Life Truth: జీవితం విలువ చింతన తెలియాలంటే...
ABN, First Publish Date - 2023-03-02T23:32:09+05:30
సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు... కిటికీలోంచీ చూస్తే, కిటికీ అక్కడే ఉన్నట్టు, చెట్లు, చేమల అన్నీ కదిలి పోతున్నట్టు అనిపిస్తుంది.
సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు... కిటికీలోంచీ చూస్తే, కిటికీ అక్కడే ఉన్నట్టు, చెట్లు, చేమల అన్నీ కదిలి పోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా రైల్లోనే జన్మించి, అందులోనే పెరిగి, పెద్దయి ఉంటే... అతను ఎప్పుడు చూసినా మిగతావన్నీ కదులుతూ కనిపిస్తాయి. మరి అతని దృష్టిలో సత్యమేమిటి? చెట్లు, చేమలు కదులుతాయి కానీ కిటికీ కదలదని అంటాడు. ఎందుకంటే అతనికి తెలిసిన వాస్తవం
అదే కాబట్టి.
ఇక మాయ గురించి చెప్పాలంటే... మారడం అనేది మాయ స్వభావం. ఏదో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఉండదు. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏది వాస్తవమని నమ్ముతారు? ప్రపంచంలో అందరిదీ ఒకటే ధోరణి. బాగా డబ్బు సంపాదిస్తే... ఆనందంగా బతకవచ్చనుకుంటారు. కొందరికి వ్యక్తిగతంగా అలా అనిపించకపోవచ్చేమో కానీ, ప్రపంచమంతా దాదాపుగా ఇదే తంతు. మీరు ఏ డబ్బు కోసం ఇంతగా కష్టపడుతున్నారో.. ఆ డబ్బు అంతటినీ ప్రపంచం తన దగ్గర ఉంచుకొని, మీ చేతికి ఏమిచ్చిందో తెలుసా? ఒక చిన్న ప్లాస్టిక్ కార్డును. ఒకప్పుడయితే నెలకో, వారానికో ఒకసారి చేతికి డబ్బులు వచ్చేవి. చేతిలోకి తీసుకొని, చూసుకొని, జేబులో ఉంచుకొని ఖర్చు చేసేవారు, దాచుకొనేవారు. ఎంత మిగిలిందో చూసుకొని జాగ్రత్తపడేవారు.
ఇప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చని ప్రపంచం చెబుతోంది. మీరు జీవితాంతం అప్పుల్లో బతికేలా చేస్తోంది. ఈ ప్రపంచానికి మీరు చాకిరీ చేస్తే... మీకు ఏదైనా దొరికినా అది మీకు కాకుండా పోతుంది. ‘‘ఉత్త చేతులతో వచ్చిన నేను ఉత్త చేతులతోనే వెనుతిరుగుతున్నాను’’ అన్నాడు అలెగ్జాండర్. ఇంతకీ మీరు ఎవరికి చాకిరీ చేస్తున్నారు? దేని గురించి చింతిస్తున్నారు? మీ గురించా? మీ గురించి మీరు చింతిస్తే మీకు దొరికేదేం ఉండదు. ఏది సత్యమో దాని గురించి ఆలోచిస్తే, ఆ సత్యానికి దాసోహం అయితే... అందుకు ప్రతిఫలంగా మీరు దాచుకోలేనంత మీకు లభిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడో కాదు... తక్షణమే! దాన్నే ‘పరమానందం’ అంటారు. అదే శాశ్వతమైనది.
యుగయుగాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ ఏమిటంటే... ఒక గురువు ఉంటాడు. అతనికి శిష్యులు ఉంటారు. తెలుసుకోవాలనే శిష్యుడి జిజ్ఞాసను తీర్చగల శక్తి గురువుకు ఉంటుంది. గురువు పని... శిష్యుడికి కేవలం బోధించడం, జ్ఞానాన్ని ప్రసాదించడం మాత్రమే కాదు... ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి తగినట్టు అతణ్ణి సిద్ధం చెయ్యడం. ఎందుకంటే మనిషికి జ్ఞానం అంటే ఏమిటో తెలియదు కాబట్టి. అలాగే ప్రతి ఒక్కరూ శాంతి కావాలనుకుంటారు కానీ, శాంతి అంటే ఏమిటో చాలా తక్కువమందికే తెలుసు. తమ కుటుంబంలో ప్రతి సభ్యుడూ ఆనందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆనందంగా ఉండాలని పెద్దలు దీవిస్తారు. కానీ వాస్తవానికి ‘ఆనందం’ అంటే ఏమిటో మనిషికి తెలీదు. దాన్ని స్వయంగా తెలుసుకోవాల్సిందే, గుర్తించాల్సిందే. ‘జీవితం’ అనే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. చెట్లు, చేమలు, ఇళ్ళు ఎక్కడికీ పోవడం లేదనీ, పోతున్నది రైలేననీ గుర్తెరగాలి. ఎందుకంటే అవన్నీ మారిపోతూ ఉంటాయి. అన్నీ చివరకు అంతమైపోతాయి.
మనిషి ఎన్నిటికోసమో తాపత్రయపడతాడు. కానీ ప్రతి ఒక్కటీ మార్పు చెందుతుంది. ఏదీ ఎప్పటికీ ఒకేలా ఉండదు. కానీ మనం ఈ విషయాలను పట్టించుకోం. చిన్నప్పుడు మనకు పెద్దలు ఏం చెప్పారో వాటినే పాటిస్తున్నాం. పెద్దయ్యాక కూడా ఆ విధంగానే సాగిపోతున్నాం. ‘మీకు దేని గురించి చింత?’ అని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమాధానమిస్తారు. కుటుంబంలో అందరూ బాగుండాలనే, పిల్లలు బాగా చదువుకోవాలనే చింత తనకు ఉందని కుటుంబ పెద్ద అంటాడు. ఉద్యోగం చేస్తున్నవారికి ఉద్యోగం గురించి చింత. జబ్బుతో బాధపడుతున్నవారికి ఆరోగ్యం గురించి చింత. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కొక్క చింత ఉంటుంది. కానీ ఇటువంటి వాటి గురించి చింతించడం సబబు కాదని మహా పురుషులు చెబుతారు. ఎందుకంటే అవన్నీ తప్పకుండా మార్పు చెందుతాయి. ఏదో ఒక రోజు అవన్నీ అంతమైపోతాయి. కనుక ఏదైతే ఎన్నటికీ మారదో, నిరంతరం ఒకేలా ఉంటుందో... దాని గురించి తెలుసుకోండి.
ఈ జీవితంలో దాన్ని గుర్తించండి. అలా జరిగినప్పుడు మాత్రమే జీవితం విలువ ఏమిటో మీకు అర్థమవుతుంది.
-ప్రేమ్‌రావత్
9246275220
Updated Date - 2023-03-02T23:39:04+05:30 IST