ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sudhamurthy : ఆ మాటే నన్ను మార్చింది

ABN, First Publish Date - 2023-01-21T23:11:52+05:30

తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని పేరు సుధామూర్తి. ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయితగా కూడా ఆమె చేసిన అనేక రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. సుధామూర్తి రాసిన పుస్తకాలు ఇప్పటి దాకా 30 లక్షల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని పేరు సుధామూర్తి. ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయితగా కూడా ఆమె చేసిన అనేక రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. సుధామూర్తి రాసిన పుస్తకాలు ఇప్పటి దాకా 30 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ ఆమె అల్లుడే! ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న సుధామూర్తి... తన కుమార్తె అక్షిత నేర్పిన పాఠాల గురించి... ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి... ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు...

‘‘కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతం మాది. మా నాన్న డాక్టర్‌. అమ్మ టీచర్‌. నా తరంలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా అరుదు. నేను 1967లో పీయూసీ పాస్‌ అయ్యాను. ఇంజనీరింగ్‌లో చేరాలనుకున్నా. మా ఇంట్లో వాళ్లనుంచే నాకు పెద్ద వ్యతిరేకత వచ్చింది. నాన్న నన్ను డాక్టర్‌ చదవమన్నారు. అమ్మ ఎమ్మెస్సీ చేయమంది. మా అత్త అయితే నేను ఇంజనీరింగ్‌ చదివితే నాతో ఎప్పుడూ మాట్లాడనంది. వాళ్లందరికీ ఒకటే భయం... నేను ఇంజనీరింగ్‌ చదివితే పెళ్లి చేయటం కష్టమని! నేనేమో ఇంజనీరింగ్‌ తప్ప వేరే ఏ కోర్సులోనూ చేరనన్నాను. చివరకు నా పంతం నెగ్గించుకున్నాను.

అనుబంధాలు శాశ్వతం

రుషి సునాక్‌ యుకె ప్రధాని అయినందుకు అత్తగారిగా చాలా ఆనందిస్తున్నా. రుషి చాలా కష్టపడ్డాడు. నేడు ప్రధాని అయ్యాడు. పదవులు వస్తాయి... పోతాయి. కానీ అనుబంధాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయనేది నా బలమైన నమ్మకం. తను ప్రధాని అయిన తర్వాత మేము ఇంకా కలవలేదు. వాళ్లు వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. మేము మా పనుల్లో బిజీగా ఉన్నాం.

మానేసి వెళ్లిపోతానని అనుకున్నారు...

ఇంజనీరింగ్‌లో నేనే తొలి అమ్మాయిని. అందువల్ల కాలేజీలో స్టూడెంట్స్‌, లెక్చరర్స్‌ కూడా నన్ను వింతగా చూసేవారు. నేను మొదటి ఏడాది కాగానే చదువు మానేసి వెళ్లిపోతానని అనుకున్నారు. అయితే ఆ ఏడాది నాకే ఫస్ట్‌ వచ్చింది. ఆ తర్వాత తోటి విద్యార్థులు నన్ను చూసే విధానం మారింది. మా కాలేజీలో అబ్బాయిల కన్నా నేనే బాగా వెల్డింగ్‌ చేసేదాన్ని. కానీ కాలేజీలో అమ్మాయిల కోసం ఎటువంటి మౌలిక సదుపాయలూ ఉండేవి కావు. నేను చదివిన నాలుగేళ్లు మా కాలేజీలో బాత్‌రూమ్‌ కూడా లేదు. అయినా నేను చదువు మానలేదు. నా ఉద్దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుతారు. కానీ చాలా మందికి అవకాశాలు ఉండవు. నేను పట్టుపట్టి చదివాను. నాలాగే అందరూ చదువుకోవాలని ఎప్పుడూ ఆశిస్తాను.

మా అమ్మాయి మార్పు తెచ్చింది...

