ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balagam Film Review: తెలంగాణ పల్లె జీవనశైలిని కళ్ళకు కట్టినట్టు చెప్పే కథ

ABN, First Publish Date - 2023-03-02T16:54:45+05:30

'బలగం' అనే సినిమా నూటికి నూరుపాళ్లు తెలంగాణ పల్లె జీవిత కథ. తెలంగాణ గ్రామంలో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాలు గురించి చెప్పే భావోద్వేగమయిన కథ. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక బలగం అవుతుంది అనే చెప్పే కథ. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సినిమా: బలగం (Balagam)

నటీనటులు: ప్రియదర్శి (PriyadarshiPulikonda), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram), సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, రూప లక్ష్మి, వేణు ఎల్దండి (Venu Eldandi) తదితరులు

ఛాయాగ్రహణం: ఆచార్య వేణు (Acharya Venu)

సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)

దర్శకత్వం: వేణు ఎల్దండి

నిర్మాత: హర్షిత్ రెడ్డి, హన్షిత

-- సురేష్ కవిరాయని

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన చిత్రం 'బలగం' (Balagam Film Review). 'జబర్దస్త్' (Jabardasth) టీవీ షో తో బాగా పాపులర్ అయిన నటుడు వేణు ఎల్దండి ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో లీడ్ పెయిర్. ఈ సినిమా విడుదలకి ముందే నిర్మాత దిల్ రాజు చాలామందికి చూపించాడు అంటే, అతనికి ఈ సినిమా మీద వున్న నమ్మకం అలాంటిది మరి. ఈ సినిమా కథ మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం లో జరుగుతుంది. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీతం సమకూర్చగా, కాకర్ల శ్యామ్ ఇందులో పాటలన్నీ రాసాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (BalagamReview)

Balagam Story కథ:

'బలగం' కథ అంతా తెలంగాణ లోని ఒక గ్రామం లో జరుగుతుంది. కొమరయ్య (సుధాకర్ రెడ్డి) అనే ముసలాయన ఆ గ్రామంలో ప్రతి వాళ్ళనీ పలకరిస్తూ, హాస్యోక్తులు ఆడుతూ, తెల్లవారు జామునే అందరినీ లేపుతూ తన పొలం కి వెళ్లి వస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొమరయ్య మనవడు (పెద్ద కొడుకు కుమారుడు) శైలు (ప్రియదర్శి) 15 లక్షలు అప్పు చేస్తాడు,పెళ్లి చేసుకొని వచ్చిన కట్నం డబ్బుతో అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. కానీ తాత కొమరయ్య చనిపోవటం తో వాయిదా పడుతుంది. కొమరయ్య కూతురు కొన్ని సంవత్సరాలుగా పుట్టింటికి రాదు, కానీ కొమరయ్య చనిపోయాడు అని తెలుసుకున్న వెంటనే, తండ్రి శవాన్ని చూడటానికి పరిగెత్తుకు వస్తుంది. అలాగే సూరత్ లో వున్న కొమరయ్య చిన్న కొడుకు, కోడలు కూడా తండ్రి పోయాడు అనగానే వచ్చేస్తారు. కొమరయ్య అల్లుడు, పెద్ద కొడుకు మోహ మొహాలు చూసుకోకుండా కూర్చుంటారు, వాదించుకుంటారు, కొట్టుకుంటారు కూడా. మూడోరోజు పిండం పెడతారు. గ్రామంలో ఉన్నవారంతా ఊరి బయటకి వచ్చి పిండం పెట్టి కాకి కోసం ఎదురుచూస్తారు. కాకి వస్తుంది కానీ పిండం ముట్టదు. గ్రామ పెద్దలు కొమరయ్య కి ఏమి కోర్కెలు ఉన్నాయో అవి తీరిస్తే కాకి వచ్చి ముట్టుకుంటుందని కొడుకులకి, అల్లుడికి చెప్తారు. ఇంతకీ కొమరయ్య కి కోర్కెలు ఏమున్నాయి, గ్రామ పెద్దలు కొమరయ్య కుటుంబానికి ఎలాంటి హెచ్చరిక చేశారు, కాకి వచ్చి పిండం తినటానికి ఆ కుటుంబం చివరికి ఏమి చేసింది అన్నదే బలగం కథ.

