Nimushkavi Vasanthi: ‘మగ’ మాటలు ఒడగొట్టుకోవాలి
ABN, First Publish Date - 2023-08-23T03:22:59+05:30
లింగ వివక్షను ప్రతిబింబించే పదాలను కోర్టు తీర్పుల్లో ప్రయోగించద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళల విషయంలో మూస పద్ధతిలో పదాల వాడకానికి స్వస్తి పలకాలంటూ ‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ పేరుతో మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మూస పదాల వాడకానికి స్వస్తిపలుకుతూ వెలువడిన ఈ హ్యాండ్ బుక్ మీద నల్సార్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిముషకవి వాసంతి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు.
లింగ వివక్షను ప్రతిబింబించే పదాలను కోర్టు తీర్పుల్లో ప్రయోగించద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళల విషయంలో మూస పద్ధతిలో పదాల వాడకానికి స్వస్తి పలకాలంటూ ‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ పేరుతో మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మూస పదాల వాడకానికి స్వస్తిపలుకుతూ వెలువడిన ఈ హ్యాండ్ బుక్ మీద నల్సార్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిముషకవి వాసంతి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుల్లో విచారణ, తీర్పుల సమయంలో లింగ సమానత్వాన్ని ప్రతిబింబించే మాటలను ఉపయోగించేలా మార్గ నిర్దేశం చేస్తూ ‘‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ కరదీపికను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఇది చాలా మంచి విషయం. అదే సమయంలో అనుచిత పదాలు వాడకూడదని కూడా సూచించింది. దీన్ని న్యాయపరిపాలనతో పాటు మిగతా సామాజిక రంగంలోని వారంతా కూడా స్వాగతిస్తున్నారు. మంచి మార్పునకు ఇదొక తొలి అడుగు. ఒక్కోసారి కొన్ని పదాలను మూస పద్ధతిలో అలవోకగా వాడేస్తుంటాం. అదీ పతిత, వేశ్య లాంటి చాలా పదాలను కేవలం మహిళలను అడ్రస్ చేసేప్పుడు ప్రయోగిస్తుంటాం. అలాంటివి వాడకూడదు అని ఈ హ్యాండ్ బుక్ నొక్కిచెబుతుంది. వాటికి బదులుగా ఎలా ప్రస్తావించవచ్చు అని కూడా మార్గనిర్దేశం చేస్తుంది.
కనుక న్యాయమూర్తులకు ఇదొక అద్భుతమైన కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు. కెరీర్ ఉమెన్, చేస్ట్ ఉమెన్ (పవిత్రురాలు) లాంటి పదాలకు బదులు మహిళ (ఉమెన్) అనాలని హ్యాండ్‌బుక్‌లో సూచించారు. డ్యూటీఫుల్ వైఫ్, ఒబీడియంట్ వైఫ్, ఫెయిత్‌ఫుల్ వైఫ్ లాంటి పదాలకు బదులు ‘వైఫ్’ అని మాత్రమే ప్రస్తావించాలని కూడా చెప్పారు. ఇలా వివక్షతకు తావుయిచ్చే చాలా మాటలను నిరోధించారు. అయితే, హౌస్‌వై్‌ఫకు బదులుగా హోమ్ మేకర్ అనచ్చు అన్నారు. హోమ్ మేకర్ అనేకంటే కూడా, ఉమెన్ అనచ్చు కదా.! ఇలా చాలా పదాలకు లింగ సమానత్వాన్ని కలిగిన సమాన అర్థాలు లేవు. అలాంటి వాటిని ఇంకా కొత్తగా రూపొందించుకోవాలి. ‘మగ’ మాటలు ఒడగొట్టుకోవాలి. అందులోనూ మన మాతృభాషలో మరింత పదసంపదను సృష్టించుకోవాలి.
