Subshitaum: మూడు స్వభావాలు
ABN, First Publish Date - 2023-05-05T02:35:27+05:30
ఇతరులకు మంచి జరుగుతుందని అనుకుంటే... వారికి ఉపకారం చెయ్యడం కోసం అవసరమైతే తమ పనులను కూడా మానుకొనేవారు ఉత్తములు.
సుభాషితం
ఏతే సత్పురుషాః పరార్థఘటకా స్స్వార్థాన్ పరిత్యజ్యయే
సామాన్యాస్తు పరార్థ ముద్యమభృతః స్వార్థావిరోధేనయే
తేమీ మానుషరాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతియే
యేతు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే నజానీమహే
మనుషుల స్వభావాలు మూడు రకాలుగా ఉంటాయంటూ... వాటి గురించి భర్తృహరి తన ‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో వివరించాడు. దాన్ని...
తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థవ్యాపృతుల్ మధ్యముల్,
తమకైయన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్ వృధాన్యార్థభం
గముగావించెడువార లెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్?... అంటూ ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి అందించాడు.
‘‘ఇతరులకు మంచి జరుగుతుందని అనుకుంటే... వారికి ఉపకారం చెయ్యడం కోసం అవసరమైతే తమ పనులను కూడా మానుకొనేవారు ఉత్తములు. తమ పనులకు భంగం కలుగకుండా ఇతరుల పనులకు సాయపడేవారు మధ్యములు. తమ పనులు నెరవేరడం కోసం ఇతరుల పనులు చెడగొట్టేవారు మనుషులుగా కనిపించే రాక్షసులు. ఇక... తమకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా సరే... వేరే వాళ్ళ పనులకు నష్టం కలిగించేవారిని ఏమనాలో ఎవరికి తెలుసు? (అలాంటివారి స్వభావం రాక్షసత్వం కన్నా దారుణమైనది)’’ అని అర్థం.
Updated Date - 2023-05-05T02:35:27+05:30 IST