OHRK Subbaraju : ప్రతి క్షణం ఆస్వాదించడమే ముఖ్యం
ABN, First Publish Date - 2023-02-12T23:51:02+05:30
ఇటీవల వచ్చిన ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్‌లో సుబ్బరాజు మేనరిజమ్ ఇది. అయితేనేం అదరగొట్టేశారు. సుబ్బరాజు హీరో కాదు. అయినప్పటికీ తను సినిమాలో ఉంటే చాలు...
‘దాసూ... టీ చెప్పు...’
ఇటీవల వచ్చిన ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్‌లో సుబ్బరాజు మేనరిజమ్ ఇది. అయితేనేం అదరగొట్టేశారు. సుబ్బరాజు హీరో కాదు.
అయినప్పటికీ తను సినిమాలో ఉంటే చాలు... అలరిస్తాడన్న నమ్మకం సగటు ప్రేక్షకుడిది. ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఇంతకీ సుబ్బరాజు ఏమన్నారు? ఆయన మనసులోని మాట ఏమిటి?
ఆర్కే: నమస్తే సుబ్బరాజు గారు. ఎలా ఉన్నారు?
సుబ్బరాజు: అద్భుతంగా ఉన్నా.
ఆర్కే: సో... ట్వంటీ ఇయర్స్ ఇండస్ర్టీ. ఈ జర్నీ సంతృప్తిగా ఉందా?
సుబ్బరాజు: సంతృప్తి అనేదానికి కొలమానం ఏమీ పెట్టుకోలేదు. ఫిట్‌గా ఉండడం, లుక్ బాగుండేలా చూసుకోవడం... ఇవి మన చేతుల్లో ఉండేవి. ఆ తరువాత మనకు వచ్చేవి వస్తాయనుకొంటాను.
ఆర్కే: ఏం చదువుకున్నారు?
సుబ్బరాజు: మా భీమవరం డీఎన్‌ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న రోజులవి. అప్పుడే కొత్తగా కంప్యూటర్స్, కోర్సులు వచ్చాయి. మా నాన్న టైప్‌రైటింగ్ నేర్పించారు. లోయర్, హయ్యర్ పాసయ్యా. అది తరువాత కంప్యూటర్స్‌కు ఉపయోగపడింది. మా అంకుల్ ఒకాయన సీ-ప్రోగ్రామింగ్ అదీ నేర్పించారు. బయటకు రాగానే మళ్లీ హార్డ్‌వేర్ అన్నారు. హైదరాబాద్ ‘ఇక్‌ఫై’లో మేనేజ్‌మెంట్ కోర్స్ చదివా. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాను. మా నాన్నకు పిల్లలు ఎప్పుడూ తనకు దగ్గరలో ఉండాలనుకొనేవారు.
ఆర్కే: మిగిలిన విషయాలు పక్కనపెడితే... తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ కోర్సులు, ఎడ్యుకేషన్ మీద అభిరుచి ఏర్పడడానికి కారణం ‘సత్యం’ రామలింగరాజు గారు కదా!
సుబ్బరాజు: అవును. మా చుట్టుపక్కల ఊళ్లలోని చాలామందికి ‘సత్యం’లో ఉద్యోగాలు వచ్చాయి. నేను కూడా విశాపట్నం నుంచి హైదరాబాద్‌లో డెల్ ట్రైనింగ్‌కు వచ్చాను. అప్పుడు దర్శకుడు కృష్ణవంశీ గారు పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసుకొంటూ ఇక్కడి వరకు వచ్చాను. అయితే కేఎల్‌ఎన్ రాజు గారు పిలిచి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో చిన్న వేషం ఇప్పిస్తానన్నారు. వెళ్లి పూరి జగన్నాథ్‌ను కలిస్తే ఆయన మెయిన్ విలన్‌గా ఇచ్చారు. ఇక అక్కడి నుంచి నా లైన్ మార్చుకున్నా. కానీ నాకు ఈ పని లేకపోతే ఇంకో పని రాదన్న భయం లేదు. ప్రయత్నిద్దాం... సక్సెస్ కాకపోతే మళ్లీ ఉద్యోగం చేద్దామనుకున్నాను.
