NATS: ఆకస్మిక గుండెపోట్లపై నాట్స్ అవగాహన సదస్సు
ABN, First Publish Date - 2023-03-27T21:09:58+05:30
ఆకస్మిక గుండెపోటుతో యువకుల సైతం చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్(NATS) అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది.
ఆకస్మిక గుండెపోటుతో యువకుల సైతం చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్(NATS) అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ గుడిపాటి చలపతిరావు ఈ సదస్సులో ప్రధానంగా అసలు ఆకస్మిక గుండెపోట్లు ఎందుకు వస్తాయనే దానిపై అవగాహన కల్పించారు. జీవన శైలిలో మార్పులు గుండెపోట్లకు ప్రధాన కారణమని తెలిపారు. మనం తినే ఆహారం సరిగా లేకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.. వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల గుండెపోట్లు పెరుగుతున్నాయని.. ముఖ్యంగా భారత్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉందని గుడిపాటి చలపతిరావు అంకెలతో సహా వివరించారు.
జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే ఆకస్మిక గుండెపోట్ల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. పైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ప్రముఖ డాక్టర్ మధు కొర్రపాటి తెలిపారు. పెరుగన్నం, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. తెల్ల అన్నానికి బదులుగా మిలెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్లాంటివి వాడొచ్చని తెలిపారు. కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండాలని.. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని మధు కొర్రపాటి సూచించారు. గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కన ఉండేవాళ్లు ఎలా స్పందించాలి అనేది డాక్టర్ మాధురి అడబాల వివరించారు. సీపీఆర్ ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించారు.
Updated Date - 2023-03-27T21:09:58+05:30 IST