NRI: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
ABN, First Publish Date - 2023-08-22T20:18:30+05:30
జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది.
ఎన్నారై డెస్క్: జీడబ్ల్యూటీసీఎస్(GWTCS) స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా వందనం చేసి జాతీయగీతాన్ని ఆలపించారు.
కృష్ణ లాం మాట్లాడుతూ.. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘డీడబ్ల్యూటీసీఎస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. 50 ఏళ్ల క్రితం స్థాపించబడిన తొలి తెలుగు సంస్థ. తెలుగువారికి వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను, వివిధ క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నాము’’ అని అన్నారు. సంస్థ స్వర్ణోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం కావాలన్నారు. మహనీయుల త్యాగఫలం భారత దేశం స్వాతంత్య్రం అని, అన్ని రంగాలలో దేశం పురోభివృద్ధి చెందాలన్నారు.
తానా పూర్వాధ్యక్షులు సతీష వేమన మాట్లాడుతూ.. ‘‘జీడబ్ల్యూటీసీఎస్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జీడబ్ల్యూటీసీస్ స్వర్ణోత్సవాలు తెలుగువారు నిర్వహించుకునే వేడుక. ఈ స్వర్ణోత్సవాలను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలి’’ అని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ రకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. క్రీడల్లో ప్రవాసాంధ్రులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులకు, మహిళలకు పలు ఆటల పోటీలు, ఫ్లాష్ మోబ్ లాంటి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం అసలు సిసలు తెలుగు వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్ కార్యవర్గ సభ్యులు, తానా కార్యవర్గ సభ్యులు, ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సుమారు 1500లకు పైగా ఈ వేడుకకు తరలివచ్చారు.
Updated Date - 2023-08-22T20:18:33+05:30 IST