ఆర్కే: కృష్ణవంశీ అవకాశం ఇవ్వడం వల్ల ఆసక్తి పెరిగిందా?
సుబ్బరాజు: ఉద్యోగం కన్నా పరిశ్రమలో పనితీరు నాకు బాగా నచ్చింది. మనల్ని మనం మెరుగుదిద్దుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఎదుగుదల అనేది ఒకేచోట ఆగిపోదు. విభిన్నంగా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి క్షణం ఒక కొత్తదనం ఉంటుంది. తక్కువ సమయంలో ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది. మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌లోకి వెళతాం. వీటన్నిటితో పాటు సినిమాల్లో సంపాదన కూడా ఎక్కువ. పాపులారిటీ ఎక్కువ. ఇరవై ఇరవై రెండేళ్ల అబ్బాయికి ఇవన్నీ ఆకర్షించే అంశాలే కదా!
ఆర్కే: మరి కృష్ణానగర్ కష్టాలేవైనా పడ్డారా?
సుబ్బరాజు: అలాంటివేవీ లేవు. డిగ్రీ అవ్వగానే ఉద్యోగంలోకి వెళ్లిపోయా. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోకి వచ్చా. అయితే ఆరంభంలో ఎక్కువ సినిమాలు రాలేదు. పదివేలు... పదకొండు వేలు ఇచ్చేవారు. అప్పుడు కొంత డబ్బు సరిపోక కొంత ఇబ్బంది ఉండేది. కానీ ఖర్చులు పెంచుకోలేదు. నల్లకుంటలో నలుగురైదుగురితో కలిసి ఉండేవాడిని. నా వాటా కింద అన్నీ కలిపి ఐదారు వందలు కూడా అయ్యేది కాదు. ‘ఆర్య’ సినిమా సమయానికి నేను ఒక అపార్ట్‌మెంట్ తీసుకున్నా. ఆ సినిమాలోనే నాకు ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చింది. దిల్ రాజు గారు రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నారు అప్పుడు. అందులో నాకు చెప్పింది ఐదారు రోజుల వేషం. గూండా పాత్ర. పెద్దగా ఏముంటుందిలే అనుకున్నా. సినిమా అయిపోయాక చూస్తే... అందులో నా పాత్రకు మంచి అభినందనలు వచ్చాయి.
ఆర్కే: మీరు ఒడ్డూ పొడుగూ... చూడ్డానికి బాగుంటారు కదా! గూండా పాత్రలు ఎలా వచ్చాయి?
సుబ్బరాజు: అప్పట్లో కాస్త లావుగా ఉండేవాడిని (నవ్వు). అయితే ‘యోగి’ చిత్రంలో ఓ చేజింగ్ సీన్ చేస్తున్నా. రన్నింగ్‌లో ఎక్కుతుంటే కాలు రోడ్డుకు గట్టిగా తగిలింది. అప్పటి నుంచి ఫిట్‌నెస్ మొదలుపెట్టి పది కేజీలు తగ్గాను. ‘లీడర్’ చిత్రం సమయానికి ఫిట్‌గా తయారయ్యా. విలన్‌గా నాకు ‘లీడర్’ చివరి చిత్రం.
ఆర్కే: సన్నిహితులు అంటుంటారు కదా... ‘హీరో కావాల్సినవాడివిరా’ అని!
సుబ్బరాజు: అంటుంటారు. వచ్చి ఏవో కథలు చెబుతుంటారు. ఒకవేళ హీరోగా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాని బాధ్యత అంతా నా మీదే ఉంటుంది. వేరొకళ్ల డబ్బుతో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే నాకు భయం.
ఆర్కే: మీరు గోదావరి జిల్లాలో పుట్టి పెరిగారు. అక్కడివారు సహజంగానే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు కదా! అంటే ఒకరకమైన గ్యాంబ్లింగ్ సైకాలజీ.
