ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OHRK Dr. Nori Datratreya : అసలైన హీరో అన్నారు

ABN, First Publish Date - 2023-03-13T03:03:29+05:30

కేన్సర్‌ చికిత్సకు పర్యాయ పదం డాక్టర్‌ నోరి దత్రాత్రేయుడు. సినీతారలు, రాజకీయ ప్రముఖులెందరికో తన టైలర్‌మేడ్‌ చికిత్సతో ఆయుష్షును పెంచిన కేన్సర్‌ వైద్యులు ఆయన. 45 ఏళ్లుగా ప్రతి మూడు నెలలకూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేన్సర్‌ చికిత్సకు పర్యాయ పదం డాక్టర్‌ నోరి దత్రాత్రేయుడు. సినీతారలు, రాజకీయ ప్రముఖులెందరికో తన టైలర్‌మేడ్‌ చికిత్సతో ఆయుష్షును పెంచిన కేన్సర్‌ వైద్యులు ఆయన. 45 ఏళ్లుగా ప్రతి మూడు నెలలకూ ఒక సారి తెలుగు రాష్ట్రాలను సందర్శిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన డాక్టర్‌ నోరి తన వైద్య ప్రస్థానం గురించిన విశేషాలను ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పంచుకున్నారు.

ఆర్కే: మీరు ప్రతి మూడు నెలలకోసారి ఇక్కడకు వచ్చి వెళ్తూ ఉంటారు. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తోంది?

దత్తాత్రేయుడు : నిజమే. అది లాంగ్‌ జర్నీనే! అయితే మూడు నెలలకోసారి వచ్చి, డాక్టర్లకు కొత్త విషయాలు చెప్పి, రోగులకు ఉచిత కన్సల్టేషన్‌ చేసి వెళ్లిపోతూ ఉంటాను. వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను. ఒక వారం లేదా ఎనిమిది రోజులు మాత్రమే ఉంటాను.

ఇక్కడి డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నారా?

అవును. కన్యాకుమారి మొదలు కశ్మీరు వరకూ ఉన్న మన దేశంలోని ఆంకాలజిస్టులు కలుస్తూ ఉంటారు. నా విద్యార్థులే ఇప్పుడు ఇండియాలో లీడర్లు అయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్‌ చికిత్సకు మీరొక పర్యాయపదం అయిపోయారు. ఆ వ్యాధి సోకినవాళ్లకు మొదట మీరే గుర్తుకొస్తారు. అంతటి పాపులారిటీ మీకెలా వచ్చింది? మీరు అమెరికాలో ఉండడం వల్ల వచ్చిందా? లేదంటే మీరు మీ స్వశక్తితో ఆ స్థాయికి ఎదిగారా?

పైకి ఎదగాలంటే ఎవరైనా స్వశక్తి మీద ఆధారపడక తప్పదు. నేను చదువుకున్న వైద్య సంస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. నేను అమెరికాలోని న్యూయార్క్‌ కేన్సర్‌ సెంటర్‌లో శిక్షణ పొందాను. అది అమెరికాలో, మొత్తం ప్రపంచంలోనే టాప్‌. ఆ ఇన్‌స్టిట్యూట్‌ గొప్పతనం ఏంటంటే, మీరు ఏ దేశస్థులు అనేది చూడదు. టాలెంట్‌ ఉంటే ప్రోత్సహిస్తుంది. పైగా అక్కడున్న భారతీయ వైద్యులందరూ ఎంతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్లే! అలా అక్కడే ఒక్కొక మెట్టూ ఎక్కుతూ పై స్థాయికి చేరుకున్నాను. మొదట ఫెలోగా, తర్వాత అసిస్టెంట్‌, అసోసియేట్‌, ఫుల్‌ ప్రొఫెసర్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ది హాస్పిటల్‌గా చేశాను. తర్వాత, ఆ కేన్సర్‌ సెంటర్‌ ఎదురుగానే ఉన్న యూనివర్శిటీలో అంతకంటే పెద్ద పొజిషన్‌కు చేరుకున్నాను. నేను కృష్టాజిల్లా, మంటాడలో పుట్టాను. కర్నూలులో ఎమ్‌బిబిఎస్‌ చదువుకున్నాను. ఉస్మానియాలో ఎమ్‌డి చేశాను. న్యూయార్క్‌ కేన్సర్‌ సెంటర్‌కి చేరుకున్న తర్వాత, హార్వర్డ్‌ నుంచి వచ్చిన వైద్యులు నా అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. భారతదేశంలో చదువుకున్నాను కాబట్టే నేనింత దూరం రాగలిగాను అనిపిస్తుంది. అలా నాకు పేరు, ప్రిస్టేజి, రెప్యుటేషన్‌ క్రమేపీ పెరుగుతూ పోయాయి.

మీ కుటుంబంలో 12 మంది సంతానం. ఇంతమందిని చదివించడమంటే ఆ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు.

