Sadguru Vani: సాధనతోనే సాధ్యం
ABN, First Publish Date - 2023-07-13T23:41:31+05:30
నిత్య జీవితంలో మన నుంచి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆశిస్తూ ఉంటారు. ఈ అంచనాలు ఒకదానితో మరొకటి పొసగవు. సాయంత్రం అయిదున్నర కల్లా ఇంటికి రావాలని మీ భార్య కోరుకుంటుంది.
సద్గురువాణి
నిత్య జీవితంలో మన నుంచి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆశిస్తూ ఉంటారు. ఈ అంచనాలు ఒకదానితో మరొకటి పొసగవు. సాయంత్రం అయిదున్నర కల్లా ఇంటికి రావాలని మీ భార్య కోరుకుంటుంది. కానీ రాత్రి ఏడున్నర వరకూ ఆఫీసులో ఉండాలని మీ బాస్ అనుకుంటాడు. మన అందరికీ ఉన్నవి ఇరవై నాలుగు గంటల సమయమే. కానీ తల్లితండ్రుల ఆశలు, పిల్లలు, యజమానుల అంచనాలు, అన్నిటికీ మించి జీవిత భాగస్వామి ఆశలు నెరవేర్చాలంటే... రోజుకు 60 గంటలు కావాలి. మరి అన్ని గంటలు ఎక్కణ్ణించి తేగలమనేదే ప్రశ్న.
మీ సామర్థ్యానికి మించి మీ మీద అంచనాలు పెట్టుకున్నవారిని తిట్టుకోకండి. మీ నుంచి పెద్ద విషయాలు ఆశించడం నిజానికి మీకు పెద్ద వరం. మీ బాస్‌కు మీ మీద ఎలాంటి అంచనాలు లేకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది. అందరూ మీ నుంచి ఎన్నో ఆశిస్తున్నప్పుడు... మీ పరిమితులను అధిగమించి, జీవితంలో ఏదైనా చేయడానికి ఇదొక మంచి అవకాశం. అలాగని అందరి అంచనాలూ నెరవేర్చడానికి మీరు ఏదైనా గొప్ప పని చేయాలా? అది అసాధ్యం. కానీ మీరు నిరంతరం చేయగలిగేదాని కన్నా వాళ్ళు ఎక్కువగా ఆశించినట్టైతే... మీ జీవితం చక్కగా సాగుతోందని అర్థం. దాన్ని ఆస్వాదించండి. విసుక్కోకండి. మీకు వీలైనంత చక్కగా చేయండి. మీ చేతుల్లో ఉన్నది అదొక్కటే.
ఇదంతా మీ పనిలో మీరు పరిపూర్ణత (పర్‌ఫెక్షన్)తో ఉండడం గురించి కాదు. జీవితంలో పర్‌ఫెక్ట్‌గా జరిగేది మరణం మాత్రమే. మీరు పరిపూర్ణతను కోరుకుంటే... తెలియకుండానే మరణాన్ని కోరుకుంటున్నట్టు. అలా కోరుకోవద్దు. మీరు పర్‌ఫెక్ట్‌గా ఉన్నంత మాత్రాన జీవితం అందంగా మారదు. ఏ పనినైనా మనసు లగ్నం చేసి చేయాలి. అప్పుడు జీవితం అందంగా మారుతుంది. మీ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడే మీ పరిమితులను దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంచనాలు లేకపోతే మీ సామర్థ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎవరి అంచనాలూ లేకుండా మీరు మీ పూర్తి సామర్థ్య స్థాయిని చేరుకోవచ్చు. కానీ దానికి భిన్నమైన చైతన్యం, ఎరుక అవసరం. అయితే చాలామంది ఆ స్థితిలో లేరు. కాబట్టే జనం అంచనాలను బట్టి మాత్రమే నడుచుకుంటున్నారు. కనుక మీ నుంచి మరింత పెద్ద విషయాలను ఆశించనివ్వవద్దు. ఎప్పుడూ కొన్ని విషయాలు మన అదుపులో ఉండవు. ఎక్కువ పనులు చేస్తూంటే ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ‘మీరు ఎంత బాగా జీవిస్తున్నారు?’ అనే అంశం మీదో, మీరు దేన్నో సాధించడం మీదో మీ జీవిత సాఫల్యం ఆధారపడకూడదు. ‘మీరు అంకిత భావంతో చేస్తున్నారా? లేదా?’ అనే అంశం మీద ఆధారపడాలి. మీ సామర్థ్యం, పరిస్థితులు, ఇతర అంశాల అనుకూలతలను బట్టి ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ జీవితంలో ఎంతో విలువైన వాటి పట్ల పూర్తి శ్రద్ధ చూపుతున్నారా? అనేదే ప్రశ్న.
మీరు ఉద్యోగం చెయ్యాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది మనుగడకు సంబంధించినది. పెద్ద విషయమేం కాదు. మీరు గొప్ప పనులేవీ చేయడం లేదు. వీటిని చేయడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కానీ చాలామంది ఇదే ధ్యేయంగా బతుకుతున్నారు. జీవనోపాధి పొంది, ఎలాగో ఒకలా బతకడమే వాళ్ళ లక్ష్యం.. కానీ అలా ఉండకూడదు. మనిషికి ఇంతకన్నా ఎంతో ఎక్కువ సమర్థత ఉంది. ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే... మీ మనస్సును కొంతవరకైనా స్పష్టతతో ఉంచుకోవడం అవసరం. దాని కోసం కొన్ని సరళమైన సాధనలు, అభ్యాసాలు ఉన్నాయి. వాటిని కొన్నాళ్ళు సాధన చేస్తే... మీ మనసులో స్పష్టత ఏర్పడుతుంది. విషయాలను మరింత చక్కగా చూడగలుగుతారు. ఇది మీ సామర్థ్యానికి మించినదేమీ కాదు, మీరు చేయగలిగేదే. మీ మంచి కోసం అది మీరు తప్పకుండా చేసి తీరాలి కూడా. ఇదంతా సాధనతోనే సాధ్యం.
-సద్గురు జగ్గీవాసుదేవ్
Updated Date - 2023-07-13T23:41:31+05:30 IST