Buddha: సద్ధర్మమే శరణం
ABN, First Publish Date - 2023-05-26T04:01:57+05:30
‘‘ఇంటి పై కప్పు దృఢంగా లేకపోతే ఎలాగైతే వర్షపు నీరు ఇంట్లోకి ప్రవేశిస్తుందో, అలాగే అభావితమైన (మన ఆధీనంలో లేని) మనస్సులోనికి కోరిక... అంటే విషయాసక్తి ప్రవేశిస్తుంది’’ అని అర్థం.
యథా అగారం దుచ్ఛన్నం వుట్ఠి సమతివిజ్ఝతి
ఏవం అభావితం చిత్తం రాగో సమతివిజ్ఝతి
‘‘ఇంటి పై కప్పు దృఢంగా లేకపోతే ఎలాగైతే వర్షపు నీరు ఇంట్లోకి ప్రవేశిస్తుందో, అలాగే అభావితమైన (మన ఆధీనంలో లేని) మనస్సులోనికి కోరిక... అంటే విషయాసక్తి ప్రవేశిస్తుంది’’ అని అర్థం.
చిత్తాన్ని నిరంతరం భావితం చేయాలి. అంటే దాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. చిత్తం భావితమై ఉండాలంటే దాన్ని అనుకూల దశలోకి మళ్ళించాలి. దృఢమైన క్రమశిక్షణ వల్ల చిత్తం మన ఆధీనంలోకి వస్తుంది. చిత్తాన్ని ఎప్పుడూ దాని దారికి దాన్ని వదిలేయకూడదు. మన అధీనంలో ఉన్న చిత్తం ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుంది. భావిత చిత్తంలో రాగాదులు ప్రవేశించలేవు.
రాగం అంటే ఏమిటి? అనురాగం. ఈ అనురాగాన్నే ‘ఆసక్తి, ప్రేమ’ అని కూడా అంటాం. ‘‘ప్రేమ ఉండడం వల్ల నష్టం ఏమిటి? ప్రేమే సమాజాన్ని నడిపిస్తోంది కదా!’’ అని కొందరు అనుకుంటారు. కానీ ఇక్కడ బుద్ధుడు సమాజ శాస్త్రం గురించి మాట్లాడడం లేదు. బౌద్ధ గ్రంథాలైన ‘త్రిపిటకాల’ను సునిశితంగా పరిశీలిస్తే బుద్ధుడు గొప్ప తత్త్వవేత్త అని తెలుస్తుంది. మహాతాత్త్వికుడైన బుద్ధుడి దృష్టిలో ప్రేమే క్రోధానికి కారణం. చిత్తంలో ఎప్పుడైతే ప్రేమ ఉదయిస్తుందో అప్పుడే క్రోధం కూడా ఉదయిస్తుంది. ఆ క్రోధం వల్ల వ్యక్తి ఎన్నో అనర్ధాలను కొనితెచ్చుకుంటాడు. అందుకే బుద్ధ భగవానుడు ‘‘వ్యక్తి లోకంలో శుభాను పశ్యి కాకూడదు’’ అంటాడు.
‘‘ఇదేమిటి? లోకంలో శుభాలను ధరిచడం కూడా నేరమా?’’ అని కొందరు అంటారు. కానీ బుద్ధుడి దృష్టి వేరు. లోకంలో శుభాలు... అంటే, ఆనందించదగ్గ విషయాలేవీ లేవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా దుఃఖమే. కాని మనం అవిద్యా ప్రభావంతో దుఃఖాన్ని సుఖంగా, సుఖాన్ని దుఃఖంగా దర్శిస్తూ ఉంటాం. ఈ దుఃఖ సముదాయాన్ని నిరోధించాలంటే మొదట జనన మరణ చక్రాన్ని ఆపెయ్యాలి. జన్మించిన ప్రతివారికి దుఃఖం తప్పదు. అందుకే ‘‘జన్మ వల్లే జరా మరణ శోక పరిదేవ దుఃఖ దౌర్మనస్యాలు పుడతాయి’’ అంటుంది ‘ప్రతీత్య సముత్పాద’ సిద్ధాంతం. జన్మ ఆగిపోతే ఈ జరా మరణాలు కూడా ఆగిపోతాయి.
నాలుగు స్మృతిప్రస్థానాల్లో చిత్తానుపశ్యన ఒకటి. స్మృతిప్రస్థానాన్ని పాళీ భాషలో ‘సతిపట్టానం’ అంటారు. చిత్తాన్ని సమాహిత, అసమాహితాది వివిధ దశలలో... ఉన్నది ఉన్నట్టుగా జ్ఞాన పూర్వకంగా తెలుసుకోవడం చిత్తానుపశ్యన. ‘చిత్తం’ అంటే మనస్సే. దీన్నే మనం ఆంగ్లంలో ‘మైండ్’ అని, ‘స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్’ అని అంటాం.
బౌద్ధ దర్శనంలో చిత్తాన్ని విజ్ఞానం అని, విజ్ఞప్తి అని కూడా అంటారు. ‘’ఈ ప్రపంచమంతా చిత్త నిర్మితమే’’ అంటుంది యోగాచారం. అంటే ఈ ప్రపంచమంతా నీ మనస్సు ద్వారా నిర్మితమైనదే. మనస్సే లేకపోతే ఈ దృశ్యమానమైన ప్రపంచమూ లేనట్టే. ఇదే అమనస్క స్థితి. అయితే ఇది సామాన్యులకు కాదు... యోగులకు మాత్రమే అవసరం. యోగులందరూ దీనికోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. సామాన్యులకు మాత్రం చిత్త సంరక్షణ ముఖ్యమైన కార్యం. చిత్తం నిరంతరం స్పందిస్తూ ఉంటుంది. అది చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంత సులభమైన పని కాదు. కాని జ్ఞాని దీని వంకరలన్నీ ఊడగొట్టి చక్కగా తయారు చేస్తాడు. బాణాలు తయారు చేసే వాడు ఎలాగైతే బాణాల్ని కొలిమిలో పెట్టి, వాటిని సుత్తితో కొట్టి, చక్కగా తీర్చి దిద్దుతాడో... అలాగే సాధకుడు సాధన ద్వారా తన మనస్సును నిరంతరం ఋజుమార్గంలోకి తెచ్చుకుంటాడు. చిత్తాన్ని రక్షించుకోవాలంటే సద్ధర్మమే శరణం. సద్ధర్మాచరణ వల్లనే చిత్తానికి శాంతి, సహనం సమకూరుతాయి. ఈ ప్రజ్ఞ ఉదయించగానే మనిషికి నిత్యానిత్య వివేకజ్ఞానం కూడా కలుగుతుంది. దుఃఖం ఎలా ఉదయిస్తుందో, ఉదయించిన దుఃఖం ఎలా ఆగిపోతుందో కూడా ఈ ప్రజ్ఞ ద్వారానే మనిషి తెలుసుకోగలుగుతాడు.
• ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు, జేఎన్‌యు, న్యూఢిల్లీ.
91 98189 69756
Updated Date - 2023-05-26T04:03:34+05:30 IST