Human Relations: చిన్నప్పుడే తల్లికి దూరమైన వ్యక్తి.. ఆమె కోసం వెతుకుతుండగా..
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:33 AM
తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న బంధం విడదీయలేనిది. అయితే కొందరు దురదృష్టవశాత్తు వారి ప్రేమను చిన్నతనంలోనే కోల్పోతారు. ఇలాంటి ఘటనే బ్రిటన్ లో జరిగింది. ఓ వ్యక్తి చిన్నతనంలో దూరమైన తన తల్లి కోసం వెతుక్కుంటూ రాగా విషాదం జరిగింది.
లండన్: తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న బంధం విడదీయలేనిది. అయితే కొందరు దురదృష్టవశాత్తు వారి ప్రేమను చిన్నతనంలోనే కోల్పోతారు. ఇలాంటి ఘటనే బ్రిటన్(Britain) లో జరిగింది. ఓ వ్యక్తి చిన్నతనంలో దూరమైన తన తల్లి కోసం వెతుక్కుంటూ రాగా విషాదం జరిగింది. బ్రిటన్ కి చెందిన స్టీవెన్ స్మిత్(43) 1980లో కార్ మార్థెన్ లో జన్మించాడు. ఆయనకు 3 ఏళ్లు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లిపోయారు. అనంతరం స్టీవెన్ ని దత్తత ఇచ్చారు. తాను యుక్త వయస్సుకు వచ్చేవరకు తన తల్లిదండ్రుల గురించి కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగేవాడినని స్మిత్ చెప్పాడు.
"నాకు చిన్నప్పుడు జాసన్ జోన్స్ అని పేరు పెట్టారు. నా తల్లి పేరు డాఫ్నే. నన్ను వేరేవాళ్లకి దత్తత ఇచ్చారు. 2021లో డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నప్పుడు తనకు ఓ సోదరుడు ఉన్నాడని తెలిసింది. అతనికి ఓ సవతి సోదరి ఉన్నట్లు తెలిసింది. ఆమెకు నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసు. అలా వారిరువురి చిరునామా కనుక్కుని బయల్దేరాను. ఈ జర్నీలో అమ్మ నాన్న విడిపోయారని తెలిసింది. అమ్మ బెత్నాల్ గ్రీన్ లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలిసింది.
తనను సర్ప్రైజ్ చేయాలని నిర్ణయించుకుని బయల్దేరాను. ఆమె కోసం పూల బొకె కూడా తీసుకెళ్లాను. ఇంటికి వెళ్లి బెల్ కొట్టాను. ఎంతకీ డోర్ తెరవకపోవడంతో వెనకవైపున ఉన్న మరో డోర్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాను. అమ్మ.. అమ్మ.. అని ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి బాత్రూం డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అమ్మ నేలపై నిర్జీవంగా పడి ఉంది. నాకు కన్నీళ్లు ఆగలేవు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాను. కానీ లాభం లేకుండా పోయింది. అమ్మ మరణించింది" అంటూ స్టీవెన్ తన బాధను వ్యక్తం చేశాడు.
చిన్ననాటి నుంచి తల్లి ప్రేమను కోల్పోయి.. ఆమెకు దగ్గరవుతున్నానని సంతోషపడే లోపే ఈ విషాదం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తన తండ్రినైనా కలవాలంటూ స్టీవెన్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
Updated Date - Dec 30 , 2023 | 11:44 AM