సమస్యలకు కారణం మనమే
ABN, First Publish Date - 2023-07-13T23:43:32+05:30
ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం... తమ సమస్యలు గట్టెక్కడానికే. ఉదయాన్నే లేచి, ముందుగా దేవుణ్ణి తలచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు. ఇంట్లో ఏదైనా వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ‘‘ఈ పని జరగలేదు, ఆ పని ..
చింతన
ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం... తమ సమస్యలు గట్టెక్కడానికే. ఉదయాన్నే లేచి, ముందుగా దేవుణ్ణి తలచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు. ఇంట్లో ఏదైనా వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ‘‘ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు, ఇంకా ఆ పనులు మిగిలే ఉన్నాయ్’ అనుకుంటారు. ప్రపంచంలో పెద్ద పెద్దవాళ్ళు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటారు. ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది? అనేది సమస్య. ఈ సమస్యలన్నీ మన సమయం మొత్తాన్ని తినేస్తున్నాయి. ఇంతకీ ఈ సమస్యలు ఎక్కణ్ణించి వచ్చాయి? భగవంతుడే ఈ సమస్యలను సృష్టించాడని అనుకొనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతను సృష్టించుకున్నవే. ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించి ఉంటే... వాటి నుంచి బయటపడడం చాలా కష్టమయ్యేది.
ఎవరైనా వందేళ్ళు బతికితే ఎన్ని రోజులవుతుంది? కేవలం 36,500 రోజులు మాత్రమే. ఈ జీవితమనే రైలు బండి తనదైన శైలిలో పోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ రైలు నుంచి మనం దిగిపోవలసిందే. కానీ ఇప్పటివరకూ మీరు జీవించిన కాలంలో మీరేం నేర్చుకున్నారు? ఏం గుర్తించారు? మిమ్మల్ని మీరు గుర్తించారా? మీరెవరు? మీరు ఎవరనే సంగతి పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మీ జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది? చాలామంది ‘శాంతి’ అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు. తన సమస్యలన్నీ తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తాడు. పిల్లాడు తప్పిపోయి, దుఃఖంతో విలవిలలాడుతున్న తల్లిని ‘‘మీకు శాంతి ఎలా లభిస్తుంది?’’ అని అడిగితే ‘‘నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది’’ అంటుంది. అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుందంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి... ఏదైతే మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారో... అదే రేపు మీ దుఃఖానికి కారణం అవుతుంది. ఈ విషయంలో నాలాంటివారు చేసేది ఒకటే... మిమ్మల్ని మీకు పరిచయం చెయ్యడం. తద్వారా మీకు లభించిన ‘జీవితం’ అనే ఈ అవకాశం గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకోగలరు. మీలోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది. అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా? అంటే వస్తాయి. కానీ సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుంచి బయటపడే మార్గాన్ని మీరు కనుక్కోగలరు.
-ప్రేమ్ రావత్, 9246275220,
Updated Date - 2023-07-14T00:02:16+05:30 IST