Nupur: అదెంత నరకమో నాకు తెలుసు
ABN, First Publish Date - 2023-07-05T00:34:43+05:30
‘‘అమ్మా, నాన్నా రోదిస్తూ ఉంటే చూడడం నా జీవితంలో అదే మొదటిసారి. ‘‘నేను ఏదో తప్పు చేసి ఉంటాను. అది వాళ్ళని బాధ పెట్టి ఉంటుంది’’ అనుకున్నాను. నాకు భయం వేసింది. నేనూ ఏడ్చేశాను. నాకు ఆరోగ్యం బాగోలేకపోతే... అంతకుముందురోజు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.
ఎనిమిదేళ్ళ వయసులోనే నూపూర్ లల్వానీకి తన భవిష్యత్తేమిటో అర్థమయిపోయింది. టైప్-1 డయాబిటి్‌సతో ఇరవై ఎనిమిదేళ్ళుగా పోరాడుతున్న ఆమె ఆత్మస్థైర్యాన్ని ఏ దశలోనూ పోగొట్టుకోలేదు. మధుమేహ రోగులకు అవగాహన కల్పించడానికీ, చేయూతనివ్వడానికీ ఆమె చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా లక్షమందికి పైగా ప్రయోజనం పొందారు. స్ఫూర్తివంతమైన నూపుర్ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘అమ్మా, నాన్నా రోదిస్తూ ఉంటే చూడడం నా జీవితంలో అదే మొదటిసారి. ‘‘నేను ఏదో తప్పు చేసి ఉంటాను. అది వాళ్ళని బాధ పెట్టి ఉంటుంది’’ అనుకున్నాను. నాకు భయం వేసింది. నేనూ ఏడ్చేశాను. నాకు ఆరోగ్యం బాగోలేకపోతే... అంతకుముందురోజు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ నాకు కొన్ని టెస్ట్స్ చేశారు. వాటి రిపోర్టులు నాన్న చేతిలో ఉన్నాయి. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. మెల్లగా వివరించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పిన దాన్నిబట్టి... నాకు టైప్-1 డయాబిటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇక జీవితాంతం రోజుకు అయిదు సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి. రోజుకు అయిదారు సార్లు నా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎనిమిదేళ్ళ వయసున్న నాకు అది పెద్ద షాక్. దాని నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. మిగిలిన పిల్లల్లా ఉండలేననీ, ఆ వ్యాధి నా జీవన శైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనీ నాకు అర్థమయింది. క్రమంగా దానికి అలవాటు పడ్డాను.
దాంతో ఆత్మవిశ్వాసం పెరిగింది...
నేను పుట్టింది, పెరిగింది, ప్రస్తుతం ఉంటున్నదీ ముంబాయిలోనే. మా నాన్న ఐటి రంగంలో ఉన్నారు. అమ్మ కొన్నాళ్ళు టీచర్‌గా పని చేసి, న్యాయవాదిగా స్థిరపడ్డారు. బాగా చదువుకోవాలని నన్ను నిరంతరం ప్రోత్సహించేవారు. నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా చదువులో ఏ రోజూ వెనుకబడలేదు. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బిఎస్సీ, ఆ తరువాత ఎంబిఎ-మార్కెటింగ్ చేశాను. మొదట్లో కొన్నాళ్ళు ఒక ఆంగ్ల పత్రికలో ఉద్యోగం చేశాను. తరువాత ఆతిథ్యరంగంలో స్థిరపడ్డాను. మా సంస్థలో డిపార్ట్‌మెంట్ హెడ్ అయిన అతి పిన్నవయస్కురాలిని నేనే. నాకు డయాబిటిస్ ఉందనే ఆలోచన నన్ను కుంగదీయకుండా... ఎప్పుడూ బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తాను. ఫిట్‌నె్‌సకు ప్రాధాన్యం ఇస్తాను. 2019లో... డయాబిటిస్ ఉన్న మరో ముగ్గురితో కలిసి వంద కిలోమీటర్ల వాక్‌థాన్ చేయడం నా ఆత్మ విశ్వాసాన్ని ఎంతో పెంచింది. అది మేం పూర్తి చేయలేమని చాలామంది సందేహించారు. కానీ వారి ఆలోచన తప్పని మేం నిరూపించాం. తరువాత మారథాన్లలో కూడా పాల్గొన్నాం.
200 వర్క్‌షా్‌పలు...