ఫెమినిస్ట్ జడ్జిమెంట్ ప్రాజెక్టు...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ వల్లే ఇలాంటి అరుదైన హ్యాండ్‌బుక్ బయటకు వచ్చింది. అయితే, ఇలాంటి హ్యాండ్ బుక్ రూపకల్పన వెనుక మహిళా సంఘాల సుదీర్ఘ పోరాటం లేకపోలేదు. వాళ్లు ఎప్పటి నుంచో తీర్పుల్లోని కొన్ని పదాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పదాలను వాడాలని అడుగుతున్నారు. ఆరేళ్ల కిందట ‘ఫెమినిస్ట్ జడ్జిమెంట్ ప్రాజెక్టు’ పేరుతో పెద్ద సదస్సు ఒకటి ఢిల్లీలో జరిగింది. అందులో జస్టిస్ చంద్రచూడ్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహిళల అంశాల మీద కొందరు పురుష న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ, వెల్లడించిన ముఫ్ఫై క్లిష్టమైన తీర్పులను ఎంపిక చేసుకున్నాం. వాటిని స్త్రీవాద దృక్పథం నుంచి తిరగరాసే ప్రయత్నం చేశాం. అందులో ‘ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీర్పులో... ఇండియన్ పీనల్ కోడ్ కింద మ్యారిటల్ రేప్ నేరం కాదు అంటూ వెలువడిన జడ్జిమెంట్‌ను ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి... దాన్ని ఐపీసీ నుంచి మినహాయించకూడదు. మ్యారిటల్ రేప్‌నూ నేరంగా పరిగణించాలంటూ తీర్పు తిరగ రాశాను. ఆ సదస్సుకు దేశం నలుమూలల నుంచి న్యాయనిపుణులు చాలామంది హాజరయ్యారు. వారందరి సమక్షంలో.. తీర్పుల్లో ఎలాంటి పదాలు వాడకూడదు అనే అంశంపై పెద్ద చర్చ సాగింది. దాంతో పాటు లింగ వివక్షకు తావులేకుండా జడ్జిమెంట్లు ఎలా రాయాలి లాంటి విషయాలకూడా చర్చకు వచ్చాయి.
చట్టాల్లోనూ మార్పు అవసరం...
ఈ హ్యాండ్ బుక్‌లో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి చాలా పదాలను సూచించారు. పైగా గతంలో కొన్ని తీర్పుల్లో ఎలాంటి అనుచిత పదాలు వాడారో కూడా ఉదాహరించారు. ప్రొవొకేటింగ్ క్లాతింగ్ లాంటివాటిని వాడద్దు అన్నారు. అన్‌వెడ్ మదర్, ఎఫైర్... అలాంటి వాటిని అనుచిత పదాలుగా ప్రస్తావించారు. ఫోర్స్‌బుల్ రేప్ అనే పదాకి బదులు రేప్ అని వాడాలి అన్నారు. దీన్ని అంతా స్వాగతిస్తారు.
అయితే, కొన్ని విషయాలకు సంబంధించి చట్టాల్లో మార్పు చేయకుండా, కేవలం భాషరూపంలో మాత్రమే మార్చడం వల్ల ప్రయోజనం అంతంతమాత్రమే.! రేప్‌ను కేవలం లైంగిక పరమైన విషయం వరకే పరిమితమై చూడకుండా, అందులోని హింసాత్మక పార్శ్వం గురించి కూడా మాట్లాడాలి. కానీ చాలా తీర్పుల్లో అది మనకు కనిపించదు. గృహహింస చట్టం కింద నమోదయ్యే కేసులను సీరియ్‌సగా తీసుకోరు. భార్యను భర్త హింసిస్తే దాన్ని నేరంగా చూసే పరిస్థితి లేదు. ఇలాంటి విషయాల్లో మార్పు అవసరం.
అమలు తీరు...
హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను అమలు చేయడం చాలా సులువు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను మిగతా కోర్టుల్లోని న్యాయమూర్తులు కచ్చితంగా అమలు చేస్తారు కనుక, తీర్పు ఎలా వెలువరించినా, భాష విషయంలో మాత్రం వీలైనంత త్వరలో మార్పులను చూస్తాం. తద్వారా భావంలోనూ కొంత మార్పు వస్తుందేమో చూడాలి.! ఒకప్పటితో పోలిస్తే మహిళా న్యాయమూర్తుల సంఖ్య కూడా కాస్త పెరిగింది. కనుక జెండర్ సెన్సిటివిటీతోనే పదాలను వాడతారని, దీని పట్ల మిక్కిలి అవగాహనతో ఉంటారని ఆశిస్తున్నాను. రాజకీయ నాయకులు సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాలని కౌషల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కనుక రాజకీయ నాయకులు కూడా మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు. ఒకవేళ వారు నోరుజారితే కేసు నమోదు చేయచ్చు కూడా.
చట్టాలతో మార్పు సాధ్యమా అంటే...
కొన్ని అంశాలలో మార్పు చట్టాల వల్ల కలుగుతుందా లేదా సామాజిక చైతన్యం ద్వారా లభిస్తుందా... అనడిగితే చెప్పడం కష్టం. కొన్ని విషయాల్లో చట్టం చేసినా, సమాజంలో మార్పు రానప్పుడు వృధా అవుతుంది. ఉదాహరణకు వరకట్న నిషేధం చట్టం చేసినప్పటికి, సమాజంలో మార్పు లేదు కదా.! పైగా కట్నం తీసుకోవడం తప్పు కాదు అనే అవగాహనతోనే ఎక్కువ
మంది ఉండటం చూస్తాం. సమాజంలో మార్పు లేదు కదా అని చట్టం చేయకుండా వదిలేయడం సరికాదు. కనుక మార్పు రావాలి అంటే, చట్టపరంగా, సామాజిక పరంగా రెండు వైపుల నుంచి ప్రయత్నాలు సాగాలి. అలాంటి ప్రయత్నంలో భాగమే ఈ కరదీపిక కూడా. దీన్ని ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే కాదు మీడియా తదితర రంగాలు కూడా అనుసరిస్తే మంచిది. తద్వారా జెండర్ స్టీరియోటైప్ పదాలకు ప్రత్యామ్నాయ పదాలు వాడుకలోకి వస్తాయి.
పదాల వెనుక భావాన్ని అర్థం చేసుకోవాలి
- జస్టిస్ రాధారాణి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
మనం పెరిగిన వాతావరణం, సామాజిక పరిస్థితుల వల్ల మహిళల పట్ల మనలో కొన్ని పక్షపాత భావనలు, అభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి మూస ధోరణులను, కాలం చెల్లిన భావనలను ‘హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్’ క్షుణ్ణంగా చర్చించింది.
ఇందులోని ప్రతి పదం, ప్రతి పుట చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలి. అర్థం చేసుకోవాలి. తద్వారా సమాజ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన పాత భావనల నుంచి బయట పడటానికి ప్రయత్నించాలి. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే. కనుక వాళ్లలోనూ మహిళల పట్ల కొన్ని అభిప్రాయాలు బలంగా నెలకొనుండటం చూస్తుంటాం.
వాటిని వదిలించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్ బుక్‌లో కొన్ని తీర్పులను కూడా ఉదాహరించారు. ఏ తీర్పులో స్టీరియోటైప్ పదాలను వాడారో కూడా ప్రస్తావించారు. దాంతో పాటు పక్షపాత భావనల నుంచి ఎలా బయటపడాలో కూడా చక్కగా మార్గనిర్దేశం చేశారు. ఇవాళ రాజకీయ పార్టీలు కూడా మహిళల పట్ల కొన్నిరకాల భావనలు కలిగి ఉన్నాయి కనుకే, తక్కువ సీట్లు కేటాయిస్తున్నారు. అలా కాకుండా, మహిళలను సమానత్వ భావనతో చూడటం అవసరం. ప్రతి ఒక్కరూ హ్యాండ్ బుక్‌లోని పదాల వెనుక భావాన్ని అర్థం చేసుకోవాలి. మనలోని సంకుచిత తత్వాన్ని వదిలించుకోవాలి.
-సాంత్వన్
Updated Date - 2023-08-23T03:22:59+05:30 IST