Yoga Food: యోగాఫుడ్
ABN, First Publish Date - 2023-01-07T23:53:00+05:30
వ్యాయామానికి ముందు ఆహారం తీసుకున్నట్టే యోగా సాధనకు ముందు కూడా ఆహారం తీసుకోవచ్చు.

గుడ్ ఫుడ్
వ్యాయామానికి ముందు ఆహారం తీసుకున్నట్టే యోగా సాధనకు ముందు కూడా ఆహారం తీసుకోవచ్చు. ఆ పదార్థాలు ఏవంటే...
అవకాడొ:
పొటాషియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ లవణాలు అవకాడొలో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాకుండా అవకాడొ తేలికగా జీర్ణమవడంతో పాటు ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. దీన్లోని ఆరోగ్యవంతమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి యోగ సాధనకు తగినట్టు శరీరం సహకరించడం కోసం అవకాడొ తినాలి.
అరటిపండు:
దీన్లోని పొటాషియం నిల్వలను బట్టి ఎలాంటి వర్కవుట్‌కు ముందైనా తినదగిన పండుగా అరటిపండుకు పేరుంది. కడుపు ఉబ్బరం, కండరాల నొప్పులను అరటిపండు అరికడుతుంది. కాబట్టి యోగాకు ముందు అరటిపండును నేరుగా లేదా స్మూదీ రూపంలో తీసుకోవచ్చు.
యాపిల్:
ఇవి క్షార గుణం కలిగిన పండ్లు. కడుపులో ఆమ్లత్వం ఏర్పడకుండా చేస్తాయి. సహజసిద్ధ చక్కెరలు, పీచు వీటిలో ఎక్కువ. విటమిన్ సి, నీరు కూడా వీటిలో ఎక్కువే కాబట్టి యోగా సాధనలో దాహార్తిని అరికట్టగలుగుతాయి. విటమిన్ సి శరీరానికి చురుకుదనాన్ని అందించి, సాధనకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
బాదం:
యోగాకు ముందు నాలుగు బాదం పప్పులు తింటే, శరీరానికి తక్షణ శక్తి సమకూరుతుంది. నీళ్లలో నానబెట్టినవి మినహా ఉప్పు జోడించినవి తినకూడదు. ఆర్గానిక్ బాదం పప్పుల్లో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యవంతమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
Updated Date - 2023-01-07T23:53:01+05:30 IST