Jammi Tree: జమ్మికాయల్లో నమ్మలేని గుణాలు
ABN, First Publish Date - 2023-03-31T22:47:21+05:30
జమ్మి చెట్టు దసరా రోజున పూజ చేసేప్పుడే మనకు గుర్తుకొస్తుంది. దీన్ని లక్ష్మి, శివ, సీత, మాంగల్య, శంకరి, శివఫల, సుఫలి పార్వతీపత్ర, ఇలా భావించి భక్తిగా పూజిస్తాం.
శమీఫలం కోమల బీజసంయుతం తప్తోదకస్వేదితమేవ కేవలమ్!
ప్రలేహయోగె విధినా విపాచితం సరాజికం దధిసైంధవాన్వితమ్!!
జమ్మి చెట్టు దసరా రోజున పూజ చేసేప్పుడే మనకు గుర్తుకొస్తుంది. దీన్ని లక్ష్మి, శివ, సీత, మాంగల్య, శంకరి, శివఫల, సుఫలి పార్వతీపత్ర, ఇలా భావించి భక్తిగా పూజిస్తాం.
శివ పూజకు దీని ఆకులు, పూలను ఉపయోగిస్తాం. యఙ్ఞ యాగాది క్రతువుల్లో పవిత్ర వృక్షం అని దీని సమిధల్ని ఉపయోగిస్తాం. కానీ ఇది ఆహార యోగ్యమైన మొక్క అనే విషయం ప్రచారంలో లేదు.
అరబ్ దేశీయులు ఇంటింటా జమ్మిచెట్టు నాటమని తమ దేశీయులకు సూచించారు. చిరకాలం జీవించే మొక్కల్లో ఇదొకటి. రాజస్థాన్, గుజరాత్‌ల్లో నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో దీని కాయల్ని పశువుల దాణాల్లో కలుపుతారు.
జమ్మికాయల కూర...
లేత జమ్మికాయలతో కూర తయారీ చేసుకునే విధానం గురించి 500 ఏళ్ల కిందట క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో చెప్పిన విశేషాలు మనకు కొత్తవే. జమ్మికాయల లోపలి గింజల్లో లేతగా, మృదువుగా ఉన్నవాటిని ఎంచుకోండి. సన్నగా ముక్కలుగా తరిగి, వేడి నీళ్లలో వేసి బాగా ఉడికించండి. నీళ్లు వార్చేసి, ఆ ముక్కల్ని జల్లెడలో వేసి, పక్కన ఉంచండి. తడి మొత్తం ఆరిపోతుంది. ఒక బాండీలో నెయ్యి లేదా నూనె వేసి తాలింపు గింజలు వేయించి, అందులో ఈ ముక్కలు కలిపి, కాసేపు మగ్గనివ్వండి. రుచికి తగ్గట్టుగా సైంధవ లవణం, ఇంగువ, అల్లంవెల్లుల్లి వగైరా సుగంధ ద్రవ్యాలను ఇష్టానికి తగ్గట్టుగా కలుపుకుని, వండిన ఇగేరు కూర చాలా కమ్మగా ఉంటుంది.
‘శమీ’తో ఏమేం శమిస్తాయంటే...
‘శమీశమయతే పాపం శమీ శతృ నివారిణీ/ అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శినీ’... ఈ శ్లోకాన్ని ఆహారానికి అన్వయిస్తే దీని గుణాలు బాగా అర్థం అవుతాయి. ‘పాపం’ అంటే కల్తీలతోనూ, ‘శతృ’ అంటే దోషాలతోనూ కూడుకున్న ఆహారంలో జమ్మిని చేర్చితే అది ఆ పాపాల్ని, దోషాల్ని శమింప చేస్తుందని, ఆ నాడు అర్జునుడి ధనువును కాచినట్టు మన శరీరాన్నీ కాపాడుతుందని, రాముడికి అందుకే ప్రియమైనదనీ అన్వయించి చెప్పవచ్చు. జమ్మి కాయలు ఆహార పదార్థాల్లో చేర్చుకోదగినవే! పిండిని తిన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ‘సక్తు ఫలం’ అంటారు వీటిని. జమ్మి పండ్లను ఎండించి ఎండు ద్రాక్షలాగా వాడుకుంటారు. ప్రొటీన్లు, క్యాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ దండిగా ఉన్న ఫలం ఇది. శరీరంలో దోషాల్ని ఊడ్చి పారేసే శక్తి వీటికుంది.
