ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jain Story: నిత్య సత్యం

ABN, First Publish Date - 2023-01-19T23:02:11+05:30

ప్రపంచమనే ఈ తోటలో జ్ఞాన వృక్షాలను నాటి, వాటిపై వికసించే అందమైన పుష్పాల పరిమళాలను దశదిశలా వ్యాపించడానికి దోహదపడతారు సద్గురువులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెన్‌ కథ

ప్రపంచమనే ఈ తోటలో జ్ఞాన వృక్షాలను నాటి, వాటిపై వికసించే అందమైన పుష్పాల పరిమళాలను దశదిశలా వ్యాపించడానికి దోహదపడతారు సద్గురువులు. కొందరు గురువులు తమ కార్యానికి సంకేతంగా, సూచనగా మామూలు తోటలను కూడా పెంచుతూ ఉంటారు. జపాన్‌లో అటువంటి గురువు ఉండేవాడు. ఆయన బోధించడంలో నిపుణుడే కాదు, తోటను అందంగా పెంచడంలోనూ మరింత నేర్పరి. చెట్లన్నా, పూలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. అలా వేల పూల మొక్కలతో ఒక తోటను ఆయన పెంచాడు. రకరకాల, రంగురంగుల పూలతో కనువిందు చేసే ఆ తోటను చూడడానికి పరిసరప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చేవారు. ఆ తోట అందాన్ని పొగిడేవారు.

ఈ సమాచారం ఆ రాజ్యానికి చెందిన మంత్రికి తెలిసింది. అతను స్వయంగా వెళ్ళి, ఆ తోటను తిలకించి, పులకించిపోయాడు. వెంటనే రాజమహల్‌కు వెళ్ళి, రాజును కలిసి ‘‘ప్రభూ! మన నగరంలో ఎంతో అందమైన తోట ఉంది. అది ఒక జెన్‌ గురువు పెంచిన అద్భుతమైన తోట. ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన తోట. నేను ఎన్నో చోట్ల ఎన్నో ఉద్యానవనాలు చూశాను కానీ, దీనికి సరిసమానమైన దాన్ని ఎన్నడూ చూడలేదు. మీరూ ఓసారి దాన్ని దర్శించాలని నేను ఆశిస్తున్నాను’’ అన్నాడు.

నిజానికి రాజు ఉద్యావనం ఎంతో విశాలమైనది. వందలాది పూల మొక్కలతో, లక్షలాది పూలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి ఉద్యానవనాన్ని చూసి కూడా మంత్రి ఇలా అంటున్నాడేమిటని రాజుకు ఆశ్చర్యం వేసింది. ‘‘మంత్రిగారూ! వందలాది సేవకులు రాత్రింబవళ్ళు కష్టపడి పెంచుతున్న తోట మనది. ఎంతో నైపుణ్యం ఉన్న తోటమాలులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దానితో పోటీ పడగలిగే, సరితూగే తోట వేరొకరికి ఉండడం సాధ్యమేనా? అదీ ఒక ధ్యాన గురువు పెంపకంలో ఉండడం అయ్యేపనేనా?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు మంత్రి ‘‘అవును మహారాజా! మొదట్లో నేనూ అలాగే భావించాను. కానీ వెళ్ళి చూస్తే... అద్భుతం, అమోఘం, ఆశ్చర్యకరం. లక్షలాది పూలతో ఒక పుష్ప సాగరంలా కనిపించింది. అసంఖ్యాకమైన నక్షత్రాలతో నిండిన గగనం గుర్తొచ్చింది. నిజం ప్రభూ!’’ అన్నాడు.

‘‘అలాగా! అయితే మేమూ దర్శించవలసిందే. వెంటనే ఆ గురువుకు కబురు పంపండి. రేపు ఉదయం వారి తోటను మేము తిలకిస్తామని తెలియజేయండి’’ అన్నాడు రాజు.

మంత్రి సంతోషించి, గురువుకు ఆ సంగతి తెలియజేశాడు. మరునాడు ఉదయం రాజు, రాణి, మంత్రి... పరివారంతో సహా ఆ గురువు తోటకు వెళ్ళారు. వారిని ఆయన ఆహ్వానించి, సాదరంగా తోటలోకి తీసుకువెళ్ళాడు. రాజు తోటనంతా చూస్తే... అంత పెద్ద తోటలో ఒకేఒక అందమైన ఉదయ కీర్తి పుష్పం తల ఆడిస్తోంది. మంత్రి నోట మాట రాలేదు. ఇదేమిటన్నట్టు రాజు, రాణి ఒకరినొకరు చూసుకున్నారు.

రాజు తన పక్కనే నిలబడిన గురువుతో ‘‘మీ తోటలో లక్షలాది మనోహర పుష్పాలు ఉన్నట్టు విని, చూద్దామని వచ్చాను. కానీ...’’ అన్నాడు.

‘‘అవును మహారాజా! లక్షలాది పుష్పాలతో తోట నిండుగా ఉండేది. కానీ అవన్నీ అలాగే ఉంటే... అన్నిటి మధ్యా ఉన్న ఈ అపురూపమైన పుష్పాన్ని మీరు గమనించరేమోనని రాత్రికి రాత్రే అన్నిటినీ కోసేశాం’’ అన్నాడు గురువు. ఆ పుష్పాన్ని రాజు గమనిస్తూ ‘‘అది ఒంటరిగా ఉంది’’ అన్నాడు.

గురువు పెద్దగా నవ్వుతూ ‘‘ఒంటరిగా కాదు మహారాజా! ఏకాంతంగా ఉంది’’ అన్నాడు.

ఆయన మాటల్లో మహత్తేమిటో కానీ... రాజు, రాణి, మంత్రి, సేనాని.... ఇలా అందరి దృష్టీ ఆ పువ్వు మీద పడింది. ఏదో నిత్య సత్యం గోచరించినట్టు.. అదో రకమైన ప్రశాంతత వారందరినీ ఆవరించింది. ‘ఏకాంతం’ అనే మాట అద్వైతానుభూతి కలిగించినట్టనిపించింది. అంతా నిశ్చలత్వం తొణికిసలాడుతున్నట్టు తోచింది.

నిజానికి ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఏకాంతంగానే వస్తుంది. ఎందరున్నా తనదైన ఏకాంతంగానే జీవిస్తుంది. ఏకాంతంగానే నిష్క్రమిస్తుంది. బయట ఎవరున్నా, ఎందరున్నా, ఎన్ని ఉన్నా... అన్నీ ఏదో ఒక సమయంలో విడిపోయేవే, విడిచిపోయేవే. అందుకే ‘‘తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు’’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఎన్నో ప్రపచనాల సారాన్ని ఒక్క పనితో ఆ జెన్‌ గురువు సూచించాడు. ఏకాంతం అందాన్నీ, ఆనందాన్నీ ఇస్తుంది. ఎన్నో రాచకార్యాలతో తీరికలేకుండా సతమతమయ్యే రాజు ప్రతిరోజూ ప్రవచనాలను వినడానికి రాలేదు. అందుకే అతను తనను కలుసుకున్న అవకాశాన్ని... ఆ నిత్య సత్యాన్ని బోధించడం ద్వారా గురువు సద్వినియోగం చేశాడు.

-రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2023-01-19T23:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising