నాగభూషణం.. ‘రక్తకన్నీరు’
ABN, First Publish Date - 2023-09-10T00:17:02+05:30
తెలుగునాట సాంఘిక నాటకాల చరిత్రలో ‘రక్తకన్నీరు’ది ఒక ప్రత్యేక అధ్యాయం...
తెలుగునాట సాంఘిక నాటకాల చరిత్రలో ‘రక్తకన్నీరు’ది ఒక ప్రత్యేక అధ్యాయం. తమిళంలో ఎం.ఆర్.రాధ ప్రదర్శించే ‘రక్త కన్నీర్’ నాటకం చూసి ప్రేరణ పొందిన నటుడు నాగభూషణం రచయిత పాలగుమ్మి పద్మరాజుతో ఆ నాటకాన్ని తెలుగులో తిరగ రాయించారు. ‘రక్తకన్నీరు’ నాటకం తొలి ప్రదర్శన 1956 మే నెలలో నెల్లూరులో జరిగింది. సంచలనం సృష్టించింది. తమిళంలో రాధ అనుసరించిన పద్ధతినే తెలుగులోనూ ఫాలో అయ్యారు నాగభూషణం. నాభిలోంచి శ్వాస తీసుకుంటూ వెక్కిళ్లు పెడుతున్నట్లు మాట్లాడడం, మాటిమాటికీ ‘రామా’ అంటూ శోకాలు పెట్డడం .. ఇవన్నీ రాధ అనుకరణలే. అయినా జనం వాటిని విపరీతంగా ఆదరించారు. ఇక అప్పటి నుంచి ‘రక్తకన్నీరు’ నాటకాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారో లెక్కే లేదు. ప్రతి ఏడాది నవంబర్ నెల నుంచి జూన్ వరకూ ఆంధ్రదేశంలో తిరుగుతూ నెలకు పాతిక ప్రదర్వనలు ఇచ్చేవారు నాగభూషణం. జులై నుంచి అక్టోబర్ వరకూ వర్షాలు పడుతుంటాయి కనుక ఆ సమయంలో ప్రదర్శనలకు విరామం ఇచ్చేవారు. ఒకే నెలలో 32 ప్రదర్శనలు, ఒకే ఊళ్లో రెండు ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. 1959లో కాకినాడలో అయితే ‘రక్తకన్నీరు’ నాటకాన్ని వరుసగా 14 రోజుల పాటు ప్రదర్శించారు. అప్పటికి నాగభూషణానికి ఇంకా సినిమా గ్లామర్ రాలేదు.
ఆ రోజుల్లో నాగభూషణం నెలకొల్పిన రవి ఆర్ట్ థియేటర్స్ సంస్థ మీద మొత్తం 30 కుటుంబాలు ఆధారపడి ఉండేవి. వాణిశ్రీ, శారద ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించే సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. రేవతి, మీనాకుమారి,, సుజాత, ఆదోని లక్ష్మి కూడా ఈ నాటకం ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. 1961 నుంచి 67 వరకూ నాగభూషణం ఏటా రెండు మూడు సినిమాల్లోనే నటించే వారు. మిగిలిన సమయాన్ని ‘రక్తకన్నీరు’ నాటకం కోసం కేటాయించేవారు. అయితే 1967లో ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం విడుదల అయ్యాక ఆర్టిస్ట్‌గా ఆయన బిజీ అయ్యారు. అయినా ప్రతి నెలా మొదటి వారం నాటకాలకు కేటాయించేవారు. నాగభూషణం.. ఇంటి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ప్రేక్షక హృదయాల్లో ఆయన ఎప్పటికీ ‘రక్తకన్నీరు’ నాగభూషణమే!
Updated Date - 2023-09-10T00:17:42+05:30 IST