USA: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18 వేల ఆవులు సజీవ దహనం
ABN, First Publish Date - 2023-04-14T12:32:20+05:30
అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ టెక్సాస్‌లో ఓ డెయిరీ ఫాంలో భారీ పేలుడు సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి.
ఎన్నారై డెస్క్: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ టెక్సాస్‌లో(Texas) ఓ డెయిరీ ఫాంలో భారీ పేలుడు(Explosion in dairy farm) సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి. సోమవారం డిమిట్‌లోని సౌత్ ఫోర్క్ ఫాంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి డెయిరీ ఫాంపై గంట పాటు దట్టమైన పొగ కమ్ముకున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డెయిరీ ఫాం కార్మికుడు ఒకరు గాయపడగా అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
డెయిరీ ఫాంలో ఈ ప్రమాదం ఎలా సంభవించిందో స్పష్టత లేదు. అయితే.. పరికరం పనిచేయకపోవడం వల్లే ఇది జరిగిఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవుల నుంచి పాలు పితికే సమయంలో ఈ ఘటన సంభవించింది. పెను నష్టా్న్ని కలుగజేసింది. అగ్ని ప్రమాదంలో 18 వేల ఆవులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. డెయిరీ ఫాంలోని మొత్తం ఆవుల్లో 90 శాతం మరణించాయని చెబుతున్నారు. ఆమెరికాలో ప్రతి రోజూ కబేళాల్లో వధిస్తున్న ఆవుల సంఖ్య కంటే ఇది 3 రెట్లు అధికమని తెలుస్తోంది.
ప్రస్తుతం డెయిరీ ఫాంలో జంతువుల భద్రతకు సంబంధించి ఫెడరల్ (కేంద్ర) స్థాయిలో ఎటువంటి నిబంధనలు లేవు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమంతట తాముగా కొన్ని నిబంధనలు రూపొందించుకున్నాయి. అయితే..టెక్సాస్‌లో ఇలాంటి రూల్స్ ఏవీ అమల్లో లేవని తెలుస్తోంది. ఇంతటి భారీ ప్రమాదం జరగడం 2013 తరువాత ఇదే తొలిసారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మీడియా సంస్థల ప్రకారం.. గత పదేళ్లలో సుమారు 6.5 మిలియన్ల పశువులు అగ్నిప్రమాదాలకు బలయ్యాయి.
Updated Date - 2023-04-14T12:32:20+05:30 IST