విశ్లేషణ:

వేణు ఎల్దండి (Jabardasth Venu) మనకి 'జబర్దస్త్' షో లో ఒక కమెడియన్ గా తెలుసు, అలాగే అప్పుడప్పుడూ సినిమాల్లో నటుడిగా కూడా చూస్తాము. కానీ మొదటి సారి 'బలగం' (BalagamReview) అనే ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ మొదటి సినిమా ఒక మంచి కథతో రావటం విశేషం. బలగం (BalagamFilmReview) అనే సినిమా ఒక భావోద్వేగానికి చెందినది, తెలంగాణ పల్లె జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కథ. ఊరి వాతావరణం, మనసులో ఏ కల్మషం లేని మనుషులు, వారి మనస్తత్వాలు గొప్పగా చూపించాడు వేణు.

ఒక కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతాడు. అతను గ్రామం లో అందరికీ తెలిసిన వ్యక్తి, అందుకే ఆ గ్రామంలో వుండే మనుషులు అందరూ ఆ ఇంటికి వస్తారు. ఆ పెద్దాయన కూతురు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పుట్టింటికి దూరం అయిపోతుంది. చిన్న కొడుకు భార్య కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, భర్తని అసలు మాట్లాడనివ్వదు. పెద్ద కొడుకుకి చాలా కోపం ఎక్కువ. ఇలా పంతాలు, పట్టింపులు మధ్య ఆ కుటుంబం చనిపోయిన పెద్దయానికి పిండం పెడతారు. చనిపోయిన వారు కాకి రూపంలో వచ్చి పిండం తింటారు అనేది ఎక్కడయినా ఆచారమే. కానీ ఎలా పెడతారు, ఏమి చేస్తారు అన్న విషయం ప్రాంతాల వారీగా మారుతుంది. ఆ నేపథ్యంలో తెలంగాణాలో ఒక గ్రామంలో కుటుంబం, గ్రామా మనుషుల మధ్య బాంధవ్యాలుని అందంగా తెరమీద చూపే ప్రయత్నం ఈ 'బలగం'.

ఇక్కడే దర్శకుడు వేణు తన ప్రతిభని చాటాడు. కాకి చుట్టూ, లేదా చనిపోయిన కొమరయ్య చుట్టూ కథ అల్లేడు. ఆ చిన్న కాకిని పట్టుకొని వేణు ఒక గ్రామానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి ఒక మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తన సినిమాలో ఆవిష్కరించాడు. ఆ చావులోనే హాస్యాన్ని పండించాడు, దానిలోనే భావోద్వేగాలను చూపించాడు, ఏడిపించాడు, నవ్వించాడు. ఈ 'బలగం' సినిమాలో కథే ఒక పెద్ద బలం. ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. అవన్నీ చాల సహజంగా ఉంటాయి. మనకి తెర మీద ఒక కథ కనిపిస్తూ ఉంటుంది, పాత్రలు కనిపిస్తాయి, వారి జీవన శైలి కనిపిస్తుంది.

