Ruhani Sharma : బోల్డ్ అంటే భయం లేదు
ABN, First Publish Date - 2023-07-23T00:58:05+05:30
‘చి.ల.సౌ’ చిత్రంలో లక్షణంగా కనిపించిన అమ్మాయి... రుహానీ శర్మ. తొలి చిత్రంతోనే తన అభినయంతో ఆకట్టుకొంది. ‘హిట్’, ‘మీట్ - క్యూట్’లోని పాత్రలు రుహానీ ప్రత్యేకతని చాటి చెప్పాయి. తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమల నుంచి కూడా తనకు అవకాశాలు ..
‘చి.ల.సౌ’ చిత్రంలో లక్షణంగా కనిపించిన అమ్మాయి... రుహానీ శర్మ. తొలి చిత్రంతోనే తన అభినయంతో ఆకట్టుకొంది. ‘హిట్’, ‘మీట్ - క్యూట్’లోని పాత్రలు రుహానీ ప్రత్యేకతని చాటి చెప్పాయి. తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమల నుంచి కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ‘హెర్’లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ‘నవ్య’తో రుహానీ చిట్ చాట్ ఇది!
బయట చాలా సరదాగా కనిపిస్తారు. మరి సీరియ్‌సగా సాగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలంటే ఛాలెంజింగ్‌గా అనిపించలేదా?
సినిమా అంటే అంతేనండీ. స్విచ్చాన్, స్విచ్చాఫ్ అయిపోతుండాలి. మీరన్నట్టు నేను చాలా సరదాగా ఉంటాను. నా చుట్టు పక్కల కూడా అలాంటి వాతావరణాన్నే కోరుకొంటాను. కానీ సెట్‌లోకి వెళ్లాక.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. బయట వేరు.. సినిమాలు వేరు. నా ఫార్ములా సింపుల్. కానీ ‘హెర్’ చూసిన వాళ్లంతా ‘తెరపై కనిపిస్తోంది నువ్వేనా..’ అని ఆశ్చర్యపోతున్నారు. నాకు కావాల్సింది కూడా అదే.
ఈ పాత్ర ఒప్పుకొనేముందు రిఫరెన్స్ కోసం సినిమాలేమైనా చూశారా?
సినిమాలంటూ చూడలేదు కానీ, కొన్ని ప్రత్యేకమైన వీడియోలు చూశాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల గురించి మన దగ్గర చాలా డేటా ఉంది. అవన్నీ పరిశీలించాను. ‘మర్దానీ’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. చాలా కాలం క్రితమే చూశా. ‘హెర్’ చూసినవాళ్లంతా ‘మర్దానీలో రాణీముఖర్జీలా ఉన్నావ్’ అంటున్నారు. ఇది నాకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్.
పోలీస్ ఆఫీసర్లని చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయా?
ఇప్పుడు కాదు కానీ, చిన్నప్పుడు భయపడేదాన్ని. బహుశా.. అందరూ అంతేనేమో? మన సినిమాల్లో కూడా పోలీసుల్ని క్రూరంగా చూపిస్తుంటారు. కానీ బయట అలా ఉండరు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రెండ్లీ పోలీసులే కనిపిస్తున్నారు.
డాక్టర్‌గా, లాయర్‌గా, పోలీస్ ఆఫీసర్లుగా అమ్మాయిల్ని చూస్తుంటే మీకేం అనిపిస్తుంది?
చాలా గర్వంగా ఉంటుంది. ‘వాళ్లని ఇలా కదా మనం చూడాల్సింది’ అనిపిస్తుంది. మా అమ్మ ఇండిపెంటెండ్ ఉమెన్. టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కష్టపడి, చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో నాకు మా అమ్మే కనిపిస్తుంటుంది. వాళ్లందరినీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. తెరపై కూడా కథానాయిక పాత్రల్ని చాలా పద్ధతిగా చూపిస్తున్నారు. అమ్మాయిలు డాక్టర్లుగా, లాయర్లుగా తెరపై కనిపిస్తే చాలామందిలో స్ఫూర్తి రగులుతుంది.
