Sahaja Yoga: అదే లక్ష్యం సహజయోగ
ABN, First Publish Date - 2023-06-23T04:00:34+05:30
ఈ సకల చరాచర సృష్టి భగవంతుడి లీల. ఆ లీలలో అంతర్భాగంగా మానవుణ్ణి కూడా దేవుడు సృష్టించాడు. అతి చిన్న కణమైన అమీబా దశ నుంచి మొదలై... అంతరిక్ష పరిశోధన చేసేవరకూ సాగిన జీవన పరిణామక్రమంలో... మనిషి బుద్ధి, మేధస్సు అనే లక్షణాలు అలవరచుకున్నాడు.
సత్యం...
ఈ సకల చరాచర సృష్టి భగవంతుడి లీల. ఆ లీలలో అంతర్భాగంగా మానవుణ్ణి కూడా దేవుడు సృష్టించాడు. అతి చిన్న కణమైన అమీబా దశ నుంచి మొదలై... అంతరిక్ష పరిశోధన చేసేవరకూ సాగిన జీవన పరిణామక్రమంలో... మనిషి బుద్ధి, మేధస్సు అనే లక్షణాలు అలవరచుకున్నాడు. మానవ జన్మకు అర్థాన్ని తెలుసుకొని, అంతిమ లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో... ఆధ్యాత్మిక పరివర్తనను పొందడం ఆవశ్యకమని తెలుసుకున్నాడు. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానంగా... ‘నేను ఈ శరీరం, బుద్ధి, అహంకారం కాదు. నేను ఆత్మను’ అని గ్రహించాడు. శ్రీమాతాజీ నిర్మలాదేవి తన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సాధకులను ‘‘సత్యాన్వేషకులందరికీ హృదయపూర్వక స్వాగతం’’ అని సంబోధించేవారు. అసలు ‘సత్యాన్వేషణ’ అంటే ఏమిటి? జీవన్మరణ చక్రంలో శాశ్వతమైనది ఆత్మ. అదే సత్యం.
ఆత్మ శాశ్వతమైనదనీ, ఎండ, వాన, అగ్ని లాంటివి దాన్ని ప్రభావితం చేయలేవనీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదాని అంతరార్థం గ్రహించడమే సత్యం. ఎందరో ఋషులు కొన్ని వేల ఏళ్ళ నుంచీ సత్యాన్వేషణ సాగిస్తున్నారు. ఆత్మసాక్షాత్కారం పొందడానికి పలు మార్గాలను వారు కనుక్కున్నారు. మనిషి తనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం. దాని ద్వారా సత్యాన్ని అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ సత్యం వెలుగులో ఉన్నతమైన విలువలతో కూడిన జీవనాన్ని కొనసాగించాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అదే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం.
భగవంతుడు సత్యాన్వేషణకు సంబంధించిన సమస్త యంత్రాంగాన్నీ మనలోనే నేర్పుగా, అందంగా భద్రపరిచాడు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది:
ఒకప్పుడు బ్రహ్మ దగ్గరకు దేవతలు, ఋషులు వెళ్ళి ‘‘దేవా! భూలోకంలో మనుషులు ఆనందం కోసం అన్ని రకాల దుష్కర్మలు, దైవ వ్యతిరేక, అనైతిక కార్యాలు చేస్తున్నారు. క్షణికానందం కోసం మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. వారి హృదయాలలో భక్తి లేదు. ఏదో విధంగా జీవితాలను ఆనందంగా గడిపెయ్యాలని పరితపిస్తున్నారు. ఆ ఆనందాన్ని వెతకరాని చోట్ల వెతుకుతున్నారు. మీరు ప్రసాదించిన జీవితం నాశనం చేసుకుంటున్నారు. దీనికి మీరే పరిష్కారం చూపించాలి’’ అని మొరపెట్టుకున్నారు.
‘‘దానికేముంది? వారి అన్వేషణ ఆనందం కోసమే కదా! దాన్ని సముద్రం లోతుల్లో దాచిపెడదాం’’ అన్నాడు బ్రహ్మ. ‘సరే’నన్నారు దేవతలు, ఋషులు. కానీ దానివల్ల ఫలితం కనిపించలేదు.