సుబ్బరాజు: నిజమే. భీమవరం రాజులనగానే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. రొయ్యలు, పీతలు బాగా తింటారని, కోడిపందాలు, పేకాటలు ఆడతారని! అయితే మా నాన్న డీఎన్‌ఆర్ కాలేజీలో లెక్చరర్. మా పెదనాన్న అదే కాలేజీలో ప్రొఫెసర్. ఎస్వీ కృష్ణారెడ్డి గారికి, బ్రహ్మానందం గారికి గురువు మా పెదనాన్న. సునిల్, త్రివిక్రమ్... వీళ్లందరూ మా నాన్న విద్యార్థులు. మేము ఆ కాలేజీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. చుట్టూ అందరూ మాస్టర్లు, మాస్టర్ల పిల్లలు. ఎలావుండేదంటే... సైకిల్ స్పీడ్‌గా తొక్కుకొంటూ వెళితే సాయంత్రం మా నాన్న వచ్చి ‘ఏరా... సైకిల్ స్పీడ్‌గా తొక్కావట’ అనేవారు. అంటే మేం ఏంచేసినా కొన్ని వేల కళ్ల మధ్యలో చేయాలి.
ఆర్కే: మీకు త్రివిక్రమ్, సుకుమార్‌లాంటి టాప్ డైరెక్టర్లందరూ తెలిసినవాళ్లే కదా! మంచి పాత్ర ఇవ్వమని అడగరా?
సుబ్బరాజు: ఇప్పటిదాకా ఎవర్నీ వేషం ఇవ్వమని అడగలేదు. అది నా నైజం కాదు. ఏది వస్తే అది చేసుకొంటూ పోతానంతే. బహుశా మా పెద్దల పెంపకంలో భాగంగా ఆ లక్షణం వచ్చిందేమో!
ఆర్కే: చిన్న చిన్న వేషాలు వేస్తున్నప్పుడు మీ ఇంట్లోవాళ్లు ఏమనలేదా?
సుబ్బరాజు: ఏమీ అనలేదు. దాన్ని ఒక పనిగా చూశారంతే. ‘ఆర్య’లాంటి సినిమాలొస్తున్న సమయంలో పూరి గారిని అడిగా... ‘అన్నయ్య... ఇక చిన్న చిన్న వేషాలు మానేసి పెద్దవి వస్తేనే చేస్తానంటే ఎలా ఉంటుంది’ అని! ‘నువ్వు అలాంటివేమీ పెట్టుకోకు అన్నయ్య. ఏదొస్తే అది చేసెయ్యి. ఏదో ఒక పాత్ర చేయడం వల్ల నీ కెరీర్ పడిపోవడం... ఏదో ఒకటి చేసినంతమాత్రాన తెగ పెరిగిపోవడంలాంటివి ఇక్కడ ఉండవు. పొద్దున లేచిన తరువాత ఎంతసేపు కెమెరా ముందు ఉండగలుగుతావో అంతసేపు చేసెయ్యి. ఇది పెరిగే సమయం’ అన్నారు ఆయన. అలా ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ నుంచి ‘లీడర్’ వరకు వంద సినిమాలు చేశా. తమిళ్, కన్నడ, మళయాళంలో కూడా నటించాను. ‘యోగి’ సమయంలో కాలు దెబ్బ తగిలిన తరువాత నుంచి ఎక్కువ స్టంట్ ఉన్న సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నా.
ఆర్కే: ఇవాల్టి టాప్ డైరెక్టర్లు కూడా మాకు రెమ్యునరేషన్ సరిగ్గా వచ్చేది కాదని చెబుతుంటారు!
సుబ్బరాజు: అవును. సరిగ్గా వచ్చేది కాదు నాకు కూడా. నా దగ్గర బౌన్స్ అయిన చెక్కులు చాలా ఉండేవి. రిలీజ్‌కు వారం పది రోజుల ముందు ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు. ‘బాబూ చేయలేకపోతున్నాం. మమ్మల్ని బయటపడేయండి’ అని అంటుంటారు. కాదనలేక చేస్తుంటాం. అలా ఆగిపోయినవి కొన్నుంటాయి. తెలుగు పరిశ్రమలో ఉన్న అందమేమిటంటే... ఎక్కడా ఒక సంతకం లేకుండా మాట మీదే నడిచిపోతోంది. ఇది తప్పా ఒప్పా అని చెప్పను. ఐదారేళ్లు చేసిన బాహుబలికే అగ్రిమెంట్ లేదు. నేనే కాదు... చాలామంది ఇలానే చేస్తారు. మాటమీదే వెళ్లిపోతాం.