జమ్మికాయల పెరుగు పచ్చడి...
కూర తయారైన తరువాత అందులో పెరుగు కలిపి ఎక్కువసేపు మరగనివ్వకుండా, వేడెక్కగానే దింపెయ్యండి. పెరుగును వేడి చేస్తే, అందులో ఉండే ఉపయోగకర బ్యాక్టీరియా చనిపోతుంది. ఇది జమ్మికాయల పెరుగు పచ్చడి. చల్లారిన తరువాత కొద్దిగా ఆవపిండి కలిపితే అమోఘంగా ఉంటుంది. కొత్తిమీర కత్తిరించి కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఈ పెరుగు పచ్చడి అన్ని వ్యాధుల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువ. అమీబియాసిస్ వ్యాధికి ఇది గొప్ప ఔషధం.
స్త్రీల వ్యాధుల్లో పని చేస్తుంది...
దీని పండుని మెత్తగా నూరి, ఆడవాళ్లు ముఖం మీద అనవసరంగా వెంట్రుకలుపెరిగే చోట రాస్తే, అవి రాలిపోతాయని ‘భావప్రకాశ’ పేర్కొంది. నెలసరి సమస్యలు, అధిక రక్తస్రావం దీనివల్ల తగ్గుతాయి. స్త్రీల సమస్యలకు ఇది మంచి ఔషధం. దీని చెక్కని నూరి తేలు కుట్టిన చోట రాస్తే నొప్పి, వాపు తగ్గుతాయి. విష దోషం తగ్గుతుంది. మూత్రంలో నుంచి రక్తం పడటం, మొలలు, పళ్లలోంచి రక్తం కారటం ఆగుతాయి. బాక్టీరియాలను సంహరించేగు ణం ఉన్న మొక్కల్లో ఇదొకటి. గర్భస్రావం కాకుండా కాపాడుతుంది కూడా! హాబిచ్యువల్ అబార్షన్ అనే వ్యాధిలో దీన్ని ప్రయత్నించవచ్చు.
దీని చెక్కని దంచి, ఒక చెంచా పొడిని చిక్కని టీలాగా కాచి, దాంతో బాగా పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది. పావు గ్లాసు చిక్కని కషాయంలో నీళ్లు కలిపి భోజనానికి ముందు ఓ నెలపాటు రోజూ తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నీళ్ల, రక్త విరేచనాలు ఆగుతాయి. అతిగా విరేచనాలు అవటం, విరేచనం అసలు అవకుండా బంధించటం... ఇవి రెండూ దీనివల్ల తగ్గుతాయి. చర్మ వ్యాధుల్లో బాగా పని చేస్తుంది.
శమీఫలం లఘువుగా తేలికగా అరిగేలా ఉంటుంది. స్వాదుగా, రుచిగా ఉంటుంది. కుష్ట, అర్శ, కఫహత్సరమ్... అంటే చర్మవ్యాధులు, మొలలను తగ్గించి కఫాన్ని పోగొడుతుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. సురుచ్యం... అంటే అరుచిని పోగొట్టి అన్నహితవు కలిగిస్తుంది. పిత్తలం... అంటే పిత్తధాతువు పెరిగేలా చేస్తుంది. లివర్ని బలసంపన్నం చేస్తుంది. రూక్షం... అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి నెయ్యి వేసి వండుకుంటే మృదువుగా పని చేస్తుంది. మేథ్యం... అంటే మేథాశక్తిని, ఙ్ఞాపకశక్తిని పెంపు చేస్తుంది. అల్జీమర్స్ లాంటి వ్యాధులున్న వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ‘కేశ వినాశనమ్’ అనేది దీని ముఖ్య లక్షణం. పండిన కాయ గుజ్జుని పట్టించిన చోట వెంట్రుక కుదుళ్లను బలహీనపరుస్తుంది. అనవసరంగా తమ శరీరంలో పెరిగే రోమాలను తొలగించుకోవటానికి ఇది స్త్రీల కోసం చెప్పిన భలే మందు.
గంగరాజు అరుణాదేవి
Updated Date - 2023-03-31T22:47:21+05:30 IST