రెగ్యులర్ చెకప్స్ కోసం ఆసుపత్రులకు వెళ్తున్నప్పుడు... తోటి మధుమేహ వ్యాధిగ్రస్తులను గమనించాను. చాలామందికి తమ వ్యాధి పట్ల అవగాహన తక్కువ. ఆర్థికంగా, మానసికంగా నా కుటుంబం అండ ఉంది కాబట్టి ఆ సమస్యలేవీ నాకు ఎదురుకాలేదు. కానీ ఆర్థిక, సామాజిక సమస్యలను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. వారికి ఏదైనా సాయం చెయ్యాలనుకున్నాను. వారికి నైతిక స్థైర్యం కలిగించి, ఉత్సాహాన్ని నింపడానికి ఫేస్‌బుక్ ద్వారా ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ తరువాత దాన్ని ‘డయాబిటిస్ సపోర్ట్ నెట్‌వర్క్ ఇండియా’ పేరుతో ఒక కమ్యూనిటీగా విస్తరించాను. ‘ఫేస్‌బుక్ కమ్యూనిటీ యాక్సిలేటర్ ప్రోగ్రామ్’ కింద అది ఎంపికయింది. ఆ తరువాత ఒక వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి చెయ్యాలనుకున్నప్పుడు నిధుల సమస్య ఎదురైనా... ఫేస్‌బుక్ ప్రోగ్రామ్‌కు మా కమ్యూనిటీ ఎంపిక కావడంతో అది సాధ్యమయింది. యాభైవేల డాలర్ల నిధులు పోగయ్యాయి. 2019లో ‘బ్లూ సర్కిల్ డయాబిటిస్ ఫౌండేషన్’ పేరుతో లాభాపేక్ష లేని ఒక సంస్థను, వెబ్‌సైట్‌ను, రెండేళ్ళ తరువాత ‘బ్లూసర్కిల్ డయాబిటిస్’ పేరిట ఒక యాప్‌ను ప్రారంభించాను. మా యాప్ ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ బ్లడ్ షుగర్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆహారం, మందులు తీసుకోవాల్సిన సమయాలపై నిరంతరం నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.
అంతేకాదు, రోగుల ఆరోగ్య స్థితిని వారి కుటుంబ సభ్యులు పర్యవేక్షించే వీలు కూడా దీన్లో ఉంది. మరోవైపు ‘ప్రాజెక్ట్ ఇషా’ ద్వారా... ఉదారులైన కొందరి సాయంతో... నిరుపేదలైన మధుమేహగ్రస్తులకు మందులు, ఆర్థిక సాయం, మార్గదర్శకత్వం అందిస్తున్నాం. మధుమేహం విషయంలో రోగులకు, వారి కుటుంబాలకు ఎన్నో సందేహాలుంటాయి. ఏ సమయంలోనైనా వాటిని నివృత్తి చేసుకోవడానికి ‘బడ్డీ ప్రాజెక్ట్ హెల్ప్‌లైన్’ ప్రారంభించాను. దేశవ్యాప్తంగా ఉన్న మా వాలంటీర్లు స్థానిక భాషల్లో ఈ సందేహాలను తీరుస్తారు. ఈ హెల్ప్‌లైన్‌కు మంచి స్పందన లభిస్తోంది. అలాగే... మేము చేపట్టిన ‘ప్రాజెక్ట్ గియా’ ద్వారా డయాబిటిక్ మహిళలు, బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించి, పలు కార్యక్రమాలలో భాగస్వాముల్ని చేసి, సాధికారత కల్పిస్తున్నాం. 2020 నుంచి ప్రతి ఆదివారం ఆన్‌లైన్ వర్క్‌షా్‌ప్సను మా ఎన్జీవో నిర్వహిస్తోంది. దీనిలో వినోద, విద్యా సంబంధమైన అంశాలపై చర్చిస్తూ ఉంటాం. ఇప్పటివరకూ 200కు పైగా వర్క్‌షాపులు నిర్వహించాం. సుమారు 20వేలమంది వీటిలో రిజిస్టర్ అయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ‘కాఫీ క్యాచ్ అప్’ పేరుతో చర్చావేదికలు నిర్వహిస్తున్నాం.
సమాజంలో మార్పు రావాలి...
ఇప్పుడు నా వయసు ముప్ఫై ఆరేళ్ళు. ఉద్యోగాన్నీ, ఎన్జీవో పనులనూ సమన్వయం చేసుకోవడం కష్టమే అయినా అలవాటైపోయింది. చిన్న వయసులో మధుమేహం లాంటి వ్యాధి సోకడం ఎంత నరకమో నాకు తెలుసు. అందుకే వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆరోగ్య పరీక్షా శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారు. నేను చేపట్టిన ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి ద్వారా ఇప్పటివరకూ సుమారు లక్షమందికి సాయం చేసి ఉంటాను. కానీ ఇది సముద్రంలో నీటి చుక్కలాంటిది. మన దేశంలో తీవ్రస్థాయి మధుమేహంతో బాధపడుతున్నవారు సుమారు ఎనిమిది కోట్లమంది ఉంటారని ఒక అంచనా. కాబట్టి మా సేవలను వీలైనంత విస్తరించడానికి కృషి చేస్తున్నాను. అయితే చేయాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా మధుమేహ రోగుల పట్ల సమాజంలో చిన్నచూపు ఉంది. విద్య, ఉపాధి, వివాహాల విషయంలో వారు వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఆ మార్పు తేవాలన్నదే నా లక్ష్యం.’’
Updated Date - 2023-07-05T00:41:34+05:30 IST