Jesus: నియమం అవరోధం కాకూడదు
ABN, First Publish Date - 2023-06-23T03:48:31+05:30
ఆకలితో ఉన్న సమయంలో ఎవరూ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ పస్తులు ఉండలేరు. నియమాలు, నిష్టలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు అనేవి మనం బాగుండడానికే. సందర్భాన్ని బట్టి కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉండాలి.
సందేశం
దైవమార్గం
ఆకలితో ఉన్న సమయంలో ఎవరూ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ పస్తులు ఉండలేరు. నియమాలు, నిష్టలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు అనేవి మనం బాగుండడానికే. సందర్భాన్ని బట్టి కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉండాలి. లేకపోతే అవి మూఢాచారాలుగా మిగిలిపోతాయి. ఏసు ప్రభువు కన్నా ముందునుంచీ యూదులు ఉన్నారు. వారు నియమాలను పరమ నిష్టగా పాటించేవారు. కట్టుబాట్ల ఆచరణకు వారు పెట్టింది పేరు. గీసుకున్న గీతను దాటేవారు కాదు. వారు అనుసరించే అర్థంలేని విషయాలను ఏసు ప్రభువు నిర్ద్వంద్వంగా ఖండించాడు.
ఒకసారి విశ్రాంతి దినం నాడు ఏసు తన బోధలు సాగిస్తున్నాడు. జనం మధ్య ఒక మహిళ దీనంగా కూర్చొని ఉంది. ఆమెను పద్ధెనిమిది ఏళ్ళ నుంచీ దెయ్యం పీడిస్తోంది. వంగిపోయిన నడుముతో నిటారుగా నడవలేక... కిందికి వాలిపోయిన చెట్టుకొమ్మలా ఉంది. ప్రభువు ఆమె వైపు చూశాడు. తన దగ్గరకు రమ్మని పిలిచాడు.
‘‘అమ్మా! లేచి స్థిరంగా నిలబడు. నీ బలహీనత నుంచి విముక్తి పొందు’’ అని ఆమెకు ధైర్యం చెప్పి, ఆమె పైన చేతులు ఉంచాడు. ఆమె వెనువెంటనే నిటారుగా లేచి నిలబడింది. తనకు స్వస్థత కలిగినందుకు ఆనందించింది. దేవుని మహిమను కొనియాడింది.
కానీ యూదులు దీనికి అభ్యంతరం తెలిపారు. విశ్రాంతి దినాన ఇలాంటివి చేయడాన్ని తప్పుపట్టారు. ఏసు ప్రభువు చర్యలను తీవ్రంగా ఖండించారు. ఆ సమాజ మందిరం పెద్దలు కూడా మండిపడ్డారు. ‘‘ఇటువంటి చర్యలు సోమవారం నుంచి శనివారం వరకూ... ఆరు రోజుల్లోనే చేయాలి. ఆదివారం ఇలా చేయడం ఏమిటి? ఇది దేవుడు ఇచ్చిన విశ్రాంతి దినం కదా! మీరు దైవాజ్ఞను మీరినట్టు కాదా?’’ అని కోపోద్రిక్తులయ్యారు.
అప్పుడు ప్రభువు ‘‘ఓ వేషధారులారా! మీలో ప్రతిఒక్కరూ విశ్రాంతి రోజైనా సరే... కట్టుకొయ్యల నుంచి మీ ఎద్దుల్నీ, గాడిదల్నీ విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతారు కదా! ఆహారం అందిస్తారు కదా! అత్యవసరాలు మానుకుంటారా? ముహూర్త నియమాల కోసం వేచి ఉంటారా? పద్ధెనిమిది ఏళ్ళ నుంచి సైతానుకు బందీగా, దీనావస్థలో ఉన్న ఈ కుమార్తెను ‘ఇది విశ్రాంతి దినం’ అంటూ ఆ బంధాల నుంచి విడిపించడం తగని పని అంటారా?’’ అని నిలదీశాడు.
ప్రభువు అలా ప్రశ్నించేసరికి... ఆయనను నిందించినవారందరూ సిగ్గుతో తలలు దించుకున్నారు. అక్కడున్న ప్రజలు ఏసు చేసిన ఆ ఘనమైన కార్యాన్ని చూసి కరతాళధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఫ డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు, 9866755024
Updated Date - 2023-06-23T03:48:31+05:30 IST