కమర్షియల్ చిత్రాల్లో నటించే అవకాశం మీరు రాలేదు. మీ కెరీర్‌లో ఇదేమైనా లోటుగా అనిపిస్తోందా?
నేనెక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టాను. స్వతహాగా నాకు అలాంటి కథలే ఇష్టం. అదృష్టవశాత్తూ నా దగ్గరకు వచ్చే సినిమాల్లో అవే ఎక్కువగా ఉంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు నాక్కూడా వచ్చాయి. కొన్ని కారణాల వల్ల వాటిలో నటించలేకపోయాను. అలాగని ఆ సినిమాల్ని వదులుకొన్నానన్న బాధేం లేదు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. ఏభాషలో ఎక్కువ కంఫర్ట్ దొరుకుతోంది?
నేను తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశా. నాకు ఇక్కడే ఎక్కువ కంఫర్ట్ దొరుకుతుంది. సెట్లో నటీనటులకు ఇచ్చే గౌరవం మామూలుగా ఉండదు. మలయాళంలో కష్టపడే తత్వం ఎక్కువ. ఉదయం 8 గంటలకు సెట్‌కి వస్తే, సాయింత్రం ఆరింటి వరకూ అలసిపోరు. హిందీ సినిమాల్లో నటిస్తే క్రేజ్ చాలా తొందరగా వచ్చేస్తుంది.
మీకు ఫ్యామిలీతో ఎటాచ్‌మెంట్ ఎక్కువట కదా?
అమ్మాయిల స్వభావమే అంత. వాళ్లకు కుటుంబమే బలం. నాక్కూడా అంతే. నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. సినిమాలు లేకపోతే.. ఇంటి పట్టునే ఉంటా. వాళ్లతో టైమ్ స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకో చెల్లాయి ఉంది. తనకు నటన, సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ నా సినిమాల్ని బాగా విశ్లేషిస్తుంది. సలహాలు ఇస్తుంది. నాకో బుజ్జి కుక్క పిల్ల కూడా ఉంది. నాకు పెట్స్ అంటే మమకారం ఎక్కువ. వాటితో చక్కటి కాలక్షేపం.
‘‘అమితాబ్ బచ్చన్‌తో ఓ కమర్షియల్ యాడ్‌లో నటించాను. ఆ అనుభవాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనో లెజెండరీ పర్సనాలిటీ. సెట్లో ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఎవరూ ఊరకే గొప్పవాళ్లు కాదు. క్రమశిక్షణ, వృత్తిపై అంకితభావం.. ఇవన్నీ వాళ్లని ఆ స్థాయికి చేరుస్తాయి. అమితాబ్ అందుకు పెద్ద ఉదాహరణ’’
‘‘నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కాస్త ఖాళీ దొరికినా ప్రయాణాలు చేస్తుంటాను. నేను చూసిన అందమైన ప్రదేశాలలో ఇటలీ ఒకటి. అక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం వల్ల.. మన జీవిన విధానమే మారిపోతుంది. ప్రశాంతత అలవాటు అవుతుంది. బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ఓ టూర్ వేయండి.. మళ్లీ కావల్సినంత ఉత్సాహం లభిస్తుంది’’
మీరు ఎంచుకొనే పాత్రలన్నీ పద్ధతిగానే ఉంటాయి. బోల్డ్ పాత్రలంటే భయమా?
బోల్డ్‌ని చూసి భయపడే రకాన్ని కాదు. తెరపై ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా నేను సిద్ధమే. కానీ ఆ సన్నివేశం కథకు అవసరమా, కాదా? అనేది చాలా ముఖ్యం. ఏ సినిమాలో నటిస్తున్నాం? మనతో పనిచేసేవాళ్లెవరు? సినిమా స్థాయేంటి? ఈ సినిమాతో ఏం చెప్పాలనుకొంటున్నాం? అనేది చూసుకొంటాను.
అన్వర్
Updated Date - 2023-07-23T00:58:05+05:30 IST