Allaha: జ్ఞాన సంపదే మిన్న
ABN, First Publish Date - 2023-06-01T23:21:33+05:30
పాలకుడైన సులైమాన్‌కు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ తాను చక్రవర్తిని కావాలనీ, తన కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపించాలనీ కోరిక కలిగింది. ఆ కోరికను అల్లాహ్‌కు విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన దూత అయిన జిబ్రాయిల్ ద్వారా మూడు మూటలను సులైమాన్‌కు పంపించారు. అవి: కీర్తి శిఖరాల మూట, ధన సంపదల మూట, జ్ఞాన సంపదల మూట.
సందేశం

‘‘వీటిలో మీకు ఏది కావాలో దాన్ని తీసుకోవచ్చని అల్లాహ్ తెలియజేశారు’’ అని జిబ్రాయిల్ చెప్పాడు.
సులైమాన్ చాలాసేపు ఆలోచించారు. తన వంశంలో ఎవరో ఒకరు చేసే చిన్న తప్పిదం వల్ల కీర్తి పోవచ్చు. పోయిన కీర్తిని మళ్ళీ సంపాదించుకోవడం కష్టం. ఇక ధనం ఎల్లప్పుడూ ఉంటుందనేది అనుమానమే. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు. జ్ఞానసంపద అపారం. దాన్ని పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అన్ని సంపదల కన్నా జ్ఞాన సంపదే మిన్న. ఇలా పలు రకాలుగా ఆలోచించి, చివరకు జ్ఞాన సంపద మూటను సులైమాన్ తీసుకున్నారు. దైవానికి కృతజ్ఞతలు చెపుఁకున్నారు. మిగిలిన రెండు మూటలను తీసుకువెళ్ళడానికి దైవదూత జిబ్రాయిల్ సిద్ధమయ్యేడు. అప్పుడు కీర్తి, ధనం మూటలు ‘‘ఓ దైవదూతా! మా ఇద్దరినీ సులైమాన్ తిరస్కరించారు. అయితే మేము జ్ఞానంతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పాయి. ఆ కోరికను మన్నించిన జిబ్రాయిల్... వాటిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి జ్ఞానంతోనే కీర్తి, ధనం కలిసి ఉంటున్నాయి. అందుకే జ్ఞానం సంపాదించేవారికి సంపద, పేరు ప్రతిష్టలు ఉంటాయి. జ్ఞానాన్ని మంచి కార్యాలకు వినియోగించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. దైవ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేసేవారికి, దైవ గ్రంథాల సారం తెలుసుకొనేవారికి దైవదూతలు సాయం చేస్తూ ఉంటారు. తమ జ్ఞానాన్ని చెడు పనులకు ఉపయోగించేవారి కీర్తి ప్రతిష్టలు క్రమంగా తగ్గిపోతాయి. ధన సంపదలు కూడా దూరమవుతాయి.
-మహమ్మద్ వహీదుద్దీన్
Updated Date - 2023-06-01T23:25:31+05:30 IST