చాలా కష్టం. పైగా నాన్న నా నాలుగేళ్ల వయసులోనే పోయారు. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చింది. అందుకే ఆవిడంటే మా అందరికీ ఎంతో ప్రేమ. కానీ ఆవిడ 1993లో పోయారు. ఆఖరువాడిని కాబట్టి ఆవిడ పడ్డ కష్టాలను నేను దగ్గర్నుంచి చూశాను. ఎవరికైనా పరీక్ష ఫీజు కట్టాలంటే చేతికి ఉన్న గాజు తీసి ఇచ్చేసేది. మంగళసూత్రాలు కూడా ఇచ్చేసేది. నాకు అదొక బాధాకరమైన అనుభవం. ఒక అన్నయ్య బాగా చదువుకుని, పై స్థాయికి చేరుకుని, తర్వాతి వాడిని పైకి తీసుకురావడం.. అలా అందరం ఎస్టాబ్లిష్‌ అయ్యాం.

మీరు మెడిసిన్‌ను ఎందుకు ఎంచుకున్నారు?

ప్రజలకు ఏదో చేయాలి అనే కోరిక ఉండేది. అది మెడిసిన్‌ వల్లే సాధ్యపడుతుంది. పైగా అప్పట్లో వైద్యులను దేవుడిలా కొలిచేవారు. దాంతో ఒక రకమైన పట్టుదల వచ్చింది. బందరులో నేషనల్‌ కాలేజీ అని ఉంది. అక్కడ పియుసి ఫస్ట్‌ క్లాసు వచ్చింది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో చదివాను. ఇంటర్న్‌షిప్‌ కోసం ఉస్మానియాకు వచ్చేశాను. ఎమ్‌డి పరీక్ష అయిపోయిన వెంటనే అమెరికా వెళ్లిపోయాను. వెళ్లడానికి కూడా రిసోర్సులు లేవు. అప్పట్లో ఎమ్‌డి చదివే సమయంలో స్టైఫండ్‌గా నెలకు 100 రూపాయలు ఇచ్చేవాళ్లు. ఆ డబ్బుతో అమెరికా వెళ్లడం అసాధ్యం. ఆ సమయంలో నా క్లోజ్‌ ఫ్రెండ్‌ డాక్టర్‌ వాసిరెడ్డి చంద్రశేఖర్‌ సహాయపడ్డాడు. అతను ఎన్‌టిఆర్‌ కుటుంబానికి చాలా సన్నిహితుడు. నేషనల్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ ప్రసాద్‌గారి అల్లుడతను. ఇద్దరం కలిసి మలేసియా వెళ్లి పరీక్ష రాద్దాం అన్నాడు. అలా మేం హోటల్‌ సరోవర్‌లో కలిసి చదువుకునేవాళ్లం. తర్వాత ఇద్దరం కౌలాలంపూర్‌ వెళ్లాం. మా టిక్కెట్లు కూడా ప్రసాద్‌గారే కొన్నారు. చెన్నైలో దిగి అక్కడి నుంచి విమానంలో కౌలాలంపూర్‌ వెళ్లాం. వాసిరెడ్డితోనే చెన్నైలో రామారావు గారి ఇంటికి వెళ్లా. ఇక హైదరాబాద్‌లోని చిక్కడిపల్లిలో ఉన్న వాసిరెడ్డి ఇంటికి రామారావుగారు క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేవారు. అయితే వాసిరెడ్డి రేడియాలజి్‌స్టగా నాకంటే ముందే అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత నాకు డబ్బులు పంపిస్తే, నేను కూడా అమెరికా వెళ్లాను. ఇప్పటికీ ప్రపంచంలో నాకున్న మంచి స్నేహితుడు, సోదరుడు వాడే! ఇప్పుడు వాసిరెడ్డి చికాగోలో స్థిరపడ్డాడు. ఇప్పటికీ నా వాట్సా్‌పలో గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ వాడిదే!

అప్పట్లో ఆంకాలజీకి పెద్ద డిమాండ్‌ లేదు కదా? మరి మీరెందుకు ఎంచుకున్నారు?