ఆర్కే: ఎన్ని చేసినా ఏ నటుడికైనా చెప్పుకోవడానికంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. మీకు అలాంటి గుర్తుండిపోయే పాత్ర ఏంటి?
సుబ్బరాజు: అనుభవంపరంగా చెప్పాలంటే ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’, ‘ఆర్య’ సినిమాలు. పాత్ర పరంగా మంచి పేరు తెచ్చింది ‘లీడర్’ చిత్రం. గుర్తింపు కంటే ఎన్నో ప్రశంసలు అందుకున్నా. దాని తరువాత ‘మిర్చి’. ఇప్పటికీ అందులో పాత్ర గురించి మాట్లాడుతుంటారు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ‘డీజే’లో కూడా ఓసీడీ క్యారెక్టర్. అలాగే ‘గీత గోవిందం’లో కుటుంబ తరహా పాత్ర చేశాను. ఇలా ఏడాది రెండేళ్లకి ఒక పాత్ర దొరుకుతుంది. నేను కథలోకి వెళ్లను గానీ, ‘సినిమాలో నేనేం చేయాలి’ అని మాత్రం అడుగుతా.
ఆర్కే: ఇప్పుడు మీరు బిజీగా ఉన్నట్టేనా? ఇప్పుడేం చేస్తున్నారు?
సుబ్బరాజు: ప్రస్తుతం పవన్ కల్యాణ్ గారివి రెండు సినిమాలు జరుగుతున్నాయి. త్వరలో మూడోది మొదలవుతుంది. వాటిల్లో చేస్తున్నా. తరువాత నాగశౌర్య, శర్వానంద్ చిత్రాలు మొదలవుతాయి.
ఆర్కే: ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
సుబ్బరాజు: ఏదో కోరికతో కాకుండా... పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం, ఒక అవసరం ఉండాలన్నది నా అభిప్రాయం. అందరూ చేసుకొంటున్నారు కదా అని నేను కూడా చేసుకోవాలని అనుకోను. ఇంట్లో ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ బోర్‌గా ఫీలవ్వలేదు. నా కంపెనీని నేను బాగా ఆస్వాదిస్తాను. అంటే వేరొకరితో ఎంజాయ్ చేయనని కాదు... కానీ ఒంటరిగా ఉండడం కూడా ఇష్టం.
ఆర్కే: వయసు పెరిగే కొద్దీ మనిషి తోడు అవసరమవుతుంది కదా!
సుబ్బరాజు: ఆ అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తా.
ఆర్కే: మీరు బాగా కలతచెందింది డ్రగ్స్ కేసులో మీ పేరు వచ్చినప్పుడు. నిజమేనా?
సుబ్బరాజు: అవును. నా గురించి కంటే మా తల్లితండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించాను. వాళ్లు ఊళ్లో ఉంటారు. నాన్న రిటైర్ట్ లెక్చరర్. ప్రకృతి వైద్యం ఫాలో అవుతారు. నేనూ ఎప్పుడూ ఇంగ్లిష్ మందులు వాడలేదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒకరిద్దరు వచ్చి.... ‘ఇన్వెస్టిగేషన్ కాదు. మిమ్మల్ని ఎంక్వైరీ చేయాల’ని నోటీసులు ఇచ్చారు. అది మీడియా అంతా గోల గోల. అక్కడున్న అమ్మానాన్నలకు ఇవన్నీ చెప్పలేను కదా! ‘వీడు ఏదైనా తప్పు చేసి ఇరుక్కుపోయాడేమో! వీడి జీవితం ఏమవుతుంది’ అనే వాళ్ల మానసిక పరిస్థితి. దానికితోడు నిరంతరం వేలెత్తిచూపే సమాజం. ఇంట్లో కూర్చున్నా చుట్టుపక్కలవాళ్లు వచ్చి అడుగుతారు కదా... ‘మీ అబ్బాయి ఇలా’ అని! అలాంటి పరిస్థితుల్లో అమ్మానాన్నలకు ఏం చెప్పి ధైర్యం చెప్పగలను? ఇదే ఆలోచన నాకు.
