Seethakka: సీతక్కపై అధికార పార్టీ విషప్రచారం.. ఇంత దిగజారాలా?
ABN, First Publish Date - 2023-07-10T14:24:58+05:30
కరోనా సమయంలో సీతక్క చేసిన సేవా కార్యక్రమాల గురించి ఇప్పటికీ ప్రజలు పలు సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇతరుల తరహాలో ఎలాంటి తాయిలాలు ప్రకటించకపోయినా ఎన్నికల్లో ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే ఇటీవల ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమెకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఎలాంటి వివాదాల జోలికి ఎమ్మెల్యే సీతక్క వెళ్లరని.. ఇతరులకు పెద్ద మనసుతో ఆమె సాయం చేస్తుంటారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయంలో సీతక్క చేసిన సేవా కార్యక్రమాల గురించి ఇప్పటికీ ప్రజలు పలు సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇతరుల తరహాలో ఎలాంటి తాయిలాలు ప్రకటించకపోయినా ఎన్నికల్లో ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు.
అయితే ఇటీవల ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని.. ఆమె పార్టీ మారుతున్నారని తెగ హడావిడి చేశారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లోకి రాబోతున్నారని వైరల్ చేశారు. ఉత్తమ్ సంగతి పక్కనపెడితే సీతక్క కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేసే ప్రసక్తే లేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
అటు సీతక్క కుమారుడు సూర్య త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని.. ఆయన వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టిక్కెట్ కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సూర్యకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని.. దీంతో సీతక్క కినుక వహించారని బీఆర్ఎస్కు చెందిన కొన్ని ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. సీతక్క త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని ప్రచారం షురూ చేశాయి. అయితే సదరు ఆరోపణలపై ఎమ్మెల్యే సీతక్క స్వయంగా స్పందించి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉందని.. ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రజల మూడ్‌కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కూడా తిరిగి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కొంచెం ఓపిక పడితే నేతలందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.
అయితే ప్రస్తుత కాలంలో ఎమ్మెల్యే పదవి ఇస్తే తరతరాలు కూర్చుని తినే ఆస్తిపాస్తులను కూడబెడుతున్న రాజకీయ నేతలను చూస్తున్న ప్రజలు.. చాలా సింపుల్‌గా కనిపించే సీతక్క లాంటి ఎమ్మెల్యేను చూసి ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు మాత్రమే సీతక్క లాంటి నేతను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చాలా సాన్నిహిత్యంగా ఉండటం సహించలేని కొందరు నేతలు కావాలనే సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అటు ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో సీతక్కపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదని.. అవసరమైతే పార్టీ సీతక్కను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీతక్క స్థానం ఏంటో అందరికీ క్లారిటీ వచ్చింది. అలాంటి ఆమెపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
తాజాగా సమయం వచ్చినప్పుడు సీతక్క కథతో సినిమా కూడా తీస్తానంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించడం కూడా ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ను చాటిచెప్తోంది. నమ్ముకున్న ప్రజల కోసం సీతక్క అహర్నిశలు శ్రమిస్తుంటారని బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించాడు. కాగా సీతక్క అసలు పేరు అనసూయ. తాను దళంలో పనిచేసిన సమయంలో అన్నలు ఆప్యాయంగా సీతక్క అని పేరు పెట్టడంతో అదే పేరు కంటిన్యూ అవుతుందని.. తాను పెళ్లి చేసుకునే వ్యక్తి పేరు రాము అని ఉండటంతో ఆయన పేరుతో కలిసేలా సీతక్క అని పెట్టారని ములుగు ఎమ్మెల్యే స్వయంగా చెప్పారు. తన సర్టిఫికెట్లలోనూ అదే పేరు ఉంటుందని సీతక్క పేర్కొన్నారు.
Updated Date - 2023-07-10T14:24:58+05:30 IST