Siddaramaiah vs DK Shivakumar: డీకే శివకుమార్ సొంత జిల్లాలో హై అలర్ట్... ఏం జరుగుతోంది?
ABN, First Publish Date - 2023-05-17T16:03:42+05:30
కర్ణాటక తదుపరి సీఎం వ్యవహారంపై స్పష్టత రాకపోయినప్పటికీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే డీకే శివకుమార్ సొంత జిల్లాలో...
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై స్పష్టత రాకపోయినప్పటికీ ప్రమాణస్వీకారానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బెంగళూరు నగరంలోని కంఠీరవ ఔట్‌డోర్ స్టేడియంలో ప్రభుత్వాధికారులు (Congress cadre) ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అతిథులు, ఎమ్మెల్యేలు, సాధారణ ప్రజానీకంతోపాటు మొత్తం 50 వేల మందికి సరిపడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేడియంలో భద్రతను పోలీసు అధికారులు బుధవారం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ముఖ్యంగా సీఎంగా ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్న పార్టీ సీనియర్ సిద్ధరామయ్య మద్ధతుదారుల ఆ ప్రాంతంలో సందడి చేస్తున్నారు. సిద్ధరామయ్యకే ఎక్కువ మొగ్గు ఉందంటూ జాతీయ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్న నేపథ్యంలో మనువడు ధవన్ రాకేష్ ఆయన ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవచ్చే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామనగర నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డీకే మద్ధతుదారులు ఆందోళనలు చేపట్టవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రామనగర పోలీసులకు రాష్ట్ర పోలీసు విభాగం సూచన చేసింది. సున్నిత ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనూహ్య పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ ప్రాంతంలో అదనంగా 6 కర్ణాటక పోలీస్ రిజర్వ్ ఫోర్స్‌ను అధికారులు మోహరించారు.
సీఎం ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అనూహ్య ప్రకటన చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం జరగలేదని వెల్లడించారు. సీఎం ప్రమాణస్వీకారానికి సంబంధించి ఫేక్ డేట్లు ప్రచారంలో ఉన్నాయన్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం అభ్యర్థిత్వంపై నేడు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు. 72 గంటల వ్యవధిలోనే కేబినెట్ ఏర్పాటవుతుందన్నారు.
Updated Date - 2023-05-17T17:13:13+05:30 IST