Budget 2023: కొత్త బడ్జెట్ పొగరాయుళ్ళకు పొగపెడుతుందట.. భారీగా పెరగనున్న సిగరెట్లు, పొగాకు ధర.. నిజమెంతంటే..
ABN, First Publish Date - 2023-01-31T18:13:48+05:30
ఏ ధరలు ఎలా ఉన్నా పొగాకు, సిగరెట్ మీద వేటు తప్పదంటున్నారు. కారణమిదే..
కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏ ధరలు పెరుగుతాయో, ఏ ధరలు ఢమాల్ అంటాయో ఆర్థిక విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. అయితే ఏది ఎలా పెరిగినా, తగ్గినా కేంద్రం పొగరాయుళ్ళకు మాత్రం పొగపెట్టడం తప్పనిసరి అంటున్నారు. సిగరెట్లు, పొగాకు మొదలయినవాటి ధరలు పెరగడమే దీనికి కారణం. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
స్టైల్‌గా సిగరెట్ చేతులో పట్టుకుని ఒక దమ్ము లాగి రింగు రింగుల పొగను గాల్లో వదిలే పొగరాయుళ్ళ నోళ్ళు వెళ్ళబెట్టేలా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన ఉండబోతోంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2023 సంవత్సరానికి బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో సిగరెట్లు, పొగాకు, పొగాకు ఆధారిత ఉత్పత్తుల మీద ధరలు పెంచబోతున్నారు. అలాగే వీటి మీద పన్నుల వడ్డన కూడా బాగానే ఉంటుందట. దీని వెనుక ఉన్న కారణం గురించి ఆరా తీస్తే..
గత రెండు సంవత్సరాల నుండి బడ్జెట్ ప్రకటనలో పొగాకు మీద ఎలాంటి పన్ను ప్రస్తావనా లేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా పొగాకు మీద వేటు పడుతుందని అభిప్రాయం. సాధారణంగా పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణ మొదలైన విషయాలను GST కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తు ఆకస్మిక సుంకాన్ని(NCCD) విధిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ NCCD సుంకాన్ని విధించవచ్చని, అలాగే ఈ సుంకాన్ని పెంచవచ్చని కూడా చెబుతున్నారు. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో ఈ NCCD పన్ను వాటా 10శాతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ పన్నును పెంచినట్టైతే ఆ పన్నులు చెల్లించే ఐటీసీ సంస్థలపై భారం పడుతుంది. ఫలితంగా ఆ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారుల వైపు మళ్ళిస్తారు. కేవలం సిగరెట్ల ధరలు మాత్రమే కాకుండా 8వ వేతన సంఘం, పెట్రోల్, డీజిల్, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇంటెన్సివ్‌లు, ఇతర పన్నుల విలువలు తారుమారు కానున్నాయి. మొత్తానికి ఈ బడ్జెట్ ఏ మార్పును తీసుకురాబోతోందో చూడాల్సిందే..
Updated Date - 2023-01-31T18:14:11+05:30 IST