Lord Krishna: భక్తి చైతన్య స్ఫూర్తి
ABN, First Publish Date - 2023-03-02T23:36:22+05:30
ప్రామాణిక శాస్త్రాధారాలతో నిరూపితం కానిదే ఎవరినీ భగవంతుని అవతారంగా అంగీకరించకూడదు. అయితే కలియుగంలో దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు అవతరించే స్వరూపం గురించి శ్రీమద్భాగవతం, మహాభారతం, వాయు పురాణం...
విశేషం
7న గౌర పూర్ణిమ
ప్రామాణిక శాస్త్రాధారాలతో నిరూపితం కానిదే ఎవరినీ భగవంతుని అవతారంగా అంగీకరించకూడదు. అయితే కలియుగంలో దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు అవతరించే స్వరూపం గురించి శ్రీమద్భాగవతం, మహాభారతం, వాయు పురాణం, నృసింహ పురాణం, చైతన్యోపనిషత్తు (అథర్వ వేదం) తదితర మహా గ్రంథాలు ఇదివరకే నిర్ధారించాయి. మరి కలియుగంలో ఆవిర్భవించిన శ్రీకృష్ణావతారం ఎవరు?
శ్రీ చైతన్య మహాప్రభు... మేలిమి బంగారు ఛాయతో కలియుగాన ఉద్భవించిన శ్రీకృష్ణావతారం. ఆయనను ‘గౌర హరి’, ‘గౌరంగ’, ‘గౌరసుందర’ అని కూడా సంబోధిస్తారు. అయితే ఈ అవతార ప్రామాణికత గురించి మన మనసులో ఏదో మూల సంశయం ఉండవచ్చు. ముందే ప్రస్తావించినట్టు... ఏ భగవదవతారానికైనా శాస్త్రాధారం మాత్రమే ప్రమాణం. సకల గ్రంథాలకూ రారాజుగా పేరుపొందిన ‘శ్రీమద్భాగవతం’... మహా ప్రభు అవతారం గురించి ఇలా వివరించింది:
కృష్ణవర్ణం త్విశాకృష్ణంసాంగోపాంగాస్త్రపార్షదమ్
యజ్నైః సంకీర్తనప్రాయైుర్ యజంతి హి సుమేధసః
‘‘ఈ కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణ గానం చేసే భగవదవతార మూర్తిని మేధోసంపత్తి కలిగిన మనుషులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. నలుపు వర్ణంలో లేకపోయినా... ఆయన సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి... ఆయన తన అనుచరులతో కలిసి ఈ భూమి మీద అవతరిస్తాడు.’’
త్రియుగి...
విష్ణువుకు గల అనేకానేక నామాలలో త్రియుగి అనేది ఒకటి. అపారమైన వేద విజ్ఞాన పాండిత్యం ఉన్న సార్వభౌమ భట్టాచార్యులు సైతం భగవంతుడు ‘త్రియుగి’ అనే నామం కలిగిన వాడు కాబట్టి, సత్య, త్రేతా, ద్వాపర యుగంలో ఇదివరకే అవతరించాడనీ, కాబట్టి కలియుగంలో ఎలా అవతరిస్తాడనీ వాదించారు. దానికి పరమభాగవతుడైన గోపీనాథాచార్యులు శాస్త్రసహిత ఆధారాలతో బదులిస్తూ ఆ నామం ఆ మూడు యుగాల్లో లీలావతార స్వరూపాలను సూచిస్తుందనీ, కానీ కలియుగంలో భక్తునిగా అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభువులది గుప్తమైన యుగావతారమనీ నిరూపించారు.
‘శ్రీమద్భాగవతం’లో నృసింహస్వామి కోసం ప్రహ్లాదుడు ప్రార్థన చేసే... ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారైర్... అనే శ్లోకానికి అర్థం... ‘‘వివిధ రూపాల్లో అవతరించి, లోకాలను పోషించి, దానవులను వధిస్తావు. యుగాన్ని అనుసరించి నువ్వు ధర్మాన్ని పరిరక్షిస్తావు. కానీ కలియుగంలో నువ్వు భగవంతుణ్ణని చెప్పుకోవు కాబట్టి ‘త్రియుగ’ (మూడు యుగాల్లో ప్రకటితమయ్యేవాడి)గా నిన్ను కొనియాడుతారు’’ అని ఉంటుంది. కాబట్టి కలియుగంలో భగవంతుడు ఛన్నావతారుడై, అంటే పైకి భగవంతుడిలా కనిపించని గుప్తావతారుడై ఆవిర్భవిస్తాడు. అందుకే ఆయనకు ‘త్రియుగి’ అని పేరు.