ఆర్కే: డ్రగ్స్ కేసులో మీ పేరు ఎందుకు వచ్చింది?
సుబ్బరాజు: అదే తెలియదు. డిపార్ట్‌మెంట్‌వాళ్లు నా ఫోన్ అడిగారు... ఇచ్చాను. రక్త పరీక్షల లాంటివేవీ చేయలేదు. తరువాత నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చేశారు.
ఆర్కే: అప్పుడు మీలాగా చాలామంది బాధపడ్డారు!
సుబ్బరాజు: అవును. దాని తరువాత ఈడీ కూడా వచ్చింది.
ఆర్కే: వాళ్లు మిమ్మల్ని ఏం అడిగారు?
సుబ్బరాజు: ఏమీ లేదు... మీరు తీసుకొంటారా? అంటే లేదని చెప్పాను. టెస్ట్ చేస్తానంటే చేసుకోవచ్చన్నాను. ఇంకెవరు తీసుకొంటారు అని అడిగితే... నాకు తెలియదన్నాను.
ఆర్కే: ప్రధాని మోదీ విధానాలను బాగా మెచ్చుకొంటారటగా!
సుబ్బరాజు : 2016 నుంచి ఇవాళ దాకా నేను కరెన్సీ చూడలేదు. ఇదివరకు జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు నా జేబులో డబ్బు కాదు కదా కార్డు కూడా లేదు. మొబైల్ ఫోన్ ఉందంతే. అన్నీ ఫోన్‌లోనే కదా! అరటి పండ్లు అమ్ముకొనేవాడి నుంచి అందరి దగ్గర బార్‌కోడ్ ఉంటుంది. అది కొడుతున్నాం. నా వరకు ఇది చాలా సౌకర్యంగా ఉంది. డీమానిటైజేషన్ అన్నది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ... డబ్బుల్లేని జీవితం బాగుంది. అంటే కాగితాలు లేకుండా! అలాగే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హిందూ పేపర్ వచ్చేది. అందులో ఎప్పుడూ జమ్ముకశ్మీర్, బాబ్రీమసీదుకు సంబంధించిన ఫొటోలు వచ్చేవి. అప్పుడవి బర్నింగ్ ఇష్యూస్ కదా! ఏడెనిమిదేళ్లుగా ఇలాంటివన్నీ తగ్గిపోయాయి. ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. అలాగే జీఎస్టీ వచ్చాక ట్యాక్సేషన్ కూడా సరళం అయిందనిపిస్తోంది నాకు.
ఆర్కే: ఏ ఆధారంతో నన్ను పిలిచారని మీరు అడగలేదా?
సుబ్బరాజు: నాకు నోటీస్ వచ్చింది. వెళ్లాను అంతే. ఏ లాయర్‌నూ కలవలేదు. అమ్మానాన్నల గురించి తప్ప నాకే ఆందోళనా లేదు. ఒకవేళ ఏదో ప్రూవ్ చేశారు. లోపల పడేశారనుకోండి! నాకు పెద్ద పోయేదేముంది?
ఆర్కే: లోపల పడేస్తే పోయేదేమీ లేదంటారేంటి?
సుబ్బరాజు: ఏంచేస్తాం మరి? దీనికేమన్నా చేయగలిగామా? (నవ్వు)
ఆర్కే: మీరు సంతోషంగా జీవించాలని కోరుకొంటూ ధన్యవాదాలు...
సుబ్బరాజు: థ్యాంక్యూ వెరీమచ్ సర్.
Updated Date - 2023-03-16T23:50:47+05:30 IST