కొంతకాలానికి వారు శివుడి దగ్గరకు వెళ్ళి, జరిగింది చెప్పి, ‘‘స్వామీ! ఇప్పటికే మానవుడు సముద్రగర్భంలో పరిశోధనలు చేస్తున్నాడు. అతను వెతికే ఆనందాన్ని అక్కడ దాచిపెట్టి ప్రయోజనం లేదు’’ అన్నారు.
‘‘సరే! దాన్ని అంతరిక్షంలో నిక్షిప్తంగా ఉంచుదాం. అక్కడికి రావడం అసంభవం’’ అన్నాడు శివుడు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ ఆశించిన మార్పు మనుషుల్లో కనిపించలేదు.
చివరిగా మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను వేడుకున్నారు. అప్పుడాయన చిరునవ్వుతో ‘‘మీరు మానవ కళ్యాణం కోసం పడుతున్న ఆవేదనను గ్రహించాను. ఆందోళన వద్దు. మానవుడు అన్వేషిస్తున్న ఆనందాన్ని అతని హృదయంలోనే పదిలంగా దాచిపెడదాం. ఏదో ఒక రోజు మనిషి అంతర్ముఖంగా ప్రయాణిస్తూ... ఇంతకాలం తను అన్వేషిస్తున్న ఆనందం తనలోనే ఉందని తెలుసుకుంటాడు’’ అన్నాడు.
ఇది అవగాహన కోసం చెప్పుకున్న కథే. కానీ ఆనందం మన ఆత్మలోనే ఉన్నదనే సత్యమే దీని సారాంశం. ఆత్మానందానికి మించిన సత్యం మరొకటి లేదు. దానికోసమే మానవుడి అన్వేషణ. శ్రీమాతాజీ నిర్మలాదేవి కనుగొన్న సహజయోగంలో ఆత్మసాక్షాత్కార అనుభూతి ద్వారా తెలుసుకొనే సత్యం ఇదే. ఆత్మస్వరూపులుగా మారాలనే సత్యాన్ని తెలుసుకోవడానికే భగవంతుడు మనకు మానవ జన్మ ప్రసాదించాడని ఆమె చెప్పారు. అహంకారం, ప్రత్యహంకారం, అనవసరమైన కట్టుబాట్లు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడే శక్తులు. మనం ఆత్మస్వరూపులుగా పరివర్తన చెందితే... ఆ భగవంతుడి దివ్యప్రేమ మనలో నిండుతుంది. అప్పుడు రాగద్వేషాలు, అసూయ, పగ, ప్రతీకారం, తారతమ్యాలు లాంటివి వదిలించుకుంటాం. ఎందుకంటే ఆత్మకు ఇవన్నీ తెలీవు. ఇదే విషయాన్ని ‘‘రాగద్వేషాలు, లోభ మోహాలు, మద మాత్సర్యాలు, ధర్మార్థ కామ మోక్షాలు లేవు. నేను చిదానందస్వరూపుడైన శివుణ్ణి’’ అంటూ తన ‘ఆత్మాష్టకం’లో శ్రీ ఆదిశంకరులు పేర్కొన్నారు.
సత్యాన్ని మనిషి గ్రహించడం వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. అరిషడ్వర్గాలకు అతీతంగా ప్రేమ, కరుణ, సౌభ్రాతృత్వం లాంటి లక్షణాలతో ప్రశాంతమైన, జీవితాన్ని గడపగలడు. అంతేకాదు, తన కుటుంబంలో, తన చుట్టూ ఉన్న సమాజంలో శాంతి సామరస్యాలను పెంచగలడు. భావితరాల శ్రేయస్సు కోసం... కేవలం ఉన్నత విద్య, ధనం, ఆధునిక విధానాలపై మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి వైపు మనం ప్రయాణం మొదలు పెట్టాలి. సత్యాన్వేషణకు సమయాన్ని కేటాయించాలి. అప్పుడే అన్ని విధాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందగలం.
-డాక్టర్ పి. రాకేష్, 8988982200‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
Updated Date - 2023-06-23T04:00:34+05:30 IST