కూతురికోసం తల్లి సాహసం.. అరగంట సేపు అడవిపందితో పోరాడిమరీ బిడ్డను కాపాడుకుంది.. కానీ చివరికి..
ABN, First Publish Date - 2023-02-27T11:55:32+05:30
ఆమె ముందువెనుకా ఆలోచన చెయ్యకుండా తన చేతిలో ఉన్న..
అడవి పందులు ఎలా ఉంటాయి? వాడిగా ఉన్న కోరలతో బలిష్టంగా ఉంటాయి. వేగంగా పరిగెడుతూ వణుకు పుట్టిస్తాయి. అవి ఒక్క తోపు తోశాయంటే అంతదూరం పోయి పడతాం. కూతురి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అలాంటి అడవి పందితో ఓ తల్లి అరగంట సేపు పోరాటం చేసింది. ఆశ్చర్యపరిచే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్ ఘర్(Chhattisgarh) రాష్ట్రం కోర్బా జిల్లా(Korba District)లో తెలియమార్(Teliyamar) అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దువాసియా బాయి అనే45ఏళ్ళ మహిళ కుటుంబం నివసిస్తోంది. దువాసియా బాయికి సునీత అనే 11ఏళ్ళ కూతురుంది. ఆదివారం స్కూల్ లేకపోవడంతో సునీత ఇంటి దగ్గరే ఉంది. దువాసియా బాయి పొలం దగ్గరకు వెళుతుంటే తల్లి వెంట సునీత కూడా వెళ్ళింది. పొలం గ్రామానికి దూరంగా అడవికి దగ్గరలో ఉంటుంది. దువాసియా బాయి తమ పొలం చేరుకుని మట్టి తవ్వుతుండగా సునీత ఆడుకుంటోంది. పొలంకు కొంచెం దూరంలో గుంపుగా కొన్ని జంతువులు కనబడ్డాయి సునీతకు. కానీ అవి నల్లగా ఉండటంతో గేదెలు అనుకుని ఆడుకోవడంలో మునిగిపోయింది.
Read also: సొంతంగా గ్రామాభివృద్ది పనులు చేస్తున్న ఇతడికోసం 6రాష్ట్రాల పోలీసుల వేట మామూలుగా లేదు.. కారణమేంటంటే..
ఉన్నట్టుండి సునీత గట్టిగా అరుస్తూ ఏడ్చేసరికి దువాసిబాయి ఉలిక్కిపడి కూతురువైపు చూసింది. సునీత మీద అడవిపందుల గుంపు దాడి చేస్తోంది. దువాసిబాయి ముందువెనుకా ఆలోచన చెయ్యకుండా తన చేతిలో ఉన్న గడ్డపారతో ఆ అడవిపందుల గుంపును తరిమికొట్టింది. అయితే ఒక అడవిపంది(Wild boar) మాత్రం సునీతను వదల్లేదు. దీంతో దువాసిబాయి ఆ అడవిపందిని తన చేతిలో ఉన్నగడ్డపారతో బాదడం, పొడవడం మొదలుపెట్టింది. ఆ అడవి పంది సునీతను వదిలి దువాసిబాయి మీదకు వెళ్ళింది. అడవిపందికి, దువాసిబాయికి మధ్య పోరాటం జరుగుతుండగా సునీత అక్కడినుండి ఇంటికి పరుగుతీసింది. ఇంట్లో ఉన్న తండ్రికి జరుగుతున్న విషయం మొత్తం చెప్పగానే అతను కొందరు గ్రామస్తులను వెంటబెట్టుకుని పొలం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళాడు. వారు దువాసిబాయిని చేరుకునే సరికి ఒకపక్క దువాసిబాయి, మరొక పక్క అడవిపంది నిర్జీవంగా పడిఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దువాసిబాయి తన పోరాటం ఆపకుండా అడవిపందిని చంపి అది చేసిన గాయాలకు తాళలేక ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో గ్రామస్తులు అందరూ విషాదంలో మునిగిపోయారు. 11ఏళ్ళ సునీత తన తల్లి తనను కాపాడటం కోసం అడవిపంది చేతిలో మరణించిందనే దిగులులో కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని దువాసిబాయి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు కూడా అడవి పంది మృతదేహాన్ని పంచనామా నిర్వహించడానికి తీసుకెళ్ళారు.
Updated Date - 2023-02-27T13:31:39+05:30 IST