Buddha: శ్రమయేవ జయతే!
ABN, First Publish Date - 2023-05-05T02:52:33+05:30
మానవత్వం అంటే మనిషిని మనిషిగా గౌరవించడం మాత్రమే కాదు... సమస్త జీవులనూ, ప్రకృతినీ ప్రేమించడం. హింసకూ, విధ్వంసాలకూ దూరంగా ఉండడం.
నేడు బుద్ధ జయంతి
మానవత్వం అంటే మనిషిని మనిషిగా గౌరవించడం మాత్రమే కాదు... సమస్త జీవులనూ, ప్రకృతినీ ప్రేమించడం. హింసకూ, విధ్వంసాలకూ దూరంగా ఉండడం. ‘‘హింస అంటే శారీకమైనది మాత్రమే కాదు. హీనంగా చూడడం, అవమానించడం, శ్రమకు తగిన ఫలితం ఇవ్వకపోవడం... ఇవన్నీ హింసలే’’ అన్నాడు బుద్ధుడు.
బుద్ధుడిలోని మానవీయత మహా సముద్రం కన్నా గొప్పది. విశ్వం కన్నా విశాలమైనది. బుద్ధుని కాలంలో కులం, ప్రాంతం, జన్మలను బట్టి ఒక మనిషిని మరో మనిషి హీనంగా చూసే పరిస్థితులు ఉండేవి. మనిషిని పశువు కన్నా హీనంగా భావించి... గొడ్డు చాకిరీ చేయించుకొని, పనికి తగిన ఫలితం ముట్టజెప్పని దోపిడీ కూడా యథేచ్ఛగా సాగేది. ‘‘కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలలోనే కాదు... సామాజిక, ఆర్థిక విషయాలలో కూడా నైతికత అవసరం’’ అని బుద్ధుడు పదేపదే చెప్పేవాడు. ఆధ్యాత్మిక దోపిడీలనే కాదు, శ్రమదోపిడీనీ బుద్ధుడు వ్యతిరేకించాడు. శ్రమను గౌరవించాలనీ, శ్రమకు తగిన ఫలితం అందాలనీ ఆయన చెప్పిన ప్రబోధాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ‘కణ్ణ జాతక కథ’ ఒకటి.
పూర్వం అవంతీ నగరం పక్కనే ఉన్న ఓ గ్రామంలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె దగ్గర చిన్న కోడె దూడ ఉండేది. దాని రంగు నలుపు. కాబట్టి దానికి ‘కన్నయ్య’ అని పేరు పెట్టుకుంది. అల్లారుముద్దుగా పెంచింది. అది పెరిగి పెద్దదయింది. మహా బలశాలి అయింది. చూపులకు భయపెట్టేది కానీ, ఎవరినీ పొడిచేది కాదు. పిల్లలు కూడా ఆ కన్నయ్యతో ఆడుకొనేవారు. అందమైన దాని గంగడోలు పట్టి ఊగేవారు.
ఒక రోజు అది నదీ తీరంలో మేస్తోంది. అక్కడికి దగ్గరలోనే నది లోంచి రాకపోకలు సాగించే రేవు ఉంది. అక్కడ లోతు తక్కువ కావడం వల్ల బండ్లు వస్తూ, పోతూ ఉండేవి. ఆ రోజు కొన్ని బండ్ల మీద సరుకులు నింపుకొన్న ఒక వ్యాపారి ఆ రేవు దగ్గరకు వచ్చాడు. కానీ ఏటి గట్టున ఉన్న ఇసుకలో బండ్ల చక్రాలు దిగబడిపోయాయి. బండ్లు కదల్లేదు. అప్పుడు అక్కడ ఉన్న వ్యాపారులకు దూరంగా కన్నయ్య కనిపించాడు. అందరూ వెళ్ళి, దాని మెడకు తాళ్ళు వేసి లాక్కొచ్చి, బండ్లు లాగించాలని అనుకున్నారు. కానీ అది అందరినీ విసిరికొట్టింది.
