మార్పుతోనే రక్షణ
ABN, First Publish Date - 2023-03-24T01:23:46+05:30
చెడును దూషించినా, చీకటిని అసహ్యించుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. చెడుకు నీతిని బోధించాలి. చీకటిలో దీపం వెలిగించాలి. కేవలం ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఏవీ మారవు.
చెడును దూషించినా, చీకటిని అసహ్యించుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. చెడుకు నీతిని బోధించాలి. చీకటిలో దీపం వెలిగించాలి. కేవలం ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఏవీ మారవు.
ఒక రోజు యెరికో పట్టణ వీధుల్లో ఏసు ప్రభువు తన శిష్యులతో వెళ్తున్నాడు. ప్రజల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. ఆయనను చూడాలనీ, ఆయన చెప్పేది వినాలనీ జనసమూహం భారీగా తరలి వచ్చింది. వారితోపాటు ఒక పెద్ద ఉద్యోగి కూడా వచ్చాడు. అతను లంచగొండితనంతో ప్రజలను బాధించేవాడు. అక్రమ వడ్డీ వసూలు చేస్తూ అమాయకుల్ని పీడించేవాడు. అలా కోటీశ్వరుడయ్యాడు. జనం అతణ్ణి ద్వేషించేవారు. అతని పేరు జక్కరయ్య. అతనికి కూడా ఏసును చూడాలనిపించి అక్కడకు వచ్చాడు.
జక్కరయ్య బాగా పొట్టివాడు. కాబట్టి అంతమంది జనంలో అతనికి ప్రభువు కనిపించడు. అందుకని అక్కడ ఉన్న ఒక చెట్టు ఎక్కి, ప్రభువు రాక కోసం నిరీక్షిస్తున్నాడు. ప్రభువు వచ్చాడు. అంతమందిలోనూ... చెట్టుమీద ఉన్న జక్కరయ్యను పేరు పెట్టి పిలిచాడు. ‘‘కిందికి దిగిరా! నేను మీ ఇంట అతిథిని. రా! కలిసి భోజనం చేద్దాం’’ అన్నాడు. జక్కరయ్య ఆశ్చర్యపోయాడు. అతని నోటి వెంట మాట రాలేదు. మరోవైపు ప్రజలంతా ప్రభువును లోలోపల విమర్శిస్తున్నారు. ‘‘ఒక పాపి దగ్గరకు ప్రభువు వెళ్ళడమా?’’ అని తిట్టుకుంటున్నారు.
ప్రభువు తనను ప్రేమతో పలకరించాక, తన ఇంటికి వచ్చాక, ఎలా ఉండాలో క్లుప్తంగా బోధించాక... జక్కరయ్య మనస్సు మార్చుకున్నాడు. ‘‘అయ్యా! నేను కూడగట్టిన డబ్బు మొత్తం పేదలకు పంచేస్తాను. నిర్భాగ్యులకు నా ఆస్తి సగం ఇచ్చేస్తాను. అజ్ఞానంతో చేసిన పాపాలను అలా కడిగేసుకుంటాను. క్షమించు...’’ అంటూ ప్రభువు కాళ్ళమీద పడ్డాడు.
‘‘జక్కరయ్య కూడా దేవుని బిడ్డ అయ్యాడు. ఇతను దేవుడి రక్షణకు అర్హుడయ్యాడు’’ అని అక్కడి ప్రజలందరికీ ప్రభువు చెప్పాడు. తప్పుడు మార్గాల్లో పయనిస్తున్న ఇతరుల్లోనూ ఈ సంఘటన ఆలోచన రేకెత్తించింది. ‘మనం కూడా మారితే ప్రభువు మనల్నీ మెచ్చుకుంటాడు’ అనుకుంటూ ఇళ్ళకు బయలుదేరారు. కర్తవ్యోన్ముఖులయ్యారు. కొన్ని సందర్భాల్లో పెద్దల ప్రేమాదరాలు... చిన్నవారిలో మార్పునకు దోహదం చేస్తాయి. అలా మారిన వారికి దేవుడి రక్షణ దొరుకుతుంది.
- డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు
9866755024
Updated Date - 2023-03-24T01:25:39+05:30 IST