కొమరయ్య లాంటి తాత దాదాపుగా ప్రతి గ్రామం లో, ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే తాతే కదా ఎప్పుడూ ముందు లేచేది, అందరినీ లేపేది. అందరూ అదే తాత మీదే కదా విసుక్కునేది, జోక్స్ వేసేది కూడా. పొద్దున్నే వచ్చి నిద్ర లేపితే 'పొద్దున్నే ఎందుకు ఆలా కాకిలా అరుస్తావ్' అని అంటాం కదా, కానీ అలాంటి తాత కోసం మనవడు క్లైమాక్స్ లో ఎంత పెద్ద తప్పు చేశాను, నా స్వార్ధం కోసం తాత చావుని వాడుకున్న, ఇంక తాత కనిపించడు అని మనవడు ఏడుస్తుంటే చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. అలాగే గ్రామస్థులు 11 వ రోజు కాకి కనక పిండం ముట్టుకోకపోతే, ఆ కుటుంబాన్ని వెలివేస్తాం అని హెచ్చరిస్తారు. ఆ 11వ రోజు బుర్రకథ చెపుతూ, ఆ కుటుంబం లోని ఒక్కో మనిషి గురించి పాటల రూపంలో ఎలా నడుచుకోవాలో, కుటుంబ గౌరవ మర్యాదలు ఎలా పాటించాలి, బిడ్డల ఆలనాపాలనా ఎలా చూసుకోవాలి, మనుషుల మధ్య ఉండాల్సిన విలువలు, బంధాలు, బాంధవ్యాలు ఒకటేంటి అన్నీ కూలంకషంగా చెప్తారు. అదే విధంగా అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య ఆప్యాయతల గురించి చెపుతూ అల్లిన ఆ చివరి 15 నిముషాల ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎక్కువమంది కొత్త వారు నటించారు. అసలు వాళ్లంతా నటులా, లేక సహజంగా ఆ గ్రామంలో వున్న మనుషులని యధావిధిగా ఇందులో పెట్టరా అన్నంత సహజంగా నటించారు. అక్కడ పాత్ర మాత్రమే కనపడుతుంది తప్ప, అది ఎవరు చేసారు అన్నది కనిపించదు, అంతలా ఆ పాత్రలో ప్రతి ఒక్కరు ఇమిడిపోయారు. ప్రియదర్శికి ఇది ఒక మంచి పాత్ర. చాలా చక్కగా ఆ పాత్రలో అమిరిపోయాడు. అలాగే కావ్య కళ్యాణ్ రామ్ కూడా మరదలుగా చాలా బాగా చేసింది. మామూలు సినిమాలో చూస్తున్నట్టుగా ఇందులో కథానాయిక ఉండదు, కానీ సహజంగా ఉంటుంది. ఆమె పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆమె చెప్పే రెండు మూడు మాటల వలన, ఆమె తండ్రి తన నడవడి మార్చుకుంటాడు. ఇంకా రచ్చ రవి పాత్ర కూడా పెద్దదే, రెండు నిముషాలు ఆగుతావా అంటూ ఒక చిన్న మేనరిజమ్ తో అందరిని నవ్విస్తాడు. రూప లక్ష్మి కూడా కూతురుగా బాగా చేసింది. సుధాకర్ రెడ్డి కొమరయ్యగా కొన్ని నిముషాలపాటు కనిపించినా, సినిమా అంతా వున్నట్టే ఉంటాడు. కొమరయ్య పెద్ద కొడుకు, చిన్న కొడుకు, చెల్లెలు, చిన్న కోడలు, వూరు ప్రజలు అందరూ తమ పాత్రలకు జీవం పోశారు. అలాగే దర్శకుడు వేణు కమెడియన్ గా అందరికి పరిచయం కాబట్టి తన మార్కును టైలర్ నర్సి పాత్రగా అలరించాడు.

భీమ్స్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమాకి ఒక మూల స్థంభం. అలాగే ఇందులో పాటలు అన్నీ కాసర్ల శ్యామ్ (Shyam Kasarla) రాసాడు, అతను ఇప్పటికే తెలంగాణలో ఒక పేరున్న రచయిత, ఈ సినిమాతో మరింత ఎత్తుకు వెళతాడు. పాటల్లో తెలంగాణ సాహిత్యం, వాణి, బాణీ, సంప్రదాయం అన్నీ కలగలిపి కాసర్ల శ్యాం రాసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. పాటలు అన్నీ కూడా బాగా పాడారు వినసొంపుగా వున్నాయి. ఛాయాగ్రహణం ఆచార్య వేణు పల్లె వాతావరణం, ఆ గ్రామ ప్రజల గుండె చప్పుడుని చక్కగా చూపించాడు. పచ్చని పొలాలు, చెట్లు, రచ్చ బండ ఇవన్నీ చూడటానికి చాలా సహజంగా వున్నాయి.

ఇక చివరగా, 'బలగం' అనే సినిమా నూటికి నూరుపాళ్లు తెలంగాణ పల్లె జీవిత కథ. తెలంగాణ గ్రామంలో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాలు గురించి చెప్పే భావోద్వేగమయిన కథ. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక బలగం అవుతుంది అనే చెప్పే కథ. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అలాగే ఈ సినిమాకి అవార్డులు, రివార్డులు వచ్చే ఛాన్స్ కూడా వుంది. చాలా సంవత్సరాల తరువాత ఒక మంచి సినిమా వచ్చింది, అదీ ఒక పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన దిల్ రాజు ఇంటి నుంచి.

Updated Date - 2023-03-02T16:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!