ఆ యశోదానందనుడు ఒకప్పుడు శుక్ల వర్ణంలో, మరోసారి రక్తవర్ణంలో, ఇంకోసారి పీతవర్ణంలో ఉంటాడనీ, ఇప్పుడు (ద్వాపరయుగంలో) నలుపు వర్ణాన్ని పొందాడనీ ‘భాగవతం’ చెబుతోంది.
ఆసన్వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోనుయుగం తనూః
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః... అనే ఆ శ్లోకానికి హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వ్యాఖ్యానం చేస్తూ ‘‘ఈ శ్లోకం శ్రీకృష్ణుని నామకరణ సమయంలో గర్గముని చెప్పినది. వీటిలో పీత (పసుపు) వర్ణం చైతన్య మహా ప్రభువు అవతార స్వరూపాన్ని వివరిస్తుంది. అంటే గత కల్పాల్లోని కలియుగాల్లో సైతం భగవంతుడు పసుపు వర్ణంతో అవతరించాడని ఇది నిరూపిస్తోంది. ఈ విధంగా పీతవర్ణంతో సహా వివిధ భగవదవతార సంబంధిత గుణాలతో భగవంతుడు శ్రీచైతన్య మహాప్రభువుగా అవతరించారని ప్రామాణికమైన సకల వైదిక శాస్త్రాలు నిర్ధారించాయి’’ అని చెప్పారు. శ్రీచైతన్య మహాప్రభు అవతారాన్ని తెలిపే ఇతర ప్రామాణిక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. సర్వవ్యాప్తుడైన పరమాత్మ అయిన శ్రీ గౌర సుందరుడు ఒక మహాత్మునిగా, భౌతిక త్రిగుణాలకు అతీతుడైన మహాయోగిగా అవతరించి దివ్య కార్యసాధనకు నిదర్శనమై నిలచి లోకమంతా భక్తిమార్గాన్ని స్థాపిస్తాడని ‘అధర్వవేదం- చైతన్యోపనిషత్తు’లో, ‘‘కలియుగంలో సంకీర్తనోద్యమం ఆరంభమవగానే శచీ తనయునిగా నేను (భగవంతుడు) అవతరిస్తాన’’ని ‘వాయుపురాణం’లో, సమస్త సృష్టి, స్థితి, లయ కారకుడైన, జగన్నాథుడైన శ్రీకృష్ణుడు... గౌరంగునిగా అవతరిస్తాడని ‘అనంత సంహిత’లో, సత్యయుగంలో అర్థసింహాకృతిలో, త్రేతాయుగంలో రామునిగా, ద్వాపరాన శ్రీకృష్ణుడిగా రాక్షస సంహారాన్ని చేసిన దేవుడు కలియుగంలో ‘చైతన్య’ అనే నామంతో, బంగారు వర్ణాకృతిని కలిగినవాడిగా, భగవన్నామ సంకీర్తనను ఆస్వాదించేవాడిగా అవతరిస్తాడని ‘నృసింహ పురాణం’లో... ఇంకా విష్ణు సహస్రనామం, మహాభారతాల్లో... ప్రస్తావనలు ఉన్నాయి.
గౌర పూర్ణిమ...
శ్రీచైతన్య మహాప్రభువు ప్రస్తుత కలియుగంలో హరినామ సంకీర్తనను ప్రధాన ముక్తిమార్గంగా బోధించిన, సంకీర్తనల ద్వారా భక్తి చైతన్యం కలిగించిన భాగవతోత్తముడు. జీవనసాఫల్యానికి ‘భగవంతుడి మీద ప్రేమను పెంపొందించుకోవడం’ అనే సరళమైన మార్గాన్ని బోధించడానికి అవతరించిన పరమ కారుణ్యమూర్తి. సుమారు అయిదువందల ఏళ్ళ కిందట... పశ్చిమబెంగాల్‌లోని నవద్వీప ధామంలో... శచీ తనయుడై.... ఫాల్గుణ పౌర్ణమి (గౌర పూర్ణిమ) నాడు ఆయన అవతరించారు. ‘భగవన్నామ సంకీర్తనం’ అనే యజ్ఞంతో యుగధర్మాన్ని స్థాపించారు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్, 9396956984
Updated Date - 2023-03-02T23:36:22+05:30 IST