JESUS: ఆ వెలుగు బాటలో...
ABN, First Publish Date - 2023-01-19T22:51:16+05:30
పాపాలకూ, తప్పులకూ చీకటి చిహ్నమైతే... నైతిక విలువలకు, పవిత్రతకు, మంచితనానికి, విజ్ఞానానికీ, వివేకానికీ చిహ్నం -
దైవమార్గం
పాపాలకూ, తప్పులకూ చీకటి చిహ్నమైతే... నైతిక విలువలకు, పవిత్రతకు, మంచితనానికి, విజ్ఞానానికీ, వివేకానికీ చిహ్నం - వెలుగు. చీకటి మరణానికి, వెలుగు జీవానికీ పరమ చిహ్నాలుగా భావించవచ్చు. చీకటి చిందులు వేసేది... వెలుతురు లేనప్పుడే! ఎప్పటికైనా చీకటిపై వెలుగుకు విజయం తధ్యం. ‘‘ఈ పుడమిపై నేను తిరుగుతున్నంతకాలం ఈ భువనానికి నేనో మహాదీపాన్ని. కాంతి పుంజాన్ని’’ అని సాక్షాత్తూ ఆ ప్రభువే చెప్పాడు. ‘‘నేనే వెలుగును’’ అని ప్రకటించాడు. అది సర్వత్రా సత్యసమ్మతమైన మాట.
‘‘విశ్వసృజన సమయంలో... దేవుని తొలిచూలు బిడ్డ ఆ వెలుగే’’ అని పవిత్ర గ్రంథమైన బైబిల్‌లోని తొలి వాక్యాలు ప్రవచిస్తున్నాయి. చీకటిలో ప్రకాశించే ఆ వెలుగు ఎవరో కాదు... సాక్షాత్తూ ఆ క్రీస్తే. ‘‘దేవా! నీ వాక్యం నా పాదాలకు దీపం’’ అంటాడు కీర్తనకారుడు. మనలోని కాంతిని కాస్త అన్యుల మీద ప్రసరింపజేయగలిగితే... అప్పుడు కదా వారు మనలోని మంచితనాన్ని చూడగలిగేది! ఇంట్లో దీపం వెలిగించుకున్నట్టే... ఒంట్లో కూడా ‘కన్ను’ అనే దీపాన్ని వెలిగించుకోవాలని బైబిల్ చెబుతోంది.
‘‘పడ్డవాడు ఎన్నడూ చెడ్డవాడు కాదు. ఒకవేళ... ఒక్కొక్కసారి నేను ఓటమిపాలు కావచ్చు. చీకటికే అంకితం కావచ్చు. కానీ ఆ దేవుడు నా మీద వెలుగుల వర్షం కురిపించే రోజు తధ్యం. నా జీవితానికి ఒక వెలుగు, ఒక రక్షణ, ఒక ప్రాణ దుర్గం ఆ దేవుడే అయినప్పుడు... ఇక నేను ఎవరికి భయపడాలి?’’ అనేది కీర్తనకారుడి ధీమా.
ప్రభువు తన పుట్టుకతో పాటు వెలుగును తోబుట్టువులా ఎలా తెచ్చాడో... మరణం నుంచి లేచిన తరువాత కూడా... తాను తిరిగిన ఈ లోకాన్ని వెలుగుతో నింపేశాడు. ఆ వెలుగులో కనిపించే బాట... ఏసు చూపించిన ఆ మార్గం మనల్ని గమ్యం వైపు వైపు నడిపిస్తాయి. అంతిమ సత్యాన్ని చేరుకొనేలా చేస్తాయి.
-డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు 9866755024
Updated Date - 2023-01-19T22:51:17+05:30 IST