అప్పుడు దూరంగా పోతున్న ఒక వ్యక్తి ‘‘ఆ కర్రెద్దు పేరు కన్నయ్య. మీరలా చేస్తే మీకే ప్రమాదం. దాని శ్రమకు తగిన పారితోషికం ఇస్తామని బతిమాలండి’’ అన్నాడు. వ్యాపారులు అలాగే చేశారు. కన్నయ్య వచ్చింది. ఒక్కొక్క బండినీ అవలీలగా లాగి, ఆవలితీరం చేర్చింది.
వంద రూకలు ఇస్తానన్న వ్యాపారి... ఒక సంచిలో యాభైల రూకలే ఉంచి, కన్నయ్య మెడకు చుట్టాడు. వ్యాపారి చేసిన మోసం గ్రహించిన కన్నయ్య కాలు దువ్వింది. బుసలు కొట్టింది. బండ్లకు అడ్డంగా నిలబడింది. కన్నయ్యను కొట్టి, చెదరగొట్టాలని వ్యాపారులు ప్రయత్నించారు. అది కోపంతో రంకె వేసింది. దాంతో వ్యాపారుల ఎడ్లన్నీ భయంతో పారిపోయాయి. కన్నయ్య అక్కడే నిలబడింది. చేసేది లేక, క్షమాపణలు వేడుకొని... మిగిలిన యాభై రూకలనూ ఆ సంచిలో ఉంచాడు వ్యాపారి. అప్పుడు కన్నయ్య శాంతించి, అడ్డు తొలగింది. వ్యాపారులు తమ దారిన తాము వెళ్ళిపోయారు. కన్నయ్య ఇంటికి వచ్చి, ఆ రూకల సంచిని తన ముసలవ్వకు అందించింది.
ఇదీ బుద్ధుడు చెప్పిన ‘కణ్ణ జాతక కథ’. ‘కణ్ణ’ అంటే ‘కృష్ణ’ అని అర్థం. బుద్ధుడు ఈ ప్రపంచానికి అందించిన ‘పంచశీల’లో ‘దొంగతనం చేయను’ అనేది ఒకటి. దీన్ని ‘అదిన్న దానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి’ అంటారు. అంటే ‘ఇవ్వనిదాన్ని తీసుకోను’ అనీ, ‘ఇతరులు దానం చేయకుండా తీసుకోను’ అని అర్థం. అలాగే తన శ్రమకు మించిన ఫలితాన్ని తీసుకోవడం కూడా అదిన్న దానమే. ‘కేవలం దొంగతనం మాత్రమే కాదు... దోపిడీలు, లంచాలు కూడా అదిన్నదానమే’ అంటుంది బౌద్ధం. ఎక్కువ శ్రమ చేయించుకొని, తక్కువ కూలి ముట్టజెప్పడం... అదీ దొంగతనమే! అది శ్రమను దొంగిలించడం. దొంగతనాన్ని ప్రోత్సహించడం, చూస్తూ ఊరుకోవడం, ప్రతిఘటించకపోవడం కూడా దోషమే అనేది బౌద్ధ తత్త్వం. ఈ కథలో కన్నయ్య కూడా అదే పని చేసింది. ప్రతిఘటించింది. ఫలితం పొందింది.
‘శ్రమను గౌరవించాలి’ అని బుద్ధుడు చెప్పిన 2400 సంవత్సరాల తరువాత... శ్రమను ఆధారం చేసుకొనే తన తత్త్వాన్ని రూపొందించాడు కార్ల్‌మార్క్స్. శ్రమ ఫలితాన్ని వివరిస్తూ ‘కాపిటల్’ అనే గ్రంథం రాశాడు. వారిద్దరి జయంతులు (వైశాఖ పున్నమి, మే 5) ఈ రోజే రావడం విశేషం.
• బొర్రా గోవర్ధన్
Updated Date - 2023-05-05T03:09:52+05:30 IST