Ramadan: మహా ప్రవక్త మాసం...
ABN, First Publish Date - 2023-03-02T23:21:34+05:30
ఇస్లామీయ మాసాల్లో ఎనిమిదవది షాబాన్. ఇది రజబ్, రంజాన్ మాసాల మధ్య వస్తుంది. ‘‘షాబాన్ నా మాసం. రజబ్ అల్లాహ్ మాసం. రంజాన్ నా జాతి మాసం.. షాబాన్ మాసం మానవులను పాపాల నుంచి దూరం చేస్తుంది.
షాబాన్
సందేశం
ఇస్లామీయ మాసాల్లో ఎనిమిదవది షాబాన్. ఇది రజబ్, రంజాన్ మాసాల మధ్య వస్తుంది. ‘‘షాబాన్ నా మాసం. రజబ్ అల్లాహ్ మాసం. రంజాన్ నా జాతి మాసం.. షాబాన్ మాసం మానవులను పాపాల నుంచి దూరం చేస్తుంది. రంజాన్ మాసం పూర్తిగా పరిశుభ్రపరుస్తుంది’’ అని ఒక సందర్భంలో మహా ప్రవక్త మహమ్మద్ చెప్పారు. షాబాన్ గురించి ఒక మాసం ముందుగానే ఆయన ప్రార్థన చేసేవారు. ‘‘ఓ అల్లాహ్! మాకు రజబ్, షాబాన్ మాసాల్లో సమృద్ధిని, శుభాలను ప్రసాదించు. రంజాన్ మాసం వరకూ మమ్మల్ని నడిపించు’’ అని వేడుకొనేవారు. ‘‘షాబాన్ నెల పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ మాసంలో దాసులు చేసే పనులు అల్లాహ్ దృష్టికి వెళతాయి. కాబట్టి నా కర్మ ఫలాలను అల్లాహ్ దగ్గరకు తీసుకువెళ్ళే సమయంలో నేను ఉపవాస దీక్షలో ఉండడానికి ఇష్టపడతాను’’ అని ఆయన చెప్పారు. ఈ మాసంలో మహా ప్రవక్త ఉపవాసాలను పాటించేవారు. అయితే చివరి పదిహేను రోజులూ ఉపవాసాలు చేసేవారు కాదు.
మహా ప్రవక్త సందేశాన్ని వ్యాప్తి చేసిన హజ్రత్ అయిషా దగ్గరకు ఒకసారి ఒక మహిళ వచ్చి, రజబ్ మాసంలో ఉపవాసాల గురించి ప్రస్తావించింది. ‘‘ఒకవేళ నీకు రంజాన్ మాసంలో ఉపవాసాలు చేశాక, వేరే మాసంలోనూ చేయాలనే ఆసక్తి ఉంటే... షాబాన్ మాసంలో పాటించు. ఎందుకంటే ఈ మాసంలో కలిగే అనేక శుభాలను పవిత్ర గ్రంథాలలో వివరించారు’’ అని అయిషా బదులిచ్చారు.
‘‘ఈ నెలలో శుభాలు, పుణ్యాలు లభిస్తాయి. పాపాలు దూరం అవుతాయి. కాబట్టి వివేకం కలిగిన ప్రతి విశ్వాసి ఈ నెలలో ఏ విధంగానూ నిర్లక్ష్యాన్నీ, అశ్రద్ధనూ వహించకూడదు. రంజాన్ మాసాన్ని స్వాగతించడానికి తనను తాను సిద్ధం చేసుకోవాలి. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. ఎక్కువగా ప్రార్థనలు చేసి, దైవ సామీప్యాన్ని పొందాలి మహనీయుడైన హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జిలానీ సూచించారు.
షబాన్ మాసంలోని 15వ రోజు రాత్రిని ‘షబే బరాత్’ అంటారు. అల్లాహ్ తను సృష్టించిన జీవరాశులన్నిటినీ ఈ రాత్రి ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడనీ, పాపాలను క్షమిస్తాడనీ విశ్వాసం. షబే బరాత్‌కు ‘నరకం నుంచి విముక్తి కలిగించే రాత్రి’, ‘శుభాల రాత్రి’, ‘దస్తావేజుల రాత్రి’ (అంటే ఏడాది కాలంలో ప్రతి మనిషికి సంబంధించిన విషయాలను స్పష్టంగా లిఖించే రాత్రి) అనే పేర్లు ఉన్నాయి. అయితే ఇది ‘షబే బరాత్’గానే ప్రసిద్ధి చెందింది. ‘షబ్’ అంటే పార్సీ భాషలో ‘రాత్రి’ అనీ, ‘బరాత్’ అంటే అరబ్బీ బాషలో ‘విముక్తి పొందడం’, ‘మోక్షం పొందడం’ అనే అర్థాలు ఉన్నాయి.
-మహమ్మద్ వహీదుద్దీన్
Updated Date - 2023-03-02T23:21:34+05:30 IST