NRI: మేటి వలసదారుడిగా ఎంపికైన ఎన్నారై అజయ్ బంగా
ABN, First Publish Date - 2023-06-29T22:15:45+05:30
ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ఈ సంవత్సరం మేటి వలసదారుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని కార్నెగీ కార్పొరేషన్ సంస్థ ప్రచురించిన మేటి వలసదారుల జాబితా-2023లో ఆయన చోటు దక్కించుకున్నారు.
ఎన్నారై డెస్క్: ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా(Ajay Banga) ఈ సంవత్సరం మేటి వలసదారుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని కార్నెగీ కార్పొరేషన్ సంస్థ(Carnegie Corportation) ప్రచురించిన మేటి వలసదారుల జాబితా-2023లో ఆయన చోటు దక్కించుకున్నారు. అమెరికాను సుసంపన్నం చేసి, ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతం చేసిన విదేశీ మూలాలున్న వారితో ఏటా కార్నెగీ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఈ సంవత్సరం జాబితాలో చొటుదక్కించుకున్న ఒకేఒక భారతీయుడు బంగా కావడం మరో విశేషం.
ఈ ఏడాది జూన్‌లో బంగా ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ అయిన విషయం తెలసిందే. ఈ సంస్థ పగ్గాలు చేపట్టిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆర్థికరంగంలో 30 ఏళ్ల విశేష అనుభవం కలిగిన బంగా ప్రపంచబ్యాంకు విధానాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, ప్రపంచ ప్రజలకు సమానావకాశాల కోసం ఆయన కృషి చేస్తున్నారని కార్నెగీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
అజయ్ బంగా తన కెరీర్‌ను భారత్‌లోనే ప్రారంభించారు. 13 ఏళ్ల పాటు నెస్లే ఇండియా, రెండేళ్ల పాటు పెప్సీకో సంస్థల్లో పనిచేశారు. 1996లో సిటీ గ్రూప్‌లో చేరిన ఆయన ఆ తరువాత ఆసియా-పెసిఫిక్ ప్రాంత కార్యకలాపాలు చూసే సీఈఓ స్థాయికి ఎదిగారు. అనంతరం అమెరికాకు వెళ్లిన ఆయన అక్కడ 12 ఏళ్ల పాటు మాస్టర్ కార్డు ప్రెసిడెంట్, సీఈఓగా పనిచేశారు. జెనరల్ అట్లాంటిక్ సంస్థకు కొన్నాళ్ల పాటు వైస్ చైర్మన్‌గా చేసిన అనంతరం ప్రపంచబ్యాంకు పగ్గాలు చేపట్టారు.
Updated Date - 2023-06-30T22:49:18+05:30 IST