Deepika Padukone: దీపిక జిమ్‌కు వెళితే.. ట్రైనర్లకి చెమటలు పట్టాల్సిందే!
ABN, First Publish Date - 2023-02-05T10:10:32+05:30
దీపికా పదుకొనె (Deepika Padukone)ను ఏ సినిమాలో చూసినా ఆమెకిది తొలి చిత్రమా? అనిపించేంత యంగ్‌గా కనిపిస్తుంది.
దీపికా పదుకొనె (Deepika Padukone)ను ఏ సినిమాలో చూసినా ఆమెకిది తొలి చిత్రమా? అనిపించేంత యంగ్‌గా కనిపిస్తుంది. షారుక్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘పఠాన్’ (Pathaan)లో కూడా దీపిక ఎంతో ఫిట్‌గా కనిపించింది. ఆమె ఫిట్‌నెస్ (Fitness) రహస్యమేంటో చూద్దాం..
పలాటీస్..
దీపిక జిమ్‌కు వెళితే చాలు. శిక్షకులకు ముచ్చెమటలు పట్టాల్సిందే! ఎందుకంటే- ఆమె కోరుకునే కఠిన వ్యాయామాలు అలా ఉంటాయి మరి!. దీపిక శరీరాకృతిని బికినీ బాడీగా పేర్కొంటారు ఫిట్‌నెస్ నిపుణులు. అంత సన్నగా, నాజూగ్గా ఉంటుందా దేహం. ఆమె కొన్నేళ్ల నుంచీ ఇదే ఫిట్‌నెస్‌ను అనుసరిస్తోంది. తను రోజూ చేసే వర్కవుట్‌లలో ఒకటి పలాటీస్. ఇది మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే వ్యాయామం. ఇరవయ్యో శతాబ్దంలో జర్మనీకి చెందిన వ్యాయామ శిక్షకుడు జోసెఫ్ పలాటీస్ రూపొందించిన ఎక్సర్‌సైజ్ ఇది. అందుకనే ఆయన పేరు మీద ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పలాటీస్‌ను చేస్తారు. ఆస్ట్రేలియా, కెనడా, ద.కొరియా, అమెరికా, ఇంగ్లండ్ వాసులు ఎక్కువగా చేస్తారు. ‘‘పలాటీస్ రెగ్యులర్‌గా చేస్తే మానసిక, శారీరక ఒత్తిడి దూరం అవుతుంది. భుజాలు, కీళ్లు, కండరాలకు వచ్చే సమస్యలు తగ్గుతాయి. వెన్నునొప్పి పోతుంది’’ అంటుంది దీపిక.
స్ట్రెచింగ్..
ఒక రకంగా పురాతన యోగా వంటిదే ఇది. కండరాలు సౌకర్యవంతంగా, బలంగా, ఆరోగ్యంగా మారతాయి. దీపిక చేసే వ్యాయామాల్లో స్ట్రెచింగ్ కూడా ముఖ్యమైనది. కండరాలు పటిష్టంగా ఉన్నప్పుడే శరీరం పట్టుకోల్పోదు. వయసు పెరిగే కొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గడం సహజం. ఎందుకంటే వీటికి అవసరమైనంత రక్తసరఫరా సరిగా జరగదు. తద్వార నాడీవ్యవస్థ బలహీనపడుతుంది. ఇలా జరగకుండా స్ట్రెచింగ్ తోడ్పడుతుంది. కండరాలను సాగదీసి, తిరిగి ఉపశమనం కలిగించే పద్ధతులు ఇందులో ఉంటాయి. వీటిని నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో చేస్తే... కండరాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. రక్తపోటు సమస్యలు ఉండవు. గుండెకు కూడా భారం తగ్గుతుంది. ‘‘నేను జిమ్‌లోకి వెళితే మరిచిపోకుండా ఇరవై నిమిషాల పాటు తప్పనిసరిగా చేసే వ్యాయామాల్లో స్ట్రెచింగ్ ఒకటి. ఇది చేశాక మనసుకు ఎక్కడలేని సాంత్వన లభిస్తుంది..’’ అని పేర్కొంది దీపిక.
కిక్ బాక్సింగ్..
దీపిక చాలా ఉత్సాహంగా, ఇష్టంగా చేసే వ్యాయామాల్లో కిక్ బాక్సింగ్ తప్పక ఉంటుంది. ప్రాచీన గ్రీకుల కాలం నుంచి వస్తున్న ఈ క్రీడకు అన్ని దేశాల్లో అభిమానులు ఉన్నారు. కిక్ బాక్సింగ్‌ను బాక్సింగ్ రింగ్‌లో చేస్తుంటారు. బాక్సింగ్ గ్లౌజులు, మౌత్‌గార్డ్‌లు, షార్ట్స్ ధరించి చేయాలి. కాళ్లకు బూట్లు వేసుకోరు. సహజంగా దీనిని ఆత్మరక్షణ, ఫిట్‌నెస్‌ల కోసం చేస్తున్నప్పటికీ క్రీడాపోటీల్లో గెలిచేందుకు నేర్చుకుంటారు. కరాటే, ముయేథాయ్, జపనీస్ కిక్‌బాక్సింగ్, సాండా వంటివన్నీ ఇలాంటివే!. ‘‘కొన్ని పాత్రలకు తగ్గట్టు శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే కొన్ని ప్రత్యేక వ్యాయామాలను చేయిస్తుంటారు శిక్షకులు. అయితే నేను ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేసినా కిక్ బాక్సింగ్ మరిచిపోకుండా చేస్తుంటా. దీనివల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా మీద నాకే తెలియని నమ్మకం బలపడుతుంది. ఆత్మరక్షణ కోణంలో చూసినప్పుడు ప్రతి అమ్మాయి కిక్ బాక్సింగ్ నేర్చుకుంటే మేలు అనిపిస్తుంది’’ అని ఒక సందర్భంలో చెప్పిందీ బాలీవుడ్ భామ.
స్ట్రెంత్ ఎక్సర్‌సైజ్‌లు..
కఠినాతి కఠినమైన వ్యాయామాల్లో స్ట్రెంత్ ఒకటి. బలం కోసం చేసే ఎక్సర్‌సైజ్ అని ఈ పేరులోనే ఉంది. శరీరం బలంగా ఉండటానికి చేస్తారు. ఇందులో భాగంగా అధిక బరువులు ఎత్తడంతో పాటు విభిన్నమైన పద్ధతుల్లో వ్యాయామం చేయాలి. ఐసోమెట్రిక్, ప్లెమెట్రిక్స్ వంటి పద్ధతులు ఉంటాయి. కండరాలు, కీళ్లలోని లిగమెంట్స్ వంటివన్నీ శక్తిమంతంగా తయారవుతాయి. ఎరోబిక్ కూడా ఇందులో భాగమే! ఇలా చేయడం వల్ల ఎముకలు మరింత దృఢంగా మారడమే కాకుండా గుండె కండరాలు పటిష్టంగా మారతాయి. ‘‘రోజంతా చురుగ్గా ఉండటానికి స్ట్రెంత్ ఎక్సర్‌సైజులు ఒక టానిక్‌లా పనిచేస్తాయి’ అని పేర్కొంది దీపిక. ఇలా ఆమె రకరకాల వ్యాయామాలను చేస్తుంటుంది కాబట్టే ఇప్పటికీ ఇంత ఫిట్‌గా ఉండగలుగుతోంది.
Updated Date - 2023-02-05T10:10:34+05:30 IST