ఉస్మానియాలో ఎమ్‌డి చేస్తున్నప్పుడు ఎమ్‌ఎన్‌జె కేన్సర్‌ హాస్పిటల్‌లో రొటేషన్‌ వేశారు. డైరెక్టర్‌ సైదా అలి. అమెరికా నుంచి ఒక బృందం వస్తోందనీ, వాళ్ల సంగతి నన్ను చూసుకోమనీ అయన నాతో అన్నారు. అలాగే నువ్వు చేసే రీసెర్చ్‌ కూడా వాళ్లకు ప్రెజెంట్‌ చేయి అన్నారాయన. వాళ్లకు నా ప్రెజెంటేషన్‌ నచ్చింది. తిరిగి వెళ్లేటప్పుడు, ఆ టీమ్‌ హెడ్‌ తన బిజినెస్‌ కార్డు తీసి నాకు ఇచ్చాడు. అమెరికా వస్తే తనను కలవమని అన్నాడు. తర్వాత స్నేహితుడు పంపిన టిక్కెట్టుతో న్యూయార్క్‌ వెళ్లాను. అప్పటికే అక్కడ మా గురువు కాకర్ల సుబ్బారావుగారు ఉన్నారు. ఆయన నన్ను కొన్ని ఆస్పత్రులకు వెళ్లమని సూచించారు. అప్పుడు స్లోన్‌ కెట్టరింగ్‌ కేన్సర్‌ సెంటర్‌ టీమ్‌ లీడర్‌ నాకిచ్చిన విజిటింగ్‌ కార్డు గుర్తుకొచ్చింది. అక్కడకు వెళ్లి వైస్‌ ఛైర్మన్‌ను కలిశాను. అయితే ఉన్న ఫెలోషిప్‌ ఒక ఫిలిప్పీన్‌ వ్యక్తికి ఇవ్వడం జరిగిందనీ, అతను రాలేని పక్షంలో దాన్ని నీకే ఇస్తాం అన్నారావిడ. దాంతో తిరిగి కాకర్ల గారి దగ్గరకు వెళ్లిపోయి ఇంటర్న్‌షి్‌పలో చేరాను. ఆ సాయంత్రమే మెమెరియల్‌ వాళ్లు నన్ను రమ్మంటున్నారని మెసేజ్‌ వచ్చింది. ఫిలిప్పీన్స్‌ వ్యక్తి రాలేదు కాబట్టి నువ్వెప్పుడు ఫెలోషి్‌పలో చేరతావు అని నన్ను అడిగారు. అలా అద్భుతంగా కష్టపడి పని చేసి, ఫెలోషిప్‌ నుంచి అసోసియేట్‌, డైరెక్టర్‌, ఛైర్మన్‌ ఇలా వేర్వేరు స్థాయిల్లో ఎన్నో వందల మందికి శిక్షణ ఇచ్చాను.

కేన్సర్‌ సోకిన వాళ్లు మీ చేతుల్లో పడితే వ్యాధి నయమవుతుందనే నమ్మకం ఉంది. వ్యాధి నయం అయిపోయన వాళ్లు మీ పట్ల కృతజ్ఞతను ప్రదర్శిస్తూ ఉంటారు.

ప్రేమ్‌ చోప్రా భార్యకు 18 ఏళ్ల క్రితం చికిత్స చేశాను. బాలీవుడ్‌ వెళ్తే నాకు ఘన సన్మానాలు చేస్తారు. యష్‌ చోప్రా ఉన్న రోజుల్లో నేను వెళ్లిన ప్రతిసారీ పెద్ద సన్మానం చేసేవారు. నీలం సంజీవరెడ్డి గారికి చికిత్స చేసిన తర్వాత ఆయన 20 ఏళ్ల పాటు బ్రతికారు. అలాగే డిఎల్‌ఎఫ్‌ బిజినెస్‌ మ్యాగ్నెట్‌ కెపి సింగ్‌ భార్యకు లంగ్‌ కేన్సర్‌. ఆవిడ కోసం ట్రీట్మెంట్‌ డిజైన్‌ చేసి అందించాం. ఆవిడ 19 ఏళ్లు బ్రతికింది. తర్వాత ఆవిడకు ఇంకొక రకం కేన్సర్‌ వచ్చింది. అప్పుడు కెపి సింగ్‌ ప్రైవేట్‌ ఫ్లయిట్‌లో నన్ను ఇండియాకు పిలిపించారు. ఢిల్లీలో చికిత్స చేశాను. కానీ అప్పటికే ఆవిడ వయసు 89. రెండో కేన్సర్‌ను ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆవిడ పోయి రెండేళ్లవుతోంది. ఆ కుటుంబం కూడా నన్ను చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది.

మన దేశంలో కేన్సర్‌ వ్యాధి బాగా పెరుగుతోంది? ఇది నిజమేనా?

అవేర్‌నెస్‌ పెరిగి, పరీక్షలు చేయించుకోవడం వల్ల నంబర్లు పెరిగాయా అనిపిస్తుంది. కేన్సర్‌ పెరగడానికి ఒక రకంగా మన డైట్‌, అలవాట్లు కూడా తోడ్పడుతున్నాయి. డైట్‌ వెస్టర్నైజ్‌ అవుతోంది. ఆకుకూరలు తినేవాళ్లం. వాటిని వదిలేసి హ్యాంబర్గర్లు తింటున్నాం.

మిగతా వ్యాధులకు ఎర్లీ డిటెక్షన్‌ ఉంది. కానీ కేన్సర్‌ను ముందుగానే కనిపెట్టగలిగే పరీక్ష లేదు. ఎందుకని?

మహిళల్లో వచ్చే సర్వైకల్‌ కేన్సర్‌ను పాప్‌స్మియర్‌ పరీక్షతో ముందుగానే కనిపెట్టవచ్చు. ఈసోఫీగల్‌ కేన్సర్‌ను కూడా తేలికగానే కనిపెట్టవచ్చు. ఈ కేన్సర్‌లో గొంతులో మింగుడు పడదు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. క్యాన్సర్‌ వ్యాధి తన లక్షణాలను బయట పెడుతూనే ఉంటుంది. వాటిని మనం గమనించుకుంటూ ఉండాలి. ఏ అసహజ లక్షణమైనా తగ్గకుండా వేధిస్తున్నప్పుడు అప్రమత్తం కావాలి. ఎర్లీ డిటెక్షన్‌, స్ర్కీనింగ్‌ ఎంతో అవసరం.

స్ర్కీనింగ్‌లో ఏమేం పరీక్షలు చేయించుకోవాలి?

ఒకసారి స్ర్కీనింగ్‌ బాగుంటే మళ్లీ నాలుగేళ్ల వరకూ పరీక్షలతో పని ఉండదు. మహిళలు పాప్‌స్మియర్‌, కుటుంబ చరిత్రలో కేన్సర్‌ ఉన్నవాళ్లు బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌తో పాటు 45 ఏళ్లకు మామోగ్రామ్‌ చేయించుకోవాలి. లక్షణాలను గమనించుకుంటూ ఉండాలి. కుటుంబ చరిత్రలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉంటే మగవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 50 ఏళ్ల తర్వాత రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆడవాళ్లలో అమ్మకూ, పిన్నికీ బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉంటే ముందు జాగ్రత్త పడాలి. కాబట్టి ‘వాచ్‌ యువర్‌ బాడీ అండ్‌ లిజన్‌ టు యువర్‌ బాడీ’ అంటాను. కేన్సర్‌ ఎంతో ముందుగానే మనకు చెప్తుంది. ఆ క్లూలను మనం పసిగట్టాలి. కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి. శరీరం ఏం చెప్తుందో వినాలి. కేన్సర్‌ను త్వరగా కనిపెడితే, 99ు నయం చేయవచ్చు. అదీ తక్కువ ఖర్చులో.

వైద్యుడికీ రోగికీ మధ్య ఒక మెకానికల్‌ సిస్టమ్‌ డెవలప్‌ అవుతోంది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉందా?

అక్కడ లేదని నేను గట్టిగా చెప్పగలను. స్లోన్‌ కెట్టరింగ్‌లో మేం పేషెంట్‌తో ఒకటే చెప్తాం. ఎంత కాలం పాటు అవసరమైతే అంతకాలం పాటు నేను నీతోనే ఉంటాను అని చెప్తాం. దాంతో రోగికి ధైర్యం వస్తుంది. అడ్వాన్స్‌డ్‌ ట్రీట్మెంట్‌ ఇవ్వడం అవసరమే కానీ అంతకంటే ఎక్కువగా రోగికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి.

ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్లక్ష్యం, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్‌...వీటితో రోగిలో అభద్రతాభావం పెరిగిపోతోంది. వ్యవస్థ మీదే అపనమ్మకం ఏర్పడిపోతోంది. మీరు ఎన్నో దేశాలు తిరిగారు కదా? ఏ దేశంలో సరైన వైద్య వ్యవస్థ ఉందంటారు?

ఫ్రాన్స్‌లో మంచి సిస్టమ్‌ ఉంది. అలాగే కెనడియన్‌ సిస్టమ్‌ కూడా బాగుంది. బ్రెజిల్‌, అర్జెంటీనా ఇవన్నీ మన మాదిరిగానే ఉంటాయి. అయితే మనం కూడా ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. స్ట్రెంగ్తెన్‌ హాస్పిటల్స్‌, లెట్‌ కార్పొరేట్‌ పీపుల్‌ రన్‌ ఫర్‌ దెయిర్‌ మనీ అని నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ చెప్తున్నాను. అప్పుడే ప్రజలకు చికిత్స అందుబాటులోకొస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్‌లో కేన్సర్‌ చికిత్సలన్నిటికీ చోటు కల్పించాలి. కేన్సర్‌ వచ్చిందని ఎవరూ భయపడకూడని, బాధపడకూడని పరిస్థితి కల్పించాలి. అలాంటి రోజు రావాలని నేను నా శాయశక్తులా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నాను.

కెనడాలో చికిత్స ఎలా సాగుతుంది?

అక్కడ పేద గొప్పా తారతమ్యం ఉండదు. ఎవరెళ్లినా డయాగ్నోస్‌ చేసి, చికిత్స చేయవలసిందే! ఏ ఆసత్రిలో చికిత్స తీసుకున్నా, ప్రభుత్వం ఆ ఆస్పత్రికి డబ్బు కట్టేస్తుంది. అక్కడ పూర్తి ఉచిత హెల్త్‌ కేర్‌ ఉంది. అది అక్కడి పౌరుల హక్కు. ఫ్రాన్స్‌, యుకెలో కూడా ఇలాగే ఉంటుంది. అమెరికాలో డబ్బులేని వారికి మెడికేర్‌ ఉంది. అత్యంత నిరుపేదలకు మెడిక్‌ ఎయిడ్‌ అని ఇంకొకటి ఉంది. ఈ రెండు చోట్లా చికిత్సలకు ప్రభుత్వం డబ్బు కడుతుంది. అక్కడ ఏ ఆస్పత్రీ ఎవరికీ చికిత్సను నిరాకరించకూడదు.

కొంతమంది ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి సర్జరీలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఈ సేవను ఒక స్కీమ్‌లాగా వాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

ఇది మంచి ఆలోచన. అలాగే కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా కాస్త ఛారిటీ మైండ్‌తో వ్యవహరిస్తూ, కనీసం 10ు మందికి ఉచిత చికిత్స అందించాలి.

డాక్టర్‌ అవడం వెనక పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌ ఉంది కదా? మీ రోజుల్లో చదువు, రీసెర్చ్‌, ల్యాబ్‌ ప్రభుత్వ డబ్బుతోనే నడిచేవి కదా? మరి ప్రజలకు తిరిగి చెల్లించేదెలా?

