YSRCP : పరాయిగడ్డపై తెలుగోడి పరువు తీసిన వైసీపీ నేత.. వీడు అసలు మనిషేనా..!?
ABN, First Publish Date - 2023-12-01T13:56:32+05:30
అవును.. వైసీపీలోని కొందరు నేతలు, కార్యకర్తల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు అక్షరాల నిజమే. ఎందుకంటే.. అమెరికాలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సత్తారు వెంకటేష్ రెడ్డి నరరూప రాక్షసుడిలా మారాడు.
అవును.. వైసీపీలోని కొందరు నేతలు, కార్యకర్తల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు అక్షరాల నిజమే. ఎందుకంటే.. అమెరికాలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సత్తారు వెంకటేష్ రెడ్డి నరరూప రాక్షసుడిలా మారాడు. ఈయన చేసిన చిల్లర పనులతో అమెరికాలో ఆంధ్ర పరువు పోయినట్లయ్యింది. బహుశా ఇదే ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉంటే ఏదో ఒక సాకు చెప్పి.. అవసరమైతే అధికారాన్ని వాడి మరీ తప్పించుకునేవారేమో. అయితే పరాయి గడ్డ కావడంతో అక్కడి పోలీసులు తాట తీస్తున్నారు.!
అసలేం జరిగింది..?
సత్తారు వెంకటేష్ రెడ్డి, నిఖిల్ పెన్మత్స, శ్రవణ్ పెనుమచ్చ అనే ముగ్గురు యువకులు.. నరరూప రాక్షసులుగా మారి 20 ఏళ్ల యువకుడిని రహస్య ప్రదేశంలో బంధించి తీవ్రంగా హింసిస్తూ రాక్షసానందం పొందారు. అలా వారి పైశాచికత్వం 7 నెలల పాటు కొనసాగింది. చివరికి వారి పాపం పండడంతో పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సత్తారు వెంకటేష్ రెడ్డిని, అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడీ ముగ్గురు పరాయిగడ్డపై ఊచలు లెక్కెడుతున్నారు. సెయింట్ లూయిస్ నగర పరిధిలోని డిఫాయెన్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ స్థానిక వ్యక్తికి బాధిత యువకుడు అనుమానస్పదంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తి వెళ్లి బాధిత యువకుడిని కలిశాడు. ఆ సమయంలో ఏదైనా సమస్య ఉంటే.. తనకు ఫోన్ చేయమని అతనికి తన ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తితో బాధితుడు వాట్సాప్ ద్వారా తనపై ఆ ముగ్గురు నరరూప రాక్షసులు చేస్తున్న పైశాచికత్వాన్ని తెలియజేశాడు. వారు తనను ప్రతిరోజు ఏ రకంగా వేధిస్తున్నారనే విషయాలను వివరించాడు. బాధితుడి వివరణతో చలించిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అయితే, పోలీసులను గృహంలోకి ప్రవేశించడాన్ని సత్తారు, అతని సహచరులు నిరాకరించారు. ఇది గమనించిన బాధితుడు తనంతటా తానే బయటకు పరుగెత్తుకొచ్చి పోలీసులతో తనను రక్షించాల్సిందిగా వేడుకున్నాడు. దాంతో ఆ ముగ్గురి అరాచకాలు బయటపడ్డాయి.
వీళ్లు అసలు మనుషులేనా..?
బాధితుడిని పోలీసులు విచారించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ప్రతిరోజు పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో చావబాదేవారు. అలా బాధితుడిని చితకబాదుతూ, అతడు ఆ దెబ్బలు తాళలేక విలవిల్లాడుతుంటే చూసి ఆనందించేవారు ఆ ముగ్గురు. వారి రాక్షస చర్యకు బాధితుడి నుదుటి నుంచి పాదాల వరకు శరీరంపై గాట్లు, గాయాలు అయ్యాయి. చివరికి పక్కటెముకలతో పాటు శరీరంలో పలుచోట్ల ఎముకలు కూడా విరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పని మొత్తం బాధిత యువకుడితోనే చేయించేవారు. అంతటితో ఆగకుండా ప్రధాని నిందితుడు వెంకటేష్ డైలీ 2గంటల పాటు మసాజ్ చేయించుకునేవాడు. వారు చెప్పిన పనులు చేయకపోతే తనను ఇంకా తీవ్రంగా హింసించేవారని బాధితుడు విచారణలో చెప్పాడు. ఇంటి బేస్‌మెంట్‌లో నేలమీద పడుకుబెట్టేవారు. అది కూడా కేవలం ఒకరోజులో 3గంటలు మాత్రమే నిద్రపోయేందుకు అనుమతించేవారని బాధితుడు చెప్పాడు. తనను ప్రతిక్షణం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేవారు’ అని విచారణలో బాధితుడు చెప్పిన విషయాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. బాధితుడు అమెరికాకు వచ్చిన 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు.. యువకుడు.. సత్తారు దగ్గరికి ఎలా వచ్చాడు..? ఇంతలా హింసించడానికి గల కారణాలేంటి..? అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురినీ నాన్ బెయిలబుల్ వారంట్‌పై అరెస్ట్ చేసిన పోలీసులు.. మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మిస్సోరిలోని ఎన్నారైలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చూశారుగా.. ఈ ముగ్గురు మనుషులు అనే విషయాన్ని మరిచి ఎలా ప్రవర్తించారో!.
దందా రాయుడు!!
కాగా.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన వెంకటేష్ రెడ్డి తనను తాను పవర్ ఫుల్ మనిషినని చెప్పుకునే వాడట. అంతేకాదు.. ఏపీలో అధికారంలో ఉన్నది తమ పార్టీయేనని తనను ఎవరూ ఏమీ చేయలేరని.. ఎవర్ని పడితే వారిని బెదిరించి దందాలు కూడా చేస్తుండే వాడట. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. తాను వైసీపీ నేతను అని చెప్పి బెదిరింపులకు పాల్పడేవాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అరెస్ట్ వ్యవహారం గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వెంకటేష్ రెడ్డి సోషల్ మీడియాను కాస్త గమనిస్తే.. అమెరికాలో ఏం చేస్తుంటాడనేది క్లారిటీ అర్థమవుతుంది. పరాయి గడ్డపైన తెలుగువాళ్ల పరువు తీస్తున్నారని నెటిజన్లు, సామాన్య ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
Updated Date - 2023-12-01T14:02:37+05:30 IST