Jesus : నడవాల్సిన దారి
ABN, First Publish Date - 2023-07-28T03:52:04+05:30
ప్రతి వ్యక్తీ తనకు తెలియకుండానే తనదైన దారిని ఎంచుకుంటాడు. దానిలోనే సాగిపోతూ ఉంటాడు. కానీ తన నడవడికను సమీక్షించుకొని, ఎటు పోతున్నాననేది గుర్తిస్తే... ఆ దారి మంచిదా? చెడ్డదా? అనేది గుర్తించగలుగుతాడు. చెడు దారైతే... ఎదురవబోయే దుష్ఫలితాలను తెలుసుకోగలుగుతాడు.
ప్రతి వ్యక్తీ తనకు తెలియకుండానే తనదైన దారిని ఎంచుకుంటాడు. దానిలోనే సాగిపోతూ ఉంటాడు. కానీ తన నడవడికను సమీక్షించుకొని, ఎటు పోతున్నాననేది గుర్తిస్తే... ఆ దారి మంచిదా? చెడ్డదా? అనేది గుర్తించగలుగుతాడు. చెడు దారైతే... ఎదురవబోయే దుష్ఫలితాలను తెలుసుకోగలుగుతాడు.
తన చెంతకు వచ్చేవారికి ఏసు ప్రభువు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. తన మార్గం చాలా ఇరుకుగా ఉంటుందనీ, దానికి భిన్నంగా... సైతాను మార్గం చాలా విశాలంగా, ఆకర్షణీయంగా ఉంటుందనీ చెప్పాడు. గొర్రెల చర్మం కప్పుకొన్న క్రూరమైన తోడేళ్ళ లాంటి వారిని నమ్మవద్దనీ, అబద్ధాలు చెబుతూ మాయలో దింపేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘నిత్య జీవానికి వెళ్ళే ద్వారం సంక్లిష్టంగా, కష్టంగా, ఇరుకుగా ఉంటుంది అయినా ఆ మార్గంలోనే మీరు పయనించండి. నాశనానికి పోయే ద్వారం విశాలంగా అనిపిస్తుంది. దానిద్వారా ప్రవేశించేవారు ఎంతో మంది ఉంటారు. ఇదొక రహస్యం. ఈ సత్యాన్ని కొందరే గ్రహించగలుగుతారు సుమా!’’ అంటూ తన మార్గం గురించి ప్రభువు వివరించాడు.. నీతిమంతుల మార్గం దేవుడికి తెలుస్తుందనీ, దుష్టుల మార్గం నాశనం వైపు నడిపిస్తుందని కీర్తనకారుడు చెబుతాడు. సైతాను మార్గం మృత్యు కుహరాన్ని చేరుస్తుందనీ, అలా పోయినవాడెవడూ తిరిగి రాలేదనీ ‘సామెతల గ్రంథం’ చెబుతోంది.
అయితే తన మార్గం ఎంతో భారమైనప్పటికీ, తన సాంగత్యంలో సులభతరం అవుతుందనీ, ప్రయాణం చాలా తేలికగా సాగుతుందనీ, మీకు తప్పకుండా శాంతి, విశ్రాంతి కలుగుతాయనీ, తనలోని సాత్విక గుణాలే మిమ్మల్ని నడిపిస్తాయనీ ఏసు ప్రభువు చెప్పాడు. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును’’ అంటూ అని ప్రభువు తన సులువైన, సున్నితమైన దారిని చూపించి, ప్రజలకు శాంతి ప్రబోధం చేస్తున్నాడు. ‘‘అలసిపోయేవారి ఆశలు నెరవేరేలా చేసి తృప్తి పరిచేవాడు, కృశించేవారిని పుష్టికరంగా తీర్చిదిద్దేవాడూ ప్రభువే’’ అని యిర్మయీ ప్రకటించాడు. ఆయన బాధితులకు ఆశ్రయం కల్పిస్తాడనీ, తన చెంత చేరేవారిని ఏమాత్రం బయటకు తోసివెయ్యలేడనీ, దప్పికతో ఉన్న ప్రతివారూ ప్రభువు దగ్గరే తీర్చుకోగలరనీ యోహాను కూడా చాటిచెప్పాడు.
కాబట్టి మనం నడవాల్సిన దారి ఏదో తెలుసుకొనే వివేకాన్ని పెంచుకోవాలి. ఏసు చూపిన మార్గం మొదట్లో ఇరుకుగా, కష్టంగా అనిపించవచ్చేమో... కానీ ప్రయాణం కొనసాగిస్తున్న కొద్దీ ఆయన కృప వల్ల అలసట మాయమవుతుంది. శాంతి చేకూరుతుంది. సత్యం తెలుస్తుంది. దేవుడి ఆశ్రయం దొరుకుతుంది.
-డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు
9866755024
Updated Date - 2023-07-28T03:52:04+05:30 IST