నా లక్ష్యం అదే! 45 ఏళ్లుగా మూడు నెలలకోసారి ఇండియాకు ఎందుకు వస్తూ ఉంటారు అని మీరు నన్ను అడిగారు కదా? నేను రావడానికి కారణం అదే! నాది ఫ్రీ ఎడ్యుకేషన్‌. వైద్యులకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉంటాను.

అన్ని చోట్లా మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టేస్తున్నారు. అసలు ఫ్యాకల్టీ లేకుండా కాలేజీ నడపడం ఎలా సాధ్యపడుతుంది? ఆ కాలేజీ నుంచి ఎలాంటి వైద్యులు తయారవుతారు?

ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ ఉండదు.

మరి అలాంటి కాలేజీలో మెడిసిన్‌ చదివిన విద్యార్థి డాక్టర్‌ అయితే పరిస్థితి ఏంటి?

వైద్యులు మినిమం స్టాండర్డ్స్‌ మెయింటెయిన్‌ చేయాలి. రెగ్యులేటరీ బోర్డులు కూడా స్టాండర్డ్స్‌ ఉన్నాయో, లేదో గమనిస్తూ ఉండాలి.

ఫ్యాకల్టీ అనగానే మెడికల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా వస్తారు కదా? ఒక ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన బ్యాచ్‌ను అక్కడ డాక్టర్ల కింద చూపించేస్తారు. వాళ్లు వాళ్లన లెక్కేసుకుని వెళ్లిపోతారు. ఇంకొక కాలేజీ ఇన్‌స్పెక్షన్‌ వెళ్లేటప్పుడు వీళ్లే అక్కడ తయారవుతారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది.

నిజమే! కానీ ఈ పరిస్థితిని తేలికగా తొలగించుకోవచ్చు. అక్రెడిటేషన్‌ కౌన్సెల్‌ అని ఉంది. వీళ్లు పత్రి మూడేళ్లకోసారి ఆస్పత్రులను సందర్శిస్తూ ఉంటారు. వాళ్లు వస్తున్నారంటే ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ గడగడలాడిపోతుంది. ఎందుకంటే వాళ్లు ప్రతి డాక్టర్‌ క్రెడెన్షియల్స్‌నూ రివ్యూ చేస్తారు. అందుకోసం ఒక టీమ్‌ ఉంటుంది. క్రెడెన్షియల్స్‌ రివ్యూ చేసినప్పుడు, ఒకే డాక్టరు పేరు ఇంకొక చోట రాకూడదు. ఈ పనిని ఐసిఎమ్‌ఆర్‌ చేయాలి. ఇందుకు నేనొక మార్గాన్ని సూచించాను. మొదట వాలంటరీ అక్రెడిటేషన్‌ పెట్టుకుని, టీచింగ్‌ డాక్టర్లు, వాళ్ల అక్రెడిటేషన్‌ వివరాలను ఆస్పత్రుల నుంచి అడిగి తీసుకోవాలి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఆ ఆస్పత్రికే పరిమితం కావాలి. వేరే డాక్టర్లు ఆ లిస్ట్‌లో చేరకుండా చూసుకోవాలి. ఇలా వాలెంటరీగా మూడేళ్లు, మాండేటరీగా మూడేళ్ల నియమం విధించాలి.

ఇన్నేళ్లుగా మీరు వైద్యం చేస్తున్నారు కదా? ఎప్పుడైనా ఒక రోగికి సరైన వైద్యం అందించలేకపోయాను మానసిక వేదనకు గురైన సందర్భం ఉందా?

రోగి నా దగ్గరకు ముందే వచ్చి ఉంటే బాగుండేది కదా? అని మానసిక వేదనకు గురైన సందర్భాలున్నాయి. అయినప్పటికీ చికిత్సతో వ్యాధిని నయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చికిత్సను సవాలుగా తీసుకుంటాను. కుటుంబానికి తల్లి ముఖ్యం కదా! కాబట్టి ఆ రోగిని కాపాడడానికి చాలా కష్టపడతాను. వాళ్లకు మానసిక ధైర్యాన్ని అందించడంతో పాటు రాబోయే శతాబ్దంలో అందుబాటులోకి రాబోయే చికిత్సను ఇప్పుడే ఇప్పించేస్తాను.

ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన భారతీయ రోగులు ఖర్చులను భరించలేకపోతే?