నేను ఉద్యోగంలో బాగా బిజీగా ఉన్న రోజుల్లో మా అమ్మాయి అక్షిత ఒక రోజు వచ్చి- ‘‘ఒక అబ్బాయి చాలా బాగా చదువుతాడు. అతనికి స్పాన్సర్‌ చేయవచ్చు కదా’’ అని అడిగింది. అప్పుడు తనకు 15 ఏళ్లు. నేను బిజీగా ఉండటంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మా అమ్మాయికి కోపం వచ్చింది. ‘‘నువ్వే సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నీకు అన్నీ ఉన్నాయి. అయినా నువ్వు సాయం చేయడంలేదు’’ అన్నది. ఆ తర్వాతి రోజు మా అమ్మాయి మాటలు, మా అమ్మమ్మ, తాతయ్య చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు మా తాత గారింట్లో తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఉండేవి. ఇప్పుడైతే ఎర్ర బియ్యం ఫ్యాషన్‌ కానీ... ఒకప్పుడు వాటిని తక్కువగా చూసేవారు. మా ఇంటికి రోజూ ఎవరో ఒకరు వచ్చి సాయం చేయమని అడిగేవారు. వారికి మా అమ్మమ్మ తెల్ల బియ్యం ఇచ్చేది. కొన్నిసార్లు ఆ బియ్యం అయిపోతే ఇంట్లో ఎర్ర బియ్యం వండేది. ఒక రోజు అమ్మమ్మని నేను... ‘‘వాళ్లకు తెల్ల బియ్యం ఇచ్చి, మనం ఎర్ర బియ్యం తినడం దేనికీ’’ అని అడిగా. అప్పుడు అమ్మమ్మ... ‘‘మన ఇంటికి ఇచ్చినవాళ్లు దేవుడితో సమానం. దేవుడు మన ఇంటికి వచ్చి అడిగితే ఏ బియ్యం పెడతాం? తెల్ల బియ్యమే కదా’’ అంది. అప్పుడు తాతయ్య కల్పించుకొని... ‘‘నీకు ఈ విషయాన్ని మరో విధంగా చెబుతా విను... ప్రపంచంలో అత్యంత గొప్పది దానం అని ఉపనిషత్తుల్లో చెప్పారు. మనకు డబ్బు వల్ల కానీ.. సంపదవల్ల కానీ రాని ఆనందం ఇతరులకు సాయం చేయడంలో లభిస్తుంది. మనకు డబ్బు వల్ల వచ్చే ఆనందం శాశ్వతంగా ఉండదు. కొద్ది కాలానికి పోతుంది. కానీ మనకు ఉన్నదానిలో సాయం చేస్తే అప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది’’ అన్నారు. ఆ మాటలు నా మదిలో నాటుకుపోయాయి. ఆ తర్వాత ఆ పిల్లాడికి సాయం చేశాం. ఇలా మా అమ్మాయి నాలో ఒక మార్పు తీసుకువచ్చింది.

అప్పటి నుంచి ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌’ ద్వారా అనేక మందికి సాయం చేస్తున్నాం. అందులో పొందే ఆనందం వెలకట్టలేనిది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి... నేను చేసే కార్యక్రమాలు ఏవీ ఇతరుల మెప్పు పొందాలని చేసేవి కావు. కేవలం నా కోసం, నా సంతృప్తి కోసం మాత్రమే చేస్తాను.

మనల్ని బట్టే మన పిల్లలు...

ఈ కాలంలో తల్లితండ్రులు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనం ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. నా ఉద్దేశంలో పిల్లలకు తల్లితండ్రులే రోల్‌ మోడల్స్‌. చిన్నప్పుడు మా అబ్బాయికి క్లాస్‌లో నాలుగో ర్యాంక్‌ వచ్చింది. మొదటి ర్యాంక్‌ వచ్చినవాడిని వెళ్లి అభినందించమని చెప్పాను. వాడు ముందు ఇష్టపడలేదు. ‘‘నీకన్నా వాడికి మంచి ర్యాంక్‌ వచ్చింది. అందరికీ మొదటి స్థానమే రాదు. ఒక్కొక్కరికీ ఒక సామర్థ్యం ఉంటుంది. దానిని గుర్తించి గౌరవించాలి. నువ్వు వాడిని అభినందిస్తే... వాడు ఆనందపడతాడు. నీకు ఇతరుల సామర్థ్యాన్ని గౌరవించడం తెలుస్తుంది’’ అని మా అబ్బాయికి చెప్పా. తల్లితండ్రులు తమ పిల్లలకు అందరినీ గౌరవించడం నేర్పాలి. అప్పుడే వాళ్ల జీవితం బావుంటుంది.’’

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-01-21T23:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising