Rasika Dugal: ఓటీటీ లేబుల్ ఇష్టపడతా!
ABN, First Publish Date - 2023-07-30T02:20:45+05:30
ఈ నటి పదిహేనేళ్ల నుంచి బాలీవుడ్‌లో నటిస్తోంది. బుల్లితెర అవకాశాలనూ వదులుకోలేదు. గొప్ప పాత్రలు చేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. అయితే మీర్జాపూర్, ఢిల్లీ క్రైమ్.. లాంటి వెబ్‌సిరీసుల్లో ఆమె నటన ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ స్ట్రీమింగ్ సెన్షేషన్ పేరు రసికా దుగల్(Rasika Dugal). ఆమె కెరీర్‌తో పాటు జీవిత విశేషాలివే..
ఈ నటి పదిహేనేళ్ల నుంచి బాలీవుడ్‌లో నటిస్తోంది. బుల్లితెర అవకాశాలనూ వదులుకోలేదు. గొప్ప పాత్రలు చేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. అయితే మీర్జాపూర్, ఢిల్లీ క్రైమ్.. లాంటి వెబ్‌సిరీసుల్లో ఆమె నటన ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ స్ట్రీమింగ్ సెన్షేషన్ పేరు రసికా దుగల్(Rasika Dugal). ఆమె కెరీర్‌తో పాటు జీవిత విశేషాలివే..
‘‘ఈ ఐదేళ్లలోనే.. ఆ మాటకొస్తే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నా కెరీర్‌కు అయితే బాగా కలిసొచ్చింది. ఇటీవలే ‘అధుర’ వెబ్‌సిరీస్‌లో నటించా. ఈ హారర్ థ్రిల్లర్‌లో మంచి పాత్ర చేశా. ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు బోలెడన్ని వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్నా. ఈ పరిణామం ఊహించలేదు. ‘మీర్జాపూర్’లో బీనా త్రిపాఠి లాంటి క్లిష్టమైన పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఢిల్లీ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో కీలకమైన పోలీస్ ఆఫీసర్ నీతూ సింగ్ పాత్ర పోషించా. ఈ రెండు వెబ్‌సిరీస్‌ల వల్ల కొత్త పాత్రలు రచయితలు నాకోసం రాస్తున్నారు. ఇదెంతో మంచిదశ నాకైతే.
నిజంగా అదృష్టం..
సపోర్టింగ్ పాత్రలు, ప్రధాన పాత్రలాంటివి ఉండవని నా అభిప్రాయం. రచయిత రాసిన పాత్రలు, దర్శకుడి విజువలైజేషన్‌కు అన్నీ ఇష్టమైన పాత్రలు. అలా లేకుంటే సపోర్టింగ్ పాత్రలు ఉండవు కదా! 2007లో ‘అన్వర్’ చిత్రంతో బాలీవుడ్‌లో నటించా. వచ్చిన సినిమాలన్నీ నటిస్తున్నా. అయితే ఏదో రోజు మంచి పాత్ర దొరకదా అనే ఆశ. 2015లో ‘కిస్సి’ అనే సినిమాలో నటిగా గుర్తింపు వచ్చింది. 2018లో ‘లస్ట్ స్టోరీస్’నుంచి నాకు శుభశకునాలే. ‘హమిద్’, ‘మంటో’ చిత్రాలు దొరకటం నా అదృష్టం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాను. కేన్స్‌ఫిల్మ్ ఫెస్టివల్‌దాకా వెళ్లివచ్చాను. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవటానికి కూడా సమయం దొరకలేదు. అంతగా సినిమాలతో ప్యాకయిపోయా. అప్పుడే నాకనిపించింది.. ఏదో మంచి జరుగుతుందని!
తెరమీద చూడాలంటే..