ఖర్చులను భరించలేకపోతే ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ పెద్దగా పట్టించుకోదు. ఇలాంటప్పుడు నేను కలగజేసుకుంటాను. రోగి రిసోర్సులు, బ్యాక్‌గ్రౌండ్‌ గురించి ముందే అడిగి తెలుసుకుంటాను. పరీక్ష చేసి, ట్రీట్మెంట్‌ ప్యాకేజ్‌ రాసిన తర్వాత, చికిత్స ఇక్కడ వద్దు, ఇండియాలో తీసుకో అని పంపించేస్తూ ఉంటాను. స్థోమత లేకపోతే, ఇండియాలో ఫలానా డాక్టరును కలువు అని సూచిస్తూ ఉంటాను. ఇండియాలో డాక్టరుకు చికిత్స గురించిన ఏదైనా సందేహం ఉంటే, నాకు ఫోన్‌ చేయమని చెప్పండి. అతన్ని నేను గైడ్‌ చేస్తాను అని కూడా రోగులకు చెప్తాను. స్లోన్‌ కెట్టరింగ్‌లో ఇన్నేళ్లుగా చేస్తున్నాను. కాబట్టి అమెరికా బయట సెంటర్‌ పెట్టమని అడిగాను. చివరకు ఒప్పించి, గతేడాది ఆగష్టులో చెన్నైలో ఇనాగరేట్‌ చేయించాను. అది స్లోన్‌ కెట్టరింగ్‌ ఇండియా సెంటర్‌. అయితే అది సాధారణ ఆస్పత్రి కాదు. కాంప్లికేటెడ్‌ కేసులను రివ్యూ చేసి, ఆ కేసులను మన్‌హట్టన్‌కు పంపిస్తాం. డాక్టర్ల బృందం చికిత్సను డిజైన్‌ చేసి రోగికి సూచించి, డబ్బులుంటే అమెరికా రమ్మనీ, లేదంటే ఇండియాలోనే అదే చికిత్సను తీసుకోమని సూచిస్తాం. అలాగే రీసెర్చ్‌లో ఎవరైనా కొలాబరేట్‌ చేస్తానంటే అతనికి సపోర్ట్‌ చేస్తాం. ఇప్పుడు స్లోన్‌ కెట్టరింగ్‌ ఇండియన్‌ సెంటర్‌కు నేనే సీనియర్‌ అడ్వయిజర్‌ను. కాబట్టి మన ఇండియన్‌ డాక్టర్లను గైడ్‌ చేయగలుగుతున్నాను.

కుడి కంటికి బదులు ఎడమ కంటికి ఆపరేషన్‌ చేయడం లాంటి హ్యూమన్‌ ఎర్రర్స్‌ అక్కడ కూడా జరుగుతూ ఉంటాయా?

అక్కడ కూడా జరుగుతాయి. అయితే ఆ వైద్యులు ఇక ప్రాక్టీసు చేయడానికి వీలుండదు. అతుల్‌ గౌండే అని మన భారతీయ డాక్టరు ఒక చెక్‌లిస్ట్‌ తయారుచేశాడు. అది ఆపరేషన్‌ టేబుల్‌ దగ్గర ఉంటుంది. అవన్నీ చెక్‌ చేసిన నర్సు, ఫ్లోటింగ్‌ నర్సు సంతకం పెట్టాలి. ఆపరేట్‌ చేసే సర్జన్‌ కూడా సంతకం పెట్టాలి. అప్పుడే పేషెంట్‌ను ముట్టుకోగలం. ఇప్పుడు ఆ లిస్ట్‌ అమెరికా దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. దాంతో పొరపాట్లు పూర్తిగా తగ్గిపోయాయి.

మీరు పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా. మా నిజామాబాద్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలా ఎలా కుదిరింది?

మా అక్కది ఉయ్యూరు. మా బావగారిది వరంగల్‌. అలాగే నేనిక్కడ ఎమ్‌డి చేశాను. ఆ సమయంలో ఆంధ్రా, తెలంగాణా కుటుంబాలు బాగా కలిసేవి. ఆ రకంగా నేను అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాను. ఆవిడ కూడా న్యూయార్క్‌లో డాక్టరు, ఛైర్‌పర్సన్‌.

అప్పట్లో మీరేదో తక్కువకు అమ్ముడుపోయారని జోకులేస్తూ ఉంటారు?

అప్పట్లో గాంధీ ఆస్పత్రిలో నేను ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలో 30 రూపాయలు స్టైఫండ్‌ ఇచ్చేవాళ్లు. అదే నా ఆస్తి. ఆ ఆస్తి ఉన్నవాడికి అమ్మాయిని ఎవరిస్తారు? అప్పట్లో అన్నయ్యలు సపోర్ట్‌ చేసేవారు.

నేను ప్రేమ్‌ చోప్రా భార్యను ట్రీట్‌ చేసినప్పుడు, వీల్‌ చైర్‌లో వచ్చిన ఆవిడ, వెళ్లేటప్పుడు చక్కగా నడిచి వెళ్లింది. ఆయన పెద్ద డాలర్ల కట్ట తెచ్చి, నా టేబుల్‌ మీద పడేశాడు. సార్‌ మీరు చేసిన సహాయం నేను జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నేను మీ బ్లెస్సింగ్‌ చాలు. ఇలా నేను డబ్బులు తీసుకోకూడదు అని చెప్పేశాను. అక్కడ సిస్టమ్‌ అలాంటిది. రోగికి పది పరీక్షలు ఎక్కువ రాస్తే మాకొచ్చే ఆర్థిక ప్రయోజనం ఏమీ ఉండదు. క్రెడిబిలిటీ, రెప్యుటేషన్‌ ఇవన్నీ పెరగాలంటే సిస్టమ్‌ బాగుండాలి. కాబట్టే మేమెక్కడికి వెళ్లినా మాకు గౌరవం ఎక్కువ.

