Allaha: ఉపకార గుణం
ABN, First Publish Date - 2023-02-23T22:54:14+05:30
దయాగుణం, ఉపకారం అనే గుణాలు మానవీయ విలువలలో అతి ముఖ్యమైనవి. ఇవి మనిషిని శ్రేయోమార్గంలో నడిపిస్తాయి. అల్లాహ్ దయామయుడు, అపార కృపాశీలి. ఆయన ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడు.
సందేశం
దయాగుణం, ఉపకారం అనే గుణాలు మానవీయ విలువలలో అతి ముఖ్యమైనవి. ఇవి మనిషిని శ్రేయోమార్గంలో నడిపిస్తాయి. అల్లాహ్ దయామయుడు, అపార కృపాశీలి. ఆయన ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడు. అలా కురిసిన వర్షం ద్వారా అందరికీ ఉపాధి లభిస్తుంది. దయ చూపడంలో దైవం పిసినారి కాడు, భేద భావం కూడా చూపించడు. ఎందుకంటే మనుషులందరూ ఆయన దృష్టిలో సమానులే. కాబట్టి మానవులు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా... అందరి పట్ల దయతో మెలగాలి. ఇతరులపై దయ చూపని వారి మీద అల్లాహ్ దయ చూపించడని దైవ ప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు.
దైవ కటాక్షం పొందాలనుకున్నప్పుడు... సాటి మానవుల మీద కనికరం చూపాలి. మక్కా విజయం తరువాత... తన విరోధులపై మహా ప్రవక్త చూపిన దయ చరిత్రలోనే అద్వితీయమైనది. తన ఆగర్భ శత్రువులను ఆయన క్షమించి వదిలిపెట్టడమే కాదు, ‘‘ఈ రోజు నుంచి మీరు నా సోదరులు’’ అంటూ వారిని ఆదరించారు. ‘‘దయాగుణం లేని మనిషిలో మంచి అనేదే లేదు’’ అని ఆయన అనేవారు. ‘‘కరుణించడం అంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం’’ అని చెప్పేవారు.
మన నుంచి ఉపకారం పొందడానికి ఎక్కువ హక్కున్న వారు మన తల్లితండ్రులు. వారికి హృదయపూర్వకంగా సేవలు చేయాలి. ఆ తరువాత బంధు మిత్రులను ఆదరించాలి. పేదలను ఆదుకోవాలి. న్యాయం కన్నా గొప్పది ఉపకారం. మనిషి ఇవ్వవలసినంత ఇస్తే అది న్యాయం. దానికి మించి ఏదయినా ఇస్తే అది ఉపకారం అవుతుంది. న్యాయం చేయడంతో పాటు ఉపకారం కూడా చేయాలని అల్లాహ్ ‘దివ్య ఖుర్‌ఆన్’లో ఆదేశించారు. ఒక వ్యక్తికి అతని పనితనానికి తగిన వేతనం ఇస్తే అది న్యాయం. ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఉపకారం. తప్పు చేసిన వ్యక్తికి తగిన శిక్ష విధిస్తే అది న్యాయం. అతని పట్ల మన్నింపు వైఖరిని అవలంబించినా లేదా శిక్ష తగ్గించినా అది ఉపకారం అవుతుంది.
మహా ప్రవక్త మహమ్మద్ పశుపక్ష్యాదుల పట్ల ఎంతో దయ చూపేవారు. ఒకసారి ఆయన తన అనుయాయుడి చేతులో పక్షి పిల్లలను చూసి... వీటిని ఎక్కడి నుంచి తెచ్చారని అడిగారు.
‘‘ఓ దైవ ప్రవక్తా! నేను అడవిలోంచి వెళుతూ ఉంటే ఇవి కనిపించాయి. వాటిని పట్టుకున్నాను’’ అని చెప్పాడు.
‘‘ఎక్కడినుంచి తెచ్చారో అక్కడే వీటిని వదిలిరండి’’ అని మహా ప్రవక్త ఆజ్ఞాపించారు.ఉపకార బుద్ధి కలిగి, ఎవరికీ హాని తలపెట్టనివారు అల్లాహ్‌కు ప్రీతిపాత్రులవుతారు.
-మహమ్మద్ వహీదుద్దీన్
Updated Date - 2023-02-23T22:54:15+05:30 IST