Vijayawada Kanaka Durga Temple: పవన్ సమర్పించిన పట్టుచీర పెద్ద వ్యవహారమే బయటకు తెచ్చింది..!
ABN, First Publish Date - 2023-02-27T16:01:47+05:30
చీర.. చీర.. నువ్వేం చేశావ్.. అంటే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సన్నిధిలో అక్రమార్కుల భరతం పట్టాను. అసలు బాగోతాలు బయటపెట్టాను. తెరవెనుక పన్నాగాలను వెలుగులోకి..
చీర.. చీర.. నువ్వేం చేశావ్.. అంటే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సన్నిధిలో అక్రమార్కుల భరతం పట్టాను. అసలు బాగోతాలు బయటపెట్టాను. తెరవెనుక పన్నాగాలను వెలుగులోకి తెచ్చాను అన్నదట. దుర్గమ్మకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర్పించిన ఈ చీర వెనుక కథాకమామీషు.. తిరిగి తిరిగి సీఎంవో కార్యాలయానికి ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడమే కాదు.. ఏకంగా చీరల కాంట్రాక్టు రద్దు చేసే వరకూ వెళ్లింది. దీని వెనుక జరిగిన చిత్ర విచిత్రాలను బయటపెట్టింది.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కొద్దిరోజుల క్రితం దుర్గమ్మకు పట్టుచీర సమర్పించారు. ఈ చీరను దేవస్థానం సిబ్బంది చీరల విక్రయ కౌంటర్‌కు పంపించారు. కాంట్రాక్టర్ ఆ చీరను జనసేన అభిమాని అయిన ఓ మహిళకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చీరను విక్రయిస్తుండగానే, సమాచారం జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌కు చేరింది. దీంతో ఆయన వెంటనే దుర్గగుడి అధికారులకు ఫోన్ చేసి సంబంధిత చీరను తాను కొంటానని చెప్పారు. దీంతో ఈవో కౌంటర్‌కు ఫోన్ చేసి పవన్ అందజేసిన చీరను తన వద్దకు తీసుకొచ్చి అప్పగించాలని ఆదేశించారు. ఉద్యోగులు ఆ చీరను ఈవోకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న చీరల కాంట్రాక్టర్ విక్రయాల కౌంటర్లో ఉన్న చీరను తీసుకెళ్లిన దేవస్థానం సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో సిబ్బంది ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఈవో విచారణకు ఆదేశించారు.
ఇదంతా అటు, ఇటు తిరిగి దేవదాయ శాఖ మంత్రి పేషీకి, సీఎంవోకు చేరింది. ఈ నేపథ్యంలో చీరల కౌంటర్ కాంట్రాక్టుకు సంబంధించి దేవస్థానం ఉద్యోగే నేరుగా మంత్రికి, సీఎంవోకు ఫిర్యాదు చేశారు. గతంలో చీరల కౌంటరును దేవస్థానం సిబ్బందే నిర్వహించేవారని, ఆ సమయంలో 17 నెలలకు రూ.12 కోట్ల ఆదాయం దేవస్థానానికి సమకూరేదని, కానీ, ఏడాదికి కేవలం రూ.3.30 కోట్లకే చీరల కౌంటర్ కాంట్రాక్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్, ఈవో కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు చేశారు. దీంతో అసలు డొంక కదిలింది.
మరీ అంత అడ్డగోలా..
పవన్ చీర వివాదం నేపథ్యంలో మరోసారి చీరల కౌంటర్ కాంట్రాక్ట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో చీరల కౌంటర్లో విధులు నిర్వహించిన ఉద్యోగి నేరుగా సీఎంవోకు, మంత్రి పేషీకి ఫిర్యాదు చేయడమే కాదు.. ఆసక్తికర విషయాలను కూడా అందులో పొందుపరిచారు. గతంలో చీరల కౌంటర్లో పనిచేసినతాను 17 నెలలకు గానూ సుమారు రూ.12 కోట్ల ఆదాయం చూపించానని పేర్కొన్నారు. 2018, ఏప్రిల్ 1 నుంచి 2019, ఆగస్టు 31 వరకు చీరల విక్రయాల ద్వారా రూ.6.45 కోట్ల ఆదాయం వచ్చిందని, దీన్ని దేవస్థానానికి జమ చేశానని పేర్కొన్నారు. ఇదికాక రూ.2 కోట్ల విలువైన సుమారు 2 వేల పట్టు చీరలను, రూ.2.90 కోట్ల విలువైన 41 వేల సాధారణ చీరలను, రూ.18 లక్షల విలువైన 31 వేల రవికలను దేవస్థానానికి జమ చేశానని తెలిపారు. మరో కోటి రూపాయల విలువైన చీరలను దేవస్థానం అవసరాలకు అప్పగించినట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. మొత్తం మీద 17 నెలల్లో సుమారు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరిందని తెలిపారు.
2019-20లో కొవిడ్ కారణంగా చీరల కౌంటర్ అమ్మకాలు తక్కువగా ఉన్నాయని, దీన్ని సాకుగా చూపి 2021-23కు అతి తక్కువ ధరకు చీరల కౌంటర్ కాంట్రాక్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆ ఉద్యోగి ఆరోపించారు. చీరల కౌంటర్ ద్వారా రెండేళ్లకు సుమారు రూ.16 కోట్ల ఆదాయం సమకూరే పరిస్థితి ఉండగా, ఏడాదికి కేవలం రూ.3.30 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో కోరారు.
కాంట్రాక్టు రద్దుకు సన్నాహాలు
చీరల కౌంటర్ కాంట్రాక్టు వ్యవహారం సీఎంవో వరకూ వెళ్లడంతో పవన్ కల్యాణ్ చీర వివాదాన్ని సాకుగా చూపి కాంట్రాక్టును రద్దు చేసి చేతులు దులిపేసుకునేందుకు దుర్గగుడి అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి చీరల కౌంటర్ కాంట్రాక్ట్ త్వరలోనే ముగియనుంది. అయితే, టెండర్ వ్యవహారంలో తమ తప్పు లేదని నిరూపించుకునేందుకు కాంట్రాక్ట్ రద్దుకు అడుగులు పడుతున్నాయి. తద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - 2023-02-27T16:02:38+05:30 IST