ఇండియాకు చెందిన ప్రముఖులందరూ కేన్సర్‌ చికిత్స కోసం మీ దగ్గరకే వస్తూ ఉంటారు. సోనియా గాంధీ సైతం మీ దగ్గరకే వచ్చారు. మీరంటే నమ్మకం. నమ్మకానికి తగ్గట్టు మీ చికిత్స.

నిజమే. నేను చేసిన రీసెర్చ్‌ కూడా ఉపయోగపడుతోంది. ఒకరికి జీవితం ఇచ్చామనే ఆ ఫీలింగ్‌కు డబ్బుతో వెల కట్టలేం. పైగా మెమోరియల్‌లో అత్యంత సంక్లిష్టమైన కేసులను డీల్‌ చేస్తూ ఉంటాం. అక్కడకు అన్ని దేశాల నుంచి కేన్సర్‌ రోగులు వస్తూ ఉంటారు. అలా ఇజ్రాయెల్‌ నుంచి ఒక మహిళ వచ్చింది. ఆవిడకు రికరెంట్‌ గైనకలాజికల్‌ కేన్సర్‌. ఆవిడ కోసం మేం ప్రత్యేక చికిత్సను కనుక్కొన్నాం. మేము చేసిన చికిత్సకు ఆమె వ్యాధి తగ్గిపోయింది. ప్రతి ఏడాదీ వచ్చి చూపించుకుంటూ ఉంటుంది. నా తరఫున ఇజ్రాయెల్‌లో ఫెలోషిప్‌ ఓపెన్‌ చేయించింది. నేను అక్కడకు వెళ్లినప్పుడు కుటుంబసభ్యులు అందరి మధ్యన కూర్చుని, డాక్టరు గారి వల్లే నేనిక్కడ కూర్చోగలుగుతున్నాను అని చెప్పింది. ప్రతి ఏడాదీ గ్రీటింగ్‌ కార్డు పంపిస్తూ ఉంటుంది. అలా మొన్న నాకు పంపిన కార్డులో.. ‘‘నేను 60వ పెళ్లి రోజు జరుపుకున్నాను.. దాన్లో ముప్పై ఏళ్ల ఆయుష్షు మీరిచ్చినదే!’’ అని రాసింది. ఇలాంటివన్నీ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి.

నా నాలుగేళ్ల వయసులోనే నాన్న పోయారు. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చింది. అందుకే ఆవిడంటే మా అందరికీ ఎంతో ప్రేమ. కానీ ఆవిడ 1993లో పోయారు. ఆఖరువాడిని కాబట్టి ఆవిడ పడ్డ కష్టాలను నేను దగ్గర్నుంచి చూశాను. ఎవరికైనా పరీక్ష ఫీజు కట్టాలంటే చేతికి ఉన్న గాజు తీసి ఇచ్చేసేది. మంగళసూత్రాలు కూడా ఇచ్చేసేది. నాకు అదొక బాధాకరమైన అనుభవం. ఒక అన్నయ్య బాగా చదువుకుని, పై స్థాయికి చేరుకుని, తర్వాతి వాడిని పైకి తీసుకురావడం.. అలా అందరం ఎస్టాబ్లిష్‌ అయ్యాం.

రెండు నెలల క్రితం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు

పంచ్‌ సూత్రాలు అనే ఒక ఆర్టికల్‌ రాశాను.

మొదటి సూత్రం మేక్‌ కేన్సర్‌ యాజ్‌ ఎ నోటిఫైబుల్‌ డిసీజ్‌.

ప్రతి కేసునూ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలి. ఈ ఏర్పాటు టిబికి ఉన్నప్పుడు, కేన్సర్‌కు ఎందుకు వర్తింపచేయకూడదు?

కేరళలో, చెన్నైలో పెట్టించాను. ఇక్కడ తెలంగాణ లో కూడా జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో మాస్కెక్టమీ లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఎక్కువ డబ్బు ఇచ్చిందో డాటా తయారుచేసి, ఇలా కేన్సర్‌ అట్లాస్‌ తయారుచేయాలి. అలాగే కమాండ్‌ సెంటర్‌ పెట్టమని కూడా ప్రభుత్వానికి సూచించాను.

క్యాన్సర్‌పై పోరుకు పంచసూత్రాలు

క్యాన్సర్‌ బారిన పడినవారికి చికిత్సలు చేయడం కోసం మౌలిక సదుపాయాలను పెంచుకోవడం కంటే.. క్యాన్సర్‌ నిరోధంపైన, ఆ కేసులను తొలిదశల్లోనే గుర్తించడంపైన దృష్టిసారించాలని.. అప్పుడే ఆ మహమ్మారిపై సమర్థంగా పోరాడగలమని డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెబుతారు. రోజురోజుకూ దేశంలో క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. దానికి అడ్డుకట్టవేయడానికి ‘పంచసూత్ర’ పేరుతో తీసుకోవాల్సిన ఐదు చర్యల గురించి ఆయన చెప్పారు. అవేంటంటే..