మాది జార్ఖండ్. జంషెడ్‌పూర్‌లో పుట్టిపెరిగా. అమ్మమ్మ, అమ్మ, పిన్నిలు.. మధ్య పెరిగా. దీంతో కల్చరల్ వాల్యూస్ తెలిశాయి. బ్యాచిలర్ సైన్స్ ఢిల్లీలో చదివా. అన్నట్లు పదహారేళ్లప్పుడు వన్ ఇయర్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం బ్రెజిల్ వెళ్లా. అప్పుడు అక్కడి ఆహారం పడలేదు. జంక్‌ఫుడ్ తిన్నా. దీంతో ఎనిమిది కేజీలు పెరిగా. ఎంతో ఇబ్బందిగా అనిపించేది. నన్ను నేను అద్దంలో చూసుకుంటూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు గురయ్యేదాన్ని. ఇక బయటివారి కామెంట్లు సరేసరి. సోషల్ కమ్యూనికేషన్స్ మీడియా, ఫిల్మ్ డిప్లొమో ఇన్ యాక్టింగ్ చదివాక.. సినిమాల్లో నటించేప్పుడు స్ర్కీన్‌మీద చూసుకునేందుకు ఇబ్బంది పడేదాన్ని. అద్దానికి, సినిమా తెరకు చాలా తేడా ఉందని నాలో నేను తక్కువగా చేసుకుని బాధపడేదాన్ని. ఎందుకో తెలీదు. బరువు పెరుగుతానేమోనని భయపడుతుంటా. అందుకే హెల్తీ డైట్ పాటిస్తుంటా. విపరీతమైన వర్కవుట్స్ లాంటివి చేయటం ఇష్టం ఉండదు.
ఈ స్థితి మంచిదే కదా..
నేను పోషించిన పాత్రలన్నీ బలమైనవి, బలహీనమైనవి, గొప్పవి, మనసును బాధపెట్టేవి. అంతేకదా.. నిజ జీవితంలో మహిళలు అంతే కదా! ఆ సందర్భాలనే దర్శకులు తెరమీద చూపిస్తున్నారు. హర్ట్ చేసేవి, బాధపెట్టేవి బలమైన పాత్రలని నా నమ్మకం. చిన్నప్పటి నుంచి ఎంతో మంది మహిళల్ని చూశాను. కాలేజీ రోజుల్లో ఫెమినిజం చర్చలు చేసేదాన్ని. ఎక్కడైనా బాధపడేది మహిళే అని తెలుసు. ఇకపోతే నన్ను టీవీ స్టార్, బాలీవుడ్ యాక్టర్, ఓటీటీ స్టార్.. ఇలా ఏవేవో లేబుల్స్ అతికిస్తున్నారు. ఏదీ నాకిష్టం ఉండదు. అయితే ఓటీటీ లేబుల్ తీసుకోవటానికే ఆసక్తి చూపుతా. ఎందుకంటే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వల్ల కనీసం మంచి స్థితి వచ్చింది. నా పాత్రలు ఎంచుకునే హక్కు వచ్చింది. నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నారు. నచ్చిన పాత్రలనూ సెలక్ట్ చేసుకోవటమూ గొప్ప స్థితే కదా మరి!’’
నాలుగేళ్ల నుంచి బిజీగా ఉన్నా. పనే నా బలం. నా తొలి ప్రాధాన్యత.
పెళ్లయ్యాక బిజీ అయ్యాను. పనిలోంచి విశ్రాంతి ఎలా తీసుకోవాలో ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. నా కుటుంబం, స్నేహితులు నన్ను సపోర్టు చేస్తారు. పుస్తకాలు చదువుతాను. పాడ్‌కాస్ట్ చేస్తా. కవిత్వం రాస్తా. ‘మంటో’ షూటింగ్‌కు ముందే ఆయన రచనలు చదివా. దీంతో ఆయన భార్య పాత్రకోసం ట్రాన్స్‌ఫామ్ కావాల్సిన అవసరం లేకపోయింది. పత్రికల్లోని కాలమ్స్ చదువుతుంటా. చదివే ఆసక్తి ఉండటం వల్ల నటించటమూ సులువు అవుతోంది.
Updated Date - 2023-07-30T02:21:20+05:30 IST