Lord Krishna: ఈ సమయం కూడా గడిచిపోతుంది...
ABN, First Publish Date - 2023-07-28T04:01:30+05:30
ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ‘‘హే మాధవా! ఈ గోడ మీద ఒక సందేశం రాయి. అదెలా ఉండాలంటే... సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి. దుఃఖంలో ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి’’ అని అడిగాడు.
ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ‘‘హే మాధవా! ఈ గోడ మీద ఒక సందేశం రాయి. అదెలా ఉండాలంటే... సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి. దుఃఖంలో ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి’’ అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘ఈ సమయం కూడా గడిచిపోతుంది’’ అని రాశాడు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు... ఆ కష్టాలు శాశ్వతం కావు అనే జ్ఞానం కలగాలి. అదే విధంగా మనకు ఉన్నతమైనవి లభించినప్పుడు, సిరిసంపదలు కలిగినపుఁడు... అహంకారం రాకూడదంటే... ఈ సమయం కూడా గడిచిపోతుందనే జ్ఞానం రావాలి.
ప్రస్తుతం నడుస్తున్న కలియుగం అనే ఈ దుఃఖ ప్రపంచం పరివర్తన చెంది, భరతభూమిపై స్వర్ణతుల్యమైన ప్రపంచం రాబోతోంది. అటువంటి యుగంలో మనం జన్మించాలంటే భగవంతుడి కృప ఉండాలి.
కష్టాలు, బాధలు ఎవరికీ ఇష్టం ఉండవు. ఉదయాన్నే పిల్లలను బడికి పంపడానికి తల్లితండ్రులు ఎంతో శ్రమపడవలసి వస్తుంది. పిల్లలకు రోజూ బడికి వెళ్ళడం భారంగా అనిపిస్తుంది. పెద్దవారయ్యాక... నచ్చిన ఉద్యోగం దొరక్కపోవడం లేదా చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో పని ఒత్తిడి కష్టంగా అనిపిస్తాయి. కష్టసుఖాలనేవి మన మనసు మీద ఆధారపడి ఉంటాయి. కష్టాలు అందరికీ శత్రువులే. కానీ వాటిని పరీక్షలుగా భావించాలి. మన జీవితానికి గీటురాయిగా మార్చుకోవాలి. అప్పుడు మనకు ఎదురైన కష్టాలను ఎంతో సంతోషంగా అధిగమించగలం.
ఈ సృష్టి ఒక అనంతమైన నాటకం. ఇందులో నాలుగు యుగాలు... సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయి. ప్రస్తుతం కలియుగం ఆఖరి చరణంలో ఉంది. తరువాత రాబోయేది సత్యయుగం. ఈ యుగాల సంధి సమయమే ‘పురుషోత్తమ కల్యాణకారి సంగమ యుగం’. ఈ సంగమ యుగంలోనే భగవంతుడు స్వయంగా జన్మిస్తారు. అవినాశి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆ యజ్ఞంలో మన చెడు అలవాట్లను, అనవసరమైన గుణాలను ఆహుతి చేయాలనేది ఆయన కోరిక. కానీ ఎలా ఆహుతి చేయాలి? కనిపించే వస్తువులను ఆహుతి చేయడం తేలిక. సూక్ష్మమైన వాటి విషయంలో అది కష్టం. మరి దీనికి మార్గమే... భగవంతుడు భగవద్గీతలో చెప్పిన సహజ రాజయోగం. దానితో మనలోని మాలిన్యాలు వాటంతట అవే తొలగిపోతాయి. నదిలోని ఒక రాయి ఆటుపోట్లను తట్టుకొని, అరిగి అరిగి సాలగ్రామంగా మారి, పూజకు యోగ్యం అవుతుంది. శిల్పి ఉలి దెబ్బలను తిన్న శిల ఒక విగ్రహంగా ఆరాధనకు యోగ్యత పొందుతుంది. అదే విధంగా దైవ కృపకు పాత్రులై, జీవన్ముక్తిని పొందాలంటే... సమస్యలు, కష్టనష్టాలు ఎదురైనప్పటికీ భగవంతుడి స్మృతిని మనం వదలకూడదు.
రాజయోగానికి ఆధారం... ఆత్మ, పరమాత్మలకు సంబంధించిన సత్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానంతో మన దైనందిన జీవితంలో వచ్చే ఒడుదొడుకులను అవలీలగా ఎదుర్కోగలం. కష్టసుఖాలలో నిలకడగా ఉండగలం. జ్ఞాన యోగాలతో వైరాగ్య భావన జాగృతం అవుతుంది. అప్పుడు జీవితంలో సంతృప్తి లభిస్తుంది. అంతిమ ఘడియల వరకూ భగవంతుడి స్మృతిని నిలుపుకోగలుగుతాం. జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం.
బ్రహ్మకుమారీస్, 7032410931
Updated Date - 2023-07-28T04:01:30+05:30 IST