గుర్తించదగ్గ వ్యాధిగా క్యాన్సర్‌

ఎయిడ్స్‌, డెంగీ జ్వరం, హెపటైటిస్‌ బి, మలేరియా.. ఇలా పలు వ్యాధులను ప్రభుత్వం ‘నోటిఫయబుల్‌ డిసీజె్‌స’గా గుర్తించింది. ఇలా గుర్తించిన వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడతుంది. అయితే, ఆ జాబితాలో క్యాన్సర్‌ లేదు. దాన్ని కూడా ఆ జాబితాలో చేర్చి.. దేశంలో నమోదయ్యే ప్రతి కేసుకు సంబంధించిన సమాచారాన్నీ కేంద్రం నమోదు చేయాలని డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెబుతారు. దీనివల్ల కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటుందని.. ఫలితంగా, దేశంలో ఏయే ప్రాంతాల్లో క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయో గుర్తించి, పరిష్కార మార్గాలను ఆలోచించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లోకి స్ర్కీనింగ్‌ పరీక్షలు

క్యాన్సర్‌ పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. సామాన్యులు భరించలేరు. కాబట్టి.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌భవ వంటి ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాల పరిధిలోకి వీటినితీసుకొచ్చి, ఆ పరీక్షలను ఉచితంగా చేస్తే క్యాన్సర్‌ కేసులను మొదటి దశల్లోనే గుర్తించవచ్చు.

అవగాహనకు ప్రత్యేక ప్రభుత్వ విభాగం

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడానికి.. క్యాన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అనుమానం వస్తే చేయించుకోవాల్సిన పరీక్షల గురించి, చికిత్సల గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దానికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి వ్యక్తి నేతృత్వం వహించాలి.

అన్ని గ్రామాలకూ మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ వాహనాలు

రాష్ట్రవ్యాప్తంగా సర్కార్లు చేసే జ్వరపరీక్షలు, కంటిపరీక్షల్లాగా.. క్యాన్సర్‌ పరీక్షలను కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలి. అన్ని గ్రామాలకూ మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ వాహనాలను పంపి పరీక్షలు చేయించాలి.

పొగాకు వ్యతిరేక ప్రచారం

పొగాకు నమలడం, ధూమపానం వల్ల కలిగే ప్రమాదం గురించి వివరిస్తూ పెద్దఎత్తున ప్రచారోద్యమం చేపట్టాలి. స్థానిక భాషల్లో కరపత్రాలు వేసి వీధివీధినా పంచిపెట్టాలి. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ కరపత్రాలను అందుబాటులో ఉంచాలి. పాఠశాల స్థాయి నుంచే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

..ఇవే కాక, క్యాన్సర్‌పై అవగాహనకు, సమాచార సరఫరాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోల్‌ ఫ్రీ నంబర్లను కేటాయించాలని, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్‌ ఆస్పత్రులను, క్యాన్సర్‌ బారిన పడి మరణించే ముప్పును ఎదుర్కొంటున్నవారికి చివరిదశ బాధాకరం కాకుండా ఉపశమనం కలిగించేలా పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సూచించారు.

అయితే 3 వేలు వరకట్నం తీసుకున్నారా?

అది వరకట్నం కాదు. పెళ్లి ఖర్చుల కోసం నాలుగు వేలు తీసుకున్నాం.

ఇప్పుడు మీ ఇద్దర్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు?

ఆవిడది కూడా ఫుల్‌ టైమే! ఫుల్‌టైమ్‌ వాళ్లకు మరీ ఎక్కువ కాకుండా రీజనబుల్‌గా ఉంటాయి. డీసెంట్‌ లైఫ్‌ ఉంటుంది. లక్కీగా మా ఇద్దరు పిల్లలూ చక్కగా ఎదిగారు. బాబు లాయర్‌. మా అమ్మాయి డాక్టరు. అయితే ఇద్దరికీ మా ధృక్ఫథాలు వచ్చాయి. మా వాడు ఎన్‌వైయులో లా చేసి కూడా 20 ఏళ్లుగా లీగల్‌ ఎయిడ్‌లో పని చేస్తున్నాడు. అక్కడ పేద ప్రజలకు రిప్రెంజెట్‌ చేస్తూ ఉంటాడు.

మీకు తీరని యాంబిషన్‌ ఏముంది?

నాది కేన్సర్‌ స్పెషాలిటీ. మరీ ముఖ్యంగా మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచి, కేసులను తగ్గించాలనేది నా లక్ష్యం. ఆస్పత్రులు పెరిగితే ప్రయోజనం ఉండదు. కేసుల సంఖ్య తగ్గించాలి. ఈ నంబర్లను తగ్గించాలంటే స్ర్కీనింగ్‌, కేన్సర్‌ అవేర్‌నెస్‌, ఎర్లీ డిటెక్షన్‌ అనేవి అన్నిటికంటే ముఖ్యం.

మీ నాయకత్వంలో అవేర్‌నెస్‌ పెరగడంతో పాటు కేన్సర్‌ వ్యాధికి సంబంధించి సరికొత్త ఆవిష్కరణలు రావాలి, వస్తాయని ఆసిస్తూ థ్యాంక్యూ వెరీమచ్‌.

థ్యాంక్యూ ఆర్కేగారు. వెరీ హ్యాపీ టు మీట్‌ యూ.

Updated Date - 2023-03-13T03:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising