Telugu actress Bhavana : సర్దుకుపోతూ సాగిపోతున్నాం
ABN, First Publish Date - 2023-02-15T00:27:39+05:30
‘ఒకే ఒక్క చాన్స్’ కోసం సినీ కలలు కనేవారెందరో. కానీ ఈమె... సరిగ్గా ఊహ తెలియక ముందే నటించేశారు. ‘యాక్షన్... కట్’ల మధ్య మప్ఫై సంవత్సరాల రీలు జీవితం.
‘ఒకే ఒక్క చాన్స్’ కోసం సినీ కలలు కనేవారెందరో. కానీ ఈమె... సరిగ్గా ఊహ తెలియక ముందే నటించేశారు. ‘యాక్షన్... కట్’ల మధ్య
మప్ఫై సంవత్సరాల రీలు జీవితం.
అందం... చక్కని అభినయం... అచ్చ తెలుగు నటి భావన ‘రియల్ లైఫ్’ కథ ‘నవ్య’కు ప్రత్యేకం...
‘‘నాకు నాలుగేళ్లప్పుడు... ఒక చిన్న సన్నివేశంతో మొదలైంది నా సినిమా జీవితం. ఊహ తెలియకముందే నన్ను తీసుకువెళ్లి పరిశ్రమలో పడేశారు మా నాన్న. ఇక అక్కడి నుంచి మేకప్ వేయని రోజు అరుదు. పరిశ్రమలోనే పెరిగాను. ప్రముఖ హీరోలతో కలిసి నటించాను. అందులోనే అన్నీ నేర్చుకున్నాను. వినోద పరిశ్రమతో నాది విడదీయరాని బంధం. ఎక్కడో అనకాపల్లిలో పుట్టిన నేను... ఆ తరువాత చెన్నై వెళ్లడం... సినిమాలతో బిజీ అవ్వడం... నటిగా ఇన్నేళ్లు నిలబడడం... ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే ఇంత దూరం ప్రయాణించింది నేనేనా అనిపిస్తుంది.
అవకాశం అలా...
మా నాన్న వెంకటేశ్వర్లు రైల్వేలో చేసేవారు. అమ్మ సుజాత క్యారెక్టర్ ఆర్టి్‌స్టగా చేసింది. నాన్న స్నేహితుడు చంద్రమౌళి అని ఉండేవారు. ఆయన పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఒకరోజు మా ఇంటికి వచ్చి ‘చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి. ఎవరైనా ఉన్నారా’ అని నాన్నను అడిగారు... ఒక చిన్న సన్నివేశం కోసం. నాన్న నన్ను తీసుకువెళ్లి చూపించారు. ఓకే అన్నారు. ‘కుట్ర’ అనే సినిమా అది. అర్జున్ హీరో. పాపను మంటల్లో అటు నుంచి ఇటు విసిరేసే సన్నివేశం. ఇప్పటికీ అది గుర్తుంది. అక్కడి నుంచి బాల నటిగా వరుస అవకాశాలు వచ్చాయి. బాలకృష్ణ గారి ‘భారతంలో బాలచంద్రుడు’, చిరంజీవి గారి ‘మగధీరుడు’లో చిన్న రోల్స్ చేశాను. తరువాత ‘స్వయంకృషి’లో చిన్నప్పటి సుమలతగా నటించాను. నేను, నాటి హీరోయిన్ రాశీ, మరికొంతమంది బాలనటులుగా ఒకే సమయంలో చేస్తూ వచ్చాం.
ఆయన చాక్లెట్ ఇచ్చారు...
ఊహ తెలిసేసరికే పరిశ్రమలో ఉండడంవల్ల... ఆ తరువాత నా చదువు, కెరీర్ లాంటివి ఆలోచించే అవకాశమే లేకుండాపోయింది. నాలుగో తరగతితోనే చదువుకు బ్రేక్ పడింది. అయితే మా మావయ్య ప్రైవేటుగా చదివించారు. ఇండస్ర్టీలోకి ఎలా వచ్చినా... వంద శాతం శ్రమించడం చిన్నప్పటి నుంచే నాకు అలవడిన లక్షణం. ‘భారతంలో బాలచంద్రుడు’లో పై నుంచి దూకే సీన్ ఉంటుంది. నా బదులు బొమ్మను కిందకి పడేద్దామనుకున్నారు. ‘కాదు... నేనే చేస్తా అంకుల్’ అని పై నుంచి దూకాను. అప్పుడు బాలకృష్ణ గారు ఒళ్లో కూర్చోబెట్టుకుని అభినందిస్తూ చాక్లెట్ ఇచ్చారు.
కమల్ పాఠం...
‘మహానది’లో చిన్న పాత్ర. హీరో కమల్‌హాసన్ గారు. అందులో ఒక సన్నివేశం. నేను లోపలి నుంచి బయటకు రావాలి. కానీ యాక్షన్ అనగానే రాలేకపోయాను. ‘ఎందుకు రాలేదు’ అని కమల్ అడిగారు. ‘అంకుల్... నాకు అంతా అడ్డంగా ఉన్నారు. అందుకే రాలేకపోయా’ అంటే ఆయన కోపంతో ఊగిపోయారు. తరువాత ఆయనే పిలిచి... ‘పరిశ్రమకు రావడం మన అదృష్టం. కెమెరా ముందు ఉన్నంతసేపూ కష్టపడుతూనే ఉండాలి. కళామతల్లి ముద్దుబిడ్డలం అనిపించుకోవాలి’ అన్నారు. ఆ మాటలు నేటికీ నాకు పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇండస్ర్టీకి రావాలన్న కోరిక నాకు ఏనాడూ లేదు. అయితే ఉన్న పనిని నిబద్ధతతో చేయాలనే సంకల్పం నాకు ఎప్పుడూ ఉంటుంది. అంత పెద్ద స్టార్‌లను చూసి, వారిలా కష్టపడాలనే తాపత్రయం నాది.
