date - 2023-10-21T23:36:03+05:30 IST