సీరియల్‌తో షురూ...
బాలనటిగా పాతిక పైనే చిత్రాలు చేసుంటాను. కాస్త ఎదిగాక, అంటే పదిహేనేళ్లప్పుడు ‘సంధ్య’ అనే సీరియల్‌తో నా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అందులో అల్లు రామలింగయ్య గారి మనవరాలిగా నటించాను. అదే నా తొలి సీరియల్. ఆ సమయంలోనే తమిళ్‌లో హీరోలు విజయ్, అర్జున్ చిత్రాల్లో చెల్లెలి పాత్రలు వేశాను. అలీతో చేసిన ‘అమ్మాయి బాగుంది’కి మంచి పేరు వచ్చింది. నేనూ, మీరా జాస్మిన్ ఉంటాం అందులో. రాజేంద్ర ప్రసాద్ గారితో బాల నటిగా ‘చిక్కడు దొరకడు’లో... పెద్దయ్యాక ‘అందగాడు’లో నటించా. అలాగే శ్రీకాంత్‌తోనూ చిన్నప్పుడు ‘రాజేశ్వరీ కల్యాణం’, తరువాత ‘కన్యాదానం, సుప్రభాతం’లలో చేశాను. లెక్క పెడితే తెలుగు, తమిళం కలిపి ఇప్పటికి నా సినిమాలు యాభై దాటుంటాయి. సీరియల్స్ కలిపితే రెండు వందల వరకు ఉంటాయి.
మూడు ‘నందులు’...
ఎన్ని చేసినా నాకంటూ మంచి నటిగా గుర్తింపు వచ్చింది మాత్రం ‘అందం’ సీరియల్‌తో. ఇప్పటికీ అమెరికా వెళితే నన్ను ‘రమ్య’ అని పిలిచేవాళ్లున్నారు. అందులో నా పాత్ర పేరు అది. ‘సుఖదుఃఖాలు’ సీరియల్‌లో నాకు ఉత్తమ నటిగా ‘నంది అవార్డు’ దక్కింది. తరువాత మావారు దర్శకత్వం వహించిన ‘కాంచనగంగ’ సీరియల్‌లో నాకు ఉత్తమ నటిగా, ఆయనకు ఉత్తమ దర్శకుడిగా ‘నందులు’ వచ్చాయి. ‘అతిథి’ టెలిఫిలిమ్‌కు మరో ‘నంది’ అందుకున్నా. ఇవన్నీ చూసుకున్నప్పుడు సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉంటుంది.
ప్రస్తుతం ‘జీ-తెలుగు’లో ప్రసారమవుతున్న ‘శుభస్య శీఘ్రం’ సీరియల్ చేస్తున్నా. ఇందులో నాది నెగెటివ్ రోల్. భర్త, పిల్లల మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తుంటాను. నిజానికి నేను అసలు కుటుంబాన్నే పట్టించుకోను. దీంతోపాటు మరో సీరియల్ చేస్తున్నా.
కుటుంబమే నా బలం...
నాకు పెళ్లయిన తరువాత కూడా చేయగలుగుతున్నానంటే అందుకు మావారు విజయ్‌కృష్ణ సహకారమే కారణం. ఆయన దర్శకుడు. ఆ మధ్య వచ్చిన ‘గృహలక్ష్మి, కథలో రాజకుమారి, దేవయాని, గీతాంజలి...’ ఇవన్నీ ఆయన తీసినవే. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి గాయత్రి 9వ తరగతి చదువుతోంది. చిన్నమ్మాయి సరయు రెండో తరగతిలో ఉంది.
ఇల్లు, పిల్లలు, షూటింగ్‌లు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే. కానీ కుటుంబమే నా బలం. వాళ్లు నన్ను అర్థం చేసుకొంటారు. ఇదివరకైతే కనీసం నెల ముందే షూటింగ్ డేట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు రేపు షూటింగ్ ఉందా లేదన్నది రాత్రి వరకు తెలియని సందర్భాలున్నాయి. అడిగితే దానికి వంద కారణాలు చెబుతారు. కరక్షన్స్ ఉన్నాయంటారు. రీషూట్ అంటారు. దానివల్ల మన వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది. ఎటన్నా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా వెళ్లలేని పరిస్థితి. పిల్లలకు నచ్చజెప్పుకొంటూ, మా ఇష్టాయిష్టాలను వాయిదా వేస్తూ ,సర్దుకుపోతూ సాగిపోతున్నాం.’’
నేను శాస్త్రీయ నృత్యాలేవీ నేర్చుకోలేదు. కానీ మంచి డ్యాన్సర్‌ని. డ్యాన్స్ అంటే ప్రాణం. ఈవెంట్స్, షోస్‌లో చేస్తుంటాను. అయితే ఇప్పటికీ ప్రతి షో నా మొదటి షోలానే అనిపిస్తుంది. ప్రతిసారీ ప్రజంటేషన్ బాగుండాలనే తపన ఉంటుంది.
హనుమా
Updated Date - 2023-02-